డ్యూరాండ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేత ఆర్మీ గ్రీన్
న్యూఢిల్లీ: ఆసియాలో అతి పురాతన, ప్రపంచంలో మూడో పురాతన ఫుట్‌బాల్ టోర్నమెంట్ అయిన డ్యూరాండ్ కప్‌లో ఆర్మీ గ్రీన్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్మీ గ్రీన్ ‘పెనాల్టీ షూటౌట్’లో 6-5తో నెరోకా ఫుట్‌బాల్ క్లబ్‌పై విజయం సాధించింది. నిర్ణీత 90 నిమిషాలు, ఆ తర్వాత అదనపు 30 నిమిషాల్లో రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.
విజేతగా నిలిచిన ఆర్మీ గ్రీన్ జట్టుకు రూ. 45 లక్షలు... రన్నరప్ నెరోకా జట్టుకు రూ. 20 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. 2006 తర్వాత డ్యూరాండ్ కప్‌ను ఆర్మీ జట్టు గెలవడం ఇదే ప్రథమం. 1888లో మొదలైన డ్యూరాండ్ కప్‌లో మోహన్ బగాన్ క్లబ్, ఈస్ట్ బెంగాల్ క్లబ్ 16 సార్లు చొప్పున విజేతలుగా నిలిచాయి. హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టు నాలుగుసార్లు ఈ టోర్నీ టైటిల్‌ను సాధించింది.