జొహన్నెస్బర్గ్: పొరుగునే ఉన్న జింబాబ్వే క్రికెట్ కు సహకరించాలనే యోచన తమ దేశ క్రికెట్ బోర్డుకు ఏ రోజూ ఉండదని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మకాయా ఎన్తిని విమర్శించాడు. జింబాబ్వే క్రికెట్ పరంగా వెనుకబడి ఉన్నా, పక్కనే ఉన్నక్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) అసలు పట్టించుకోలేక పోవడం నిజంగా బాధాకరమన్నాడు. తాజాగా జింబాబ్వే క్రికెట్కు ప్రధాన కోచ్ గా ఎంపికైన ఎన్తిని తన కొత్త బాధ్యత పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.
జింబాబ్వే క్రికెట్ ను మెరుగు పరిచే క్రమంలోనే తాను జింబాబ్వే కోచ్ పదవిని స్వీకరించినట్లు స్పష్టం చేశాడు. దీంతో పాటు జింబాబ్వే క్రికెట్ పట్ల దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వ్యవహరించే తీరు ఎంతమాత్రం సరైన దిశలో లేదన్నాడు. అసలు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఏ ప్రణాళికతో ముందుకెళుతుందో తనకు తెలియదన్నాడు. మిగతా దేశాలతో ఆడటానికి మొగ్గు చూపే దక్షిణాఫ్రికా.. ఏ రోజూ జింబాబ్వే సిరీస్ ఆడి వారికి అండగా నిలబడాలనే యోచనే లేకపోవడం నిజంగా బాధాకరమన్నాడు.