మానవ్‌జిత్ విఫలం
గ్రనాడా (స్పెయిన్): ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గుతాడని ఆశించిన భారత అగ్రశ్రేణి ట్రాప్ షూటర్ మానవ్‌జిత్ సింగ్ సంధూ కీలకదశలో తడబడ్డాడు. క్వాలిఫయింగ్ తొలి నాలుగు రౌండ్లలో 25కు 25 పాయింట్లు స్కోరు చేసి 100 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచిన ఈ ప్రపంచ మాజీ చాంపియన్ చివరిదైన ఐదో రౌండ్‌లో రెండుసార్లు గురితప్పాడు. 25 పాయింట్లకు 23 సాధించాడు. ఓవరాల్‌గా 123 పాయింట్లతో మరో ఆరుగురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు. మరో నలుగురు 124 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరారు. దాంతో ఫైనల్లో మిగిలిన రెండు స్థానాల కోసం ఆరుగురి మధ్య ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. ‘షూట్ ఆఫ్’లో మానవ్‌జిత్ విఫలమయ్యాడు. తుదకు పదో స్థానంలో నిలిచాడు. టాప్-6లో ఉన్నవారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత షూటర్లు అనీసా సయ్యద్ 14వ, రాహీ సర్నోబాత్ 21వ, పుష్పాంజలి రాణా 53వ స్థానాల్లో నిలిచారు.