పేయట్ సంచలనం | Euro 2016: Wales defeat Slovakia 2-1 in a hard-fought encounter | Sakshi
Sakshi News home page

పేయట్ సంచలనం

Published Sun, Jun 12 2016 3:34 AM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

పేయట్ సంచలనం

పేయట్ సంచలనం

* ఆఖరి నిమిషాల్లో గోల్‌తో అద్భుతం
* 2-1తో రొమేనియాపై నెగ్గిన ఫ్రాన్స్ యూరో కప్

పారిస్: క్షణాలు ఆవిరైపోతున్నాయి... ఉత్కంఠ అంతకంతకు పెరిగిపోతోంది... కిక్కిరిసిన స్టేడియం కాస్త నిశ్శబ్దంగా మారిపోతోంది.... ఇక ఆట ముగియడానికి మిగిలింది ఒక్క నిమిషమే... అటు ఆటగాళ్లలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ... ఎటు చూసిన ఉద్విగ్న క్షణాలే... ఆతిథ్య హోదాలో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే డ్రా తప్పదేమో అనుకుంటున్న తరుణంలో... మిడ్‌ఫీల్డర్ దిమ్రితి పేయట్ సంచలన గోల్‌తో ఫ్రాన్స్‌ను గట్టెక్కించాడు.

89వ నిమిషంలో తనను రౌండ్ చేసిన ఐదుగురు రొమేనియా ఆటగాళ్ల మధ్య నుంచి బంతిని మెల్లగా ముందుకు తెస్తూ బలహీనమైన లెఫ్ట్ ఫుట్‌తో బంతిని కర్ల్ చేస్తూ కళ్లు చెదిరే రీతిలో గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. అంతే యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శుక్రవారం  రాత్రి జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2-1తో రొమేనియాపై గెలిచి సంబరాల్లో మునిగిపోయింది. తొలి అర్ధభాగంలో ఇరుజట్లు హోరాహోరీగా తలపడటంతో వచ్చిన అవకాశాలన్నీ వృథా అయ్యాయి.

అయితే 57వ నిమిషంలో ఒలివర్ గిరౌడ్ ముందుకు దూసుకొచ్చి ధైర్యంగా కొట్టిన హెడర్.. రొమేనియా గోల్‌పోస్ట్‌ను ఛేదించింది. అయితే మరో ఎనిమిది నిమిషాల తర్వాత లభించిన పెనాల్టీ స్పాట్‌ను బోగ్దాన్ స్టాంక్ (రొమేనియా) అద్భుతమైన గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. తర్వాత ఫ్రాన్స్ ఎన్ని ఎదురుదాడులు చేసిన రొమేనియా రక్షణశ్రేణి సమర్థంగా తిప్పికొట్టడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. చివరి నిమిషాల్లో దిమిత్రి ఆపద్బాంధవుడిలా వచ్చి జట్టును గట్టెక్కించాడు.
 
స్విట్జర్లాండ్ గెలుపు
మరో మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 1-0తో అల్బేనియాపై నెగ్గింది. ఆట ఐదో నిమిషంలోనే గ్జెహర్డిన్ షాకిరి ఇచ్చిన కార్నర్ పాస్‌ను ఆరడుగుల రెండు అంగుళాల ఎత్తు కలిగిన సెంటర్ బ్యాక్ ఫ్యాబిన్ సాచేర్ అమాంతం గాల్లోకి లేచి తలతో బాదాడు. అంతే గింగరాలు తిరుగుతూ బంతి నెట్‌లోకి దూసుకుపోయింది. దీంతో స్విస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

26వ నిమిషంలో అల్బేనియాకు స్కోరును సమం చేసే అవకాశం వచ్చినా... టౌలెంట్ జకా కొట్టిన బంతి క్రాస్ బార్ పైనుంచి వెళ్లింది. ఇక ఇక్కడి నుంచి ఇరుజట్లు పరస్పరం దాడులు చేసుకున్నా ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.
 
వేల్స్ అదుర్స్

యూరో చరిత్రలో బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే వేల్స్ అదరగొట్టింది.  శనివారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో వేల్స్ 2-1తో స్లోవేకియాపై నెగ్గింది. స్టార్ మిడ్‌ఫీల్డర్ గ్యారెత్ బేల్ (10వ ని.), రాబ్సన్ కాను (81వ ని.) వేల్స్ తరఫున గోల్స్ చేయగా... ఆండ్రేజ్ డుడా (61వ ని.) స్లోవేకియాకు గోల్ సాధించిపెట్టాడు.  మ్యాచ్‌లో  అన్ని విభాగాల్లో వేల్స్ ఆకట్టుకుంది.  

10వ నిమిషంలో విలియమ్స్ ఇచ్చిన పాస్‌ను 30 అడుగుల దూరం నుంచి బేల్ అద్భుతమైన ఫ్రీ కిక్‌తో గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. దీంతో వేల్స్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి అర్ధభాగంలో కాస్త నిరాశ చెందిన స్లోవేకియన్లు.. రెండో అర్ధభాగంలో పూర్తిగా ఎదురుదాడులకు దిగారు. ఫలితంగా పటిష్టమైన వేల్స్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ రైట్ ఫ్లాంక్ నుంచి మ్యాక్ ఇచ్చిన పాస్‌ను సబ్‌స్టిట్యూట్ డుడా బాటమ్ కార్నర్ నుంచి గోల్‌పోస్ట్‌లోకి పంపాడు.

దీంతో స్కోరు 1-1తో సమమైంది. ఇక ఇక్కడి నుంచి ఇరుజట్లు గోల్స్ కోసం హోరాహోరీగా పోరాడాయి. బేల్‌ని కార్నర్ చేస్తూ స్లోవేకియా పన్నిన వ్యూహాలను వేల్స్ ఆటగాళ్లు తిప్పికొట్టారు. ఫలితంగా ఆట మరో తొమ్మిది నిమిషాల్లో ముగుస్తుందనగా రాబ్సన్ కాను వేల్స్‌కు రెండో గోల్ అందించి జట్టును గెలిపించాడు.
 
యూరో’లో నేడు
 టర్కీ X క్రొయేషియా
 సా.గం. 6.30 నుంచి
 పోలాండ్ X నార్తర్న్ ఐర్లాండ్
 రా.గం. 9.30 నుంచి
 జర్మనీ X ఉక్రెయిన్
 రా.గం. 12.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement