
పసిడితో ‘పోల్‌వాల్ట్’కు వీడ్కోలు
మాస్కో (రష్యా): ‘రికార్డుల రారాణి’ ఎలీనా ఇసిన్‌బయేవా తన 14 ఏళ్ల కెరీర్‌కు పసిడి పతకంతో వీడ్కోలు పలికింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఈ రష్యా స్టార్ పోల్‌వాల్ట్‌లో విజేతగా నిలిచింది. 31 ఏళ్ల ఇసిన్‌బయేవా 4.89 మీటర్ల ఎత్తుకు ఎగిరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జెన్నిఫర్ సుర్ (అమెరికా-4.82 మీటర్లు) రజతం... యారిస్లె సిల్వా (క్యూబా-4.82 మీటర్లు) కాంస్యం సాధించారు. 2005, 2007 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కూడా ఆమె స్వర్ణాలు నెగ్గింది.
తన కెరీర్‌లో ఇసిన్‌బయేవా 30 సార్లు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. పురుషుల 400 మీటర్ల రేసులో 2009 వరల్డ్ చాంపియన్ లషాన్ మెరిట్ (అమెరికా-43.74 సెకన్లు) స్వర్ణ పతకం సాధించాడు. పురుషుల 800 మీటర్ల రేసులో మహ్మద్ అమన్ (ఇథియోపియా-1ని:43.31 సెకన్లు) విజేతగా నిలిచాడు. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో చెమోస్ చెవా (కెన్యా-9ని:11.65 సెకన్లు) పసిడి పతకం సొంతం చేసుకుంది. మహిళల 20 కిలోమీటర్ల నడకలో లష్మనోవా (రష్యా-1గం:27ని:08 సెకన్లు) విజేతగా నిలిచింది.
వికాస్ గౌడకు ఏడో స్థానం: పురుషుల డిస్కస్ త్రోలో భారత క్రీడాకారుడు వికాస్ గౌడ డిస్క్‌ను 64.03 మీటర్ల దూరం విసిరి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రాబర్ట్ హార్టింగ్ (జర్మనీ-69.11 మీటర్లు) స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు.