పోరాడుతున్న ఇంగ్లండ్
పెర్త్: యాషెస్ సిరీస్‌ను గెలుచుకునే దిశగా ఆస్ట్రేలియా మరింత చేరువైంది. 504 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్ సోమవారం నాలుగో రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (96 బంతుల్లో 72 బ్యాటింగ్; 12 ఫోర్లు) జట్టును రక్షించేందుకు పోరాడుతుండగా... కీపర్ ప్రయర్ (7 బ్యాటింగ్) అతనితో పాటు క్రీజ్‌లో ఉన్నాడు. ఆఖరి రోజు విజయానికి అవసరమైన మరో 253 పరుగులను ఇంగ్లండ్ సాధించడం దాదాపు అసాధ్యమే! వరుసగా మూడు యాషెస్‌లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఈసారి ‘బూడిద’ గెలుచుకునేందుకు మరో ఐదు వికెట్ల దూరంలో ఉంది. గాయం కారణంగా బ్రాడ్ బ్యాటింగ్‌కు దిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దాంతో నాలుగు వికెట్లు తీయగలిగితే సిరీస్ ఆసీస్ వశమవుతుంది.
వాట్సన్ సెంచరీ...
అంతకుముందు 235/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 369 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 504 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒక జట్టు వరుసగా మూడు టెస్టుల్లో 500కు పైగా లక్ష్యాన్ని ముందుంచడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. సోమవారం ఆటలో వాట్సన్ సెంచరీ, బెయిలీ మెరుపు ఇన్నింగ్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. క్రీజ్‌లో రాగానే తొలి ఓవర్ నుంచి వాట్సన్ దూకుడు ప్రదర్శించాడు. మరోవైపు బెయిలీ అండర్సన్ ఓవర్‌ను చితక్కొట్టడంతో జట్టు ఓవరాల్ ఆధిక్యం 500 పరుగులు దాటింది.
పాపం కుక్...
కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్‌కు ఈ మ్యాచ్ పీడకలగా మారింది. హారిస్ వేసిన రెండో ఇన్నింగ్స్ తొలి బంతికే కుక్ (0) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. కుక్ ఇలా అవుట్ కావడం ఇదే తొలిసారి. వందో టెస్టులో తొలి బంతికే డకౌట్ అయిన మొదటి బ్యాట్స్‌మన్‌గా కూడా కుక్ నిలిచాడు. ఆ తర్వాత కార్‌బెరీ (31), రూట్ (19), పీటర్సన్ (45), బెల్ (60)ల అవుట్‌తో జట్టు కష్టాలు మరింత పెరిగాయి.
ఒకే ఓవర్లో 28 పరుగుల ప్రపంచ రికార్డు సమం చేసిన బెయిలీ
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ జార్జ్ బెయిలీ ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ వేసిన ఓవర్లో బెయిలీ 28 పరుగులు చేశాడు. సరిగ్గా పదేళ్ల క్రితం (14/12/03) విండీస్ బ్యాట్స్‌మన్ లారా (4,6,6,4,4,4) ఈ ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ పీటర్సన్ బౌలింగ్‌లో లారా ఈ స్కోరు చేశాడు. అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 87వ ఓవర్లో బెయిలీ ఈ ఘనత సాధించాడు. అతను వరుసగా 4,6,2,4,6,6 పరుగులు చేశాడు. అప్పటి వరకు 24 బంతుల్లో 11 పరుగులు చేసిన బెయిలీ ఈ ఓవర్ తర్వాత 30 బంతుల్లో 39 పరుగులకు చేరాడు.