ఎదురీదుతున్నగంభీర్ సేన
బెంగళూరు: విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా గుజరాత్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో ఢిల్లీ ఎదురీదుతోంది. గుజరాత్ విసిరిన 274 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన గౌతం గంభీర్ సేన ఆదిలోనే కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఢిల్లీ ఓపెనర్లు రిషబ్ పాంట్(0), శిఖర్ ధవన్(5), కెప్టెన్ గౌతం గంభీర్(9), మిలింద్ కుమార్(0) వరుసగా పెవిలియన్ కు చేరారు.అనంతరం ఉన్ముక్ చంద్(33) వెనుదిరగడంతో ఢిల్లీ 59 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. గుజరాత్ బౌలర్లలో ఆర్పీ సింగ్ నాలుగు వికెట్లు సాధించగా, భుమ్రాహ్ కు ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు గుజరాత్ కెప్టెన్ పార్థీవ్ పటేల్ సెంచరీతో అదరగొట్టి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. కీలక మ్యాచ్ లో పార్థీవ్ పటేల్(105;119 బంతుల్లో 10 ఫోర్లు) దుమ్మురేపాడు. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ .. గుజరాత్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ ఆదిలోనే ప్రియాంక్ పంచాల్(14) వికెట్ ను కోల్పోయింది. అనంతరం భార్గవ్ మెరాయ్(5) కొద్ది వ్యవధిలోనే రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు.
ఈ తరుణంలో పార్థీవ్ కు రుజు భట్ జతకలిశాడు. వీరిద్దరూ మంచి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు కదిలించారు.ఈ జోడీ మూడో వికెట్ కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే రిజు భట్(60) హాఫ్ సెంచరీ, పార్థీవ్ పటేల్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ 193 పరుగుల వద్ద వరుసగా పెవిలియన్ చేరినా.. ఆ తరువాత చిరాగ్ గాంధీ(44 నాటౌట్ ), కలారియా(21) సమయోచితంగా ఆడటంతో గుజరాత్ 273 పరుగులను స్కోరు బోర్డుపై ఉంచింది.