
అశ్విన్ అదుర్స్
జింఖానా, న్యూస్‌లైన్: కాస్మోస్ బౌలర్ అశ్విన్ (5/16) వికెట్లు పడగొట్టి నోబుల్ సీసీ జట్టును కట్టడి చేశాడు. దీంతో ఎ-డివిజన్ వన్డే లీగ్ భాగంగా నోబుల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కాస్మోస్ జట్టు 24 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత కాస్మోస్ జట్టు 7 వికెట్లకు 150 పరుగులు చేసింది. దినేష్ పవార్ (60) అర్ధ సెంచరీతో రాణించగా... నరేందర్ 35 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. నోబుల్ సీసీ బౌలర్ అభినయ్ 3 వికెట్లు తీశాడు. తర్వాత బరిలోకి దిగిన నోబుల్ సీసీ 126 పరుగుల వద్ద ఆలౌటైంది. తేజ (30) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు.
కరణ్ వైష్ణవ్ 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. మరో మ్యాచ్‌లో
కోల్ అక్రిలిక్ జట్టు బ్యాట్స్‌మెన్ అల్తాఫ్ యూనస్ (95), సూర్య దేవ్ కుమార్ (69) అర్ధ సెంచరీలతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించారు. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో అక్రిలిక్ జట్టు 156 పరుగుల తేడాతో రిలయన్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట అక్రిలిక్ 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. రిలయన్స్ బౌలర్లు అలంక్రిత్ 3, రిషబ్ 4 వికెట్లు పడగొట్టారు. తర్వాత లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రిలయన్స్ 9 వికెట్ల నష్టానికి 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రతీక్ 39 పరుగులు చే శాడు. అక్రిలిక్ బౌలర్ అఫ్తాబ్ 4 వికెట్లు తీసుకున్నాడు.