ఇలా కూడా ఔటవుతారా!
క్రికెట్ చరిత్రలో ఇది ఒక రకంగా అద్భుతమే. ఇప్పటివరకు ఏ బ్యాట్స్‌మన్ ఇలా అవుటై ఉండకపోవచ్చు. ఆస్ట్రేలియా ఓపెనర్, స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ అవుటైన తీరు చాలా విచిత్రంగా ఉంది. దక్షిణాఫ్రికాతో హోబర్ట్ నగరంలో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఈ చిత్రం చోటుచేసుకుంది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన వార్నర్.. మరో లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి అప్పటికి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కైల్.. ఇన్నింగ్స్ 23వ ఓవర్లో ఓ బంతి వేశాడు.
దాన్ని లెగ్‌సైడ్‌కు పంపాలని వార్నర్ ప్రయత్నించాడు. కానీ, ఆ బంతి ముందుగా అతడి తొడకు తగిలి, ఆ తర్వాత మోచేతికి తగిలింది. ఆ వెంటనే వెనకాల ఉన్న వికెట్లను ముద్దుపెట్టుకుంది. ఏం జరిగిందోనని ఆశ్చర్యపోతూ వార్నర్ వెనక్కి తిరిగి చూసేసరికే బెయిల్స్ కింద పడ్డాయి. వార్నర్ ఇలా అవుటైన తీరును స్వయానా వార్నర్ గానీ, కోచ్ డారెన్ లేమన్ గానీ, జట్టులో మి గిలిన సభ్యులు గానీ ఏమా్తరం నమ్మలేకపోయారు. ఈ వికెట్ పడటం ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బ అయింది. అప్పటికే రెండో వికెట్‌కు ఖ్వాజాతో కలిసి 79 పరుగులు జోడించిన వార్నర్.. వ్యక్తిగతంగా 45 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో జో బర్న్స్ పరుగులు ఏమీ చేయకుండానే తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. చేతిలో 8 వికెట్లు మిగిలి ఉండగా.. మూడోరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 120 పరుగులు వెనకబడి ఉంది.