చౌరాసియానే చాంపియన్
గుర్గావ్: భారత గోల్ఫర్ ఎస్‌ఎస్‌పీ చౌరాసియా ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్‌ను వరుసగా రెండోసారి సాధించాడు. ఆదివారం స్థానిక డీఎల్‌ఎఫ్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్‌లో జరిగిన పోటీలో తను విజేతగా నిలిచాడు. చాంపియన్‌గా నిలిచినందుకు తను దాదాపు రూ.2 కోట్ల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. అలాగే ఆసియా టూర్‌లో భాగమైన ఈ ఇండియన్ ఓపెన్‌ను వరుసగా రెండో సారి సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో జ్యోతి రణ్‌ధావా (2006, 2007) ఇలా రెండుసార్లు టైటిల్ సాధించాడు.
ఓవరాల్‌గా చౌరాసియా ఈఘనత సాధించిన మూడో ఆటగాడు. కెంజీ హోసోయిషి (1967, 1968) తొలిసారిగా ఈ ఫీట్ సాధించారు. పోటీ చాలా కఠినంగా సాగినా టైటిల్ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందని 38 ఏళ్ల చౌరాసియా తెలిపాడు. ఆసియా టూర్ టైటిల్ నెగ్గడం ఈ కోల్‌కతా గోల్ఫర్‌కు ఇది ఆరోసారి. అలాగే మరో భారత గోల్ఫర్ అనిర్బన్ లాహిరి 2015లో ఈ టైటిల్ నెగ్గగా ఈసారి ఐదో స్థానంతో సరిపుచ్చుకున్నాడు.