
'నా బయోపిక్ కు సిద్ధంగా ఉన్నా'
న్యూఢిల్లీ:ఇటీవల కాలంలో క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయాల్నినమోదు చేసిన సంగతి తెలిసిందే. క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా వచ్చిన భాగ్ మిల్కా భాగ్, మేరీకోమ్, ఎంఎస్ ధోని తదితర చిత్రాలు కాసుల వర్షాన్ని కురిపించడమే కాకుండా, ఆయా క్రీడాకారుల మంచి కీర్తిని తెచ్చిపెట్టాయి. అయితే ప్రస్తుతం తన బయోపిక్ ను ఎవరైనా నిర్మించడానికి ఆసక్తి కనబరిస్తే తాను కూడా సిద్ధంగా ఉన్నట్లు రియో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ స్పష్టం చేసింది.
'ఎవరైనా నా బయోపిక్ను నిర్మించడానికి వస్తే నేను అందుకు సిద్ధంగా ఉన్నా. గేమ్ను అభివృద్ధి చేయడానికి నా బయోపిక్ ఉపయోగపడుతుందంటే నేను కాదనే ప్రసక్తే లేదు. స్ఫూర్తిదాయకమైన కథలను తెరకెక్కించేటప్పుడు అభ్యంతరం ఎందుకు చెప్పాలి. దాని వల్ల పలువురు యువకులకు గేమ్పై ఆసక్తి కూడా పెరుగుతుంది' అని మాలిక్ పేర్కొంది. అయితే తనకంటూ ఫేవరెట్ నటీమణులు ఎవ్వరూ లేరని ఒక ప్రశ్నకు సమాధానంగా సాక్షి చెప్పింది.