పోరాడి ఓడిన ఢిల్లీ దబాంగ్
అషు మాలిక్ సూపర్-10 వృథా
ప్రొ కబడ్డీ లీగ్
హైదరాబాద్, నవంబర్ 5: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మరో ఆసక్తికర పోరు అభిమానులను అలరించింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యూ ముంబా 32-26తో దబాంగ్ ఢిల్లీపై అద్భుత విజయం సాధించింది. మంజీత్(9 పాయింట్లు), జాఫర్దనేశ్(5), సోమ్‌బీర్(3)..యూ ముంబా విజయంలో కీలకమయ్యారు. లీగ్‌లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, రెండు ఓటములు, ఒక టై ఎదుర్కొన్న ముంబా ప్రస్తుతం 19 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. మరోవైపు పోరాడి ఓడిన ఢిల్లీ 14 పాయింట్లతో 10వ స్థానంలో ఉంది. ఢిల్లీకి ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం విశేషం. ఢిల్లీ తరఫున అషు మాలిక్(11) సూపర్-10 సాధించినా లాభం లేకపోయింది. యోగేశ్(6), రింకూ నార్వల్(2) ఆకట్టుకున్నారు.
ఆది నుంచే హోరాహోరీ: యూ ముంబా, దబాంగ్ ఢిల్లీ ఆది నుంచే హోరాహోరీగా తలపడ్డాయి. స్టార్ రైడర్ నవీన్‌కుమార్ లేకుండానే ఢిల్లీ బరిలోకి దిగగా, యూ ముంబా సమిష్టి తత్వాన్ని నమ్ముకుంది. ఇరు జట్లు తమ తొలి రైడ్లలో పాయింట్లను సొంతం చేసుకోలేకపోయాయి. లీగ్‌లో వరుస ఓటములతో ఢిల్లీ తల్లడిల్లుతుంటే యూ ముంబా ప్రయాణం పడుతూలేస్తూ అన్నట్లు సాగుతున్నది. సందీప్‌ను ఔట్ చేసిన అజిత్ చవాన్..ముంబాకు తొలి పాయింట్ అందించగా, డూ ఆర్ డైకు వెళ్లిన ఢిల్లీ రైడర్ అషు మాలిక్..పర్వేశ్‌ను ఔట్ చేసి ఢిల్లీ పాయింట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత గేర్ మార్చిన యూ ముంబాకు మంజీత్ ఒకే రైడ్‌లో రెండు పాయింట్లు అందించి మంచి జోష్ నింపాడు.
మరోవైపు అషు మాలిక్ వరుస రైడ్లలో ఢిల్లీకి పాయింట్లు అందిస్తూ పోవడంతో ఇరు జట్లు స్కోరు సమంగా సాగింది. ఢిల్లీ రైడర్ వినయ్ ఉత్త చేతులతో తిరిగిరాగా, అషు మాలిక్ తనదైన జోరు కొనసాగించాడు. మ్యాచ్ 13వ నిమిషంలో మంజీత్ స్థానంలో లోకేశ్ ముంబా జట్టులోకి వచ్చాడు. 11వ నిమిషంలో ముంబా రైడర్ జాఫర్దనేశ్..రింకూ నార్వల్‌ను ఔట్ చేసి జట్టును ముందంజలో నిలిపాడు. అయితే 8వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన జాఫర్దనేశ్‌కు యోగేశ్ నుంచి చుక్కెదురైంది. ఇలా ఇరు జట్ల రైడర్లు, డిఫెండర్లు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో ప్రథమార్ధం ముగిసే సరికి యూ ముంబా 13-13 ఢిల్లీ దబాంగ్ సమవుజ్జీలుగా నిలిచాయి.
అదే దూకుడు: కీలకమైన ద్వితీయార్ధంలోనూ ఇరు జట్ల ప్లేయర్లు అదే దూకుడు కొనసాగించారు. ఎక్కడా వెనుకకు తగ్గకుండా పాయింట్ల వేటలో దూసుకెళ్లారు. డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన ఢిల్లీ రైడర్ మోహిత్‌ను సోమ్‌భీర్ గట్టిగా పట్టుకోవడంతో ముంబా ఖాతాలో పాయింట్ చేరింది. అదే ఊపులో 17వ నిమిషంలో యోగేశ్, సందీప్‌ను ఔట్ చేసిన మంజీత్..ముంబాకు రెండు పాయింట్లు అందించాడు. నిమిషం తేడాతో జాఫర్దనేశ్..అశిష్, రింకూ నార్వల్‌ను ఔట్ చేయడంతో ఢిల్లీ తొలిసారి ఆలౌటైంది. ఈ క్రమంలో రెండు జట్లు సబ్‌స్టిట్యూషన్స్‌కు మొగ్గుచూపుతూ మార్పులు చేశాయి.
ఓవైపు ఢిల్లీకి అషు మాలిక్ కీలకమైతే..మరోవైపు యూ ముంబాకు సునీల్ పెద్దదిక్కు అయ్యాడు. ఆట సాగుతున్నా కొద్ది యూ ముంబా కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అషు మాలిక్ రైడింగ్‌కు వెళ్లిన ప్రతీసారి ఢిల్లీకి పాయింట్ అందించడంలో సఫలమయ్యాడు. అయితే అతనికి రైడింగ్‌లో సహకరించే వారు కరువయ్యారు. మ్యాచ్ 6వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన రోహిత్ రాఘవ్‌ను బిజేంద్ర పట్టేయడంతో ఢిల్లీకి పాయిట్ దక్కింది. మ్యాచ్ చివరి క్షణాల్లో ఢిల్లీ గెలిచేందుకు ప్రయత్నించినా..పట్టు వదలకుండా పోరాడిన యూ ముంబా విజయం సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment