
సచిన్ టెండూల్కర్ అందరికీ బాగా తెలుసు, సింధు, సైనాలంటే గుర్తు. కానీ నితిన్ తోమర్ అంటే తెలిసింది... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలంతోనే. గత వేలంలో అతను ఏకంగా రూ. 93 లక్షలు పలికాడు. దీంతో ప్రొ కబడ్డీ లీగ్ విలువేంటో అందరికీ ఈ పాటికే అర్థమైవుంటుంది. ఇప్పుడు మళ్లీ వేలం జరుగనుంది. ఈసారి రూ. కోటిని అందుకునే ఆటగాడెవరైనా ఉంటారో చూడాలి.
ముంబై: క్రికెట్ క్రేజీ దేశంలో ఐపీఎల్ తర్వాత అంతగా ప్రాచుర్యం పొందిన లీగ్ ఏదైనా ఉందంటే అది ప్రొ కబడ్డీ లీగే (పీకేఎల్). బ్యాడ్మింటన్ లీగ్ ఆడుతూ... ఆగింది. మళ్లీ సాగుతోంది. కానీ పీకేఎల్ ప్రారంభమైనప్పటి నుంచి నిరాటంకంగా జరుగుతూనే ఉంది. 8 ఫ్రాంచైజీలు 12కు చేరాయి. ప్రేక్షకుల్లో పెరిగిన క్రేజ్‌ను చూసిన నిర్వాహకులు ఒక ఏడాదైతే రెండు సార్లు పీకేఎల్ నిర్వహించారు. తాజాగా మళ్లీ కబడ్డీ కూత వేలంతో వార్తల్లోకి వచ్చింది. ఆరో సీజన్‌కు ముందు ఆటగాళ్ల వేలాన్ని నేడు, రేపు ఇక్కడి ఓ స్టార్ హోటల్‌లో నిర్వహించనున్నారు. 12 ఫ్రాంచైజీల్లో 9 ఫ్రాంచైజీలు ఇప్పటికే 21 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. ఒక ఫ్రాంచైజీ గరిష్టంగా ముగ్గురిని రిటెయిన్ చేసుకోవచ్చు. అయితే మిగతా మూడు ఫ్రాంచైజీలు మాత్రం జట్టునంతా కొత్త కూర్పుతో నింపేసేందుకు సిద్ధమయ్యాయి. యూపీ యోధ, యు ముంబా, జైపూర్ పింక్ పాంథర్స్ ఏ ఒక్క ఆటగాడిని అట్టిపెట్టుకోలేదు.
కొత్తగా ఫ్యూచర్ కబడ్డీ హీరోస్...
ఈ సీజన్ వేలంలో మొత్తం 422 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండగా... ఇందులో 14 దేశాలకు చెందిన 58 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వీరంతా ఇరాన్, బంగ్లాదేశ్, జపాన్, కెన్యా, కొరియా, మలేసియా, శ్రీలంక తదితర దేశాల ఆటగాళ్లు. ఈసారి కొత్తగా ఫ్యూచర్ కబడ్డీ హీరోస్ (ఎఫ్‌కేహెచ్) వేలంలోకి వచ్చారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిభాన్వేషణ పోటీల ద్వారా వీరంతా పీకేఎల్ వేలానికి అర్హత సంపాదించారు. పీకేఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్ల కొనుగోలు కోసం గరిష్టంగా రూ. 4 కోట్లు ఖర్చు చేయొచ్చు. జట్టులో కనిష్టంగా 18 మంది, గరిష్టంగా 25 మందికి మించకుండా ఆటగాళ్లను కొనాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment