‘రజత’ కాంతలు...
- ఫైనల్లో ఓడిన భారత మహిళల జట్టు
- ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్
కొపెన్‌హగెన్ (డెన్మార్క్): ఆరంభం అద్భుతంగా ఉన్నా... ఆ తర్వాత తడబాటుకు లోనై భారత ఆర్చరీ మహిళల జట్టు కొత్త చరిత్రను సృష్టించే అవకాశాన్ని చేజార్చుకుంది. ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రెండోసారీ రజత పతకంతో సంతృప్తి పడింది. ఆదివారం జరిగిన మహిళల రికర్వ్ టీమ్ ఫైనల్లో దీపిక కుమారి, లక్ష్మీరాణి మాఘీ, రిమిల్ బురిలీలతో కూడిన భారత జట్టు 4-5 స్కోరుతో ఇనా స్టెపనోవా, తుయానా దషిదోర్జియెవ్, సెనియా పెరోవాలతో కూడిన రష్యా జట్టు చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్‌ను 56-54తో నెగ్గి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లిన టీమిండియా... రెండో సెట్‌ను 54-53తో సొంతం చేసుకొని 4-0తో మందంజ వేసింది. అయితే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను బోల్తా కొట్టించిన రష్యా వెంటనే తేరుకుంది. మూడో సెట్‌ను 56-52తో, నాలుగో సెట్‌ను 54-50తో దక్కించుకొని స్కోరును 4-4తో సమం చేసింది.
ఇరు జట్ల స్కోరు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. షూట్ ఆఫ్‌లో భారత్ 27 పాయింట్లు స్కోరు చేయగా... రష్యా 28 పాయింట్లు సాధించి తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. తొలి రెండు సెట్‌లలో అద్భుత గురితో ఆకట్టుకున్న భారత క్రీడాకారిణులు మూడో, నాలుగో సెట్‌లలో పేలవ ప్రదర్శన కనబరిచారు. దీపిక నిలకడగా రాణించినా... లక్ష్మీరాణి, రిమిల్ కీలకదశలో గురి తప్పి బాణాలను ఆరు, ఏడు పాయింట్ల వలయంలోకి కొట్టారు. ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మహిళల జట్టుకు రజతం లభించడం ఇది రెండోసారి. 2011లోనూ దీపిక కుమారి, బొంబేలా దేవి, చక్రవోలు స్వురోలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 207-210తో ఇటలీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.
మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో లక్ష్మీరాణి మాఝీకి కాంస్య పతకం చేజారింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో లక్ష్మీరాణి 4-6 (28-26, 24-29, 27-28, 29-27, 27-29) స్కోరుతో చౌ మిసున్ (దక్షిణ కొరియా) చేతిలో పరాజయం పాలైంది. ఓవరాల్‌గా ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్ భారత్‌కు మంచి ఫలితాలనే ఇచ్చింది. మహిళల రికర్వ్ జట్టు రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందడమే కాకుండా రజత పతకం సాధించగా... పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో మంగళ్‌సింగ్ చాంపియా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొని రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందాడు. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజత్ చౌహాన్ రజత పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఆర్చర్‌గా గుర్తింపు పొందాడు.