
ఫజెల్ అట్రాచలి (ఫైల్ ఫొటో)
ముంబై: క్రికెట్ క్రేజీ దేశంలో ఐపీఎల్ తర్వాత అంతగా ప్రాచుర్యం పొందిన లీగ్ ఏదైనా ఉందంటే అది ప్రొ కబడ్డీ లీగే (పీకేఎల్). మళ్లీ కబడ్డీ కూతతో ఆరోసీజన్ సిద్దమైంది. తాజా సీజన్ కోసం బుధవారం నిర్వహించిన వేలంలో ఇరానీ ఆటగాడు ఫజెల్ అట్రాచలి కోటి రూపాయలు పలికి రికార్డు సృష్టించాడు. దీంతో ఫజెల్ పీకేఎల్ చరిత్రలో అధిక ధర పలికిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. యు ముంబా జట్టు ఫజెల్‌ను కోటిరూపాయలకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో 93 లక్షలతో భారత ఆటగాడు నితిన్ తోమర్ రికార్డు నమోదు చేశాడు. పీకేఎల్ లీగ్‌లో ఫజెల్ బెస్ట్ డిఫెండర్‌గా గుర్తింపుపొందాడు. అతని టాకిల్ పాయింట్స్ 152. ఇక 11 సార్లు హైఫైవ్స్( ఒక మ్యాచ్‌లో 5 పాయింట్లు) సాధించాడు. 12 ఫ్రాంచైజీల్లో 9 ఫ్రాంచైజీలు ఇప్పటికే 21 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. ఒక ఫ్రాంచైజీ గరిష్టంగా ముగ్గురిని రిటెయిన్ చేసుకోవచ్చు. వేలం రేపు కూడా కొనసాగనుంది.
ఈ సీజన్ వేలంలో మొత్తం 422 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండగా... ఇందులో 14 దేశాలకు చెందిన 58 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వీరంతా ఇరాన్, బంగ్లాదేశ్, జపాన్, కెన్యా, కొరియా, మలేసియా, శ్రీలంక తదితర దేశాల ఆటగాళ్లు. ఈసారి కొత్తగా ఫ్యూచర్ కబడ్డీ హీరోస్ (ఎఫ్‌కేహెచ్) వేలంలోకి వచ్చారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిభాన్వేషణ పోటీల ద్వారా వీరంతా పీకేఎల్ వేలానికి అర్హత సంపాదించారు. పీకేఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్ల కొనుగోలు కోసం గరిష్టంగా రూ. 4 కోట్లు ఖర్చు చేయొచ్చు. జట్టులో కనిష్టంగా 18 మంది, గరిష్టంగా 25 మందికి మించకుండా ఆటగాళ్లను కొనాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment