
చైనా క్రికెట్ చాలా చీప్‌గా...
⇒28 పరుగులకే ఆలౌట్
⇒390 పరుగులతో సౌదీ అరేబియా ఘనవిజయం
చియాంగ్ మై (థాయిలాండ్): చైనా వస్తువులకు గ్యారంటీ ఉండదని, సుదీర్ఘ కాలం మన్నిక ఉండదని మనందరిలో సాధారణంగా ఉండే అభిప్రాయం. చైనా క్రికెట్ జట్టు కూడా అలా ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండటానికి ఇష్టపడలేదేమో! ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ క్వాలిఫయర్ (ఆసియా) టోర్నీలో భాగంగా సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌లో చైనా అతి చెత్త ప్రదర్శన నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో సౌదీ 390 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
419 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చైనా జట్టు 12.4 ఓవర్లలో 28 పరుగులకే కుప్పకూలింది. జట్టులో ఏడుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కాగా... ఇద్దరు చెరో 6 పరుగులు, మరొకరు 3 పరుగులు చేశారు. 13 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. ఇన్నింగ్స్ చివరి మూడు బంతులకు ముగ్గురు బ్యాట్స్‌మెన్ క్లీన్‌బౌల్డ్ అయి సౌదీ బౌలర్ రషీద్‌కు ‘హ్యాట్రిక్’ అందించారు. అంతకుముందు సౌదీ అరేబియా 50 ఓవర్లలో 418 పరుగులకు ఆలౌటైంది. అఫ్జల్ (120) సెంచరీ చేశాడు.