
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో రెండోసారి చాంపియన్‌గా అవతరించేందుకు యు ముంబా జట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి మూడు సీజన్‌లలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు ఒకసారి విజేతగా (2015లో), రెండుసార్లు రన్నరప్‌గా (2014, 2016) నిలిచిన యు ముంబా జట్టు ఆ తర్వాత వెనుకబడిపోయింది. గత మూడు సీజన్‌లలో అయితే యు ముంబా జట్టు పూర్తిగా నిరాశపరిచింది. రెండుసార్లు పదో స్థానంలో, ఒకసారి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.
ఈ నేపథ్యంలో యు ముంబా మళ్లీ టైటిల్ ట్రాక్‌లో పడాలనే ఉద్దేశంలో ఫ్రాంచైజీ శిక్షణ బృందంలో మార్పులు చేసింది. భారత జట్టు మాజీ కెప్టెన్, మూడు ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జట్టు సభ్యుడు రాకేశ్ కుమార్‌ను కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది. మూడో పీకేఎల్ సీజన్‌లో యు ముంబా జట్టుతో చేరిన రాకేశ్... అంతకుముందు పట్నా పైరేట్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత 2017లో తెలుగు టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
‘కింగ్ ఆఫ్ కబడ్డీ’గా పేరొందిన రాకేశ్‌ను తమ జట్టుకు హెడ్ కోచ్‌గా నియమించినందుకు ఆనందంగా ఉందని యు ముంబా సీఈఓ సుహైల్ చందోక్ తెలిపారు. ‘ఈసారి హెడ్ కోచ్‌గా యు ముంబా జట్టుతో చేరినందుకు సంతోషంగా ఉంది.
వచ్చే సీజన్‌లో యు ముంబాకు మంచి ఫలితాలు అందించేందుకు నా శక్తివంచన లేకుండా కృషి చేస్తా’ అని 41 ఏళ్ల రాకేశ్ వ్యాఖ్యానించాడు. గతంలో హరియాణా స్టీలర్స్ జట్టుకు, ఇండియన్ రైల్వేస్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన రాకేశ్ 2006, 2010, 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు నెగ్గిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు
వరల్డ్ కప్ షాట్‌గన్ టోర్నీకి కైనన్
న్యూఢిల్లీ: హైదరాబాద్ సీనియర్ ట్రాప్ షూటర్ కైనన్ చెనాయ్ ఈ సీజన్‌ను వరల్డ్ కప్ టోర్నీతో మొదలు పెట్టనున్నాడు. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో జరిగే సీజన్ మూడో వరల్డ్‌కప్‌లో పాల్గొనే 12 మంది సభ్యులతో కూడిన భారత షాట్‌గన్ జట్టును సోమవారం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) ప్రకటించింది. సైప్రస్ రాజధాని నికోసియాలో మే 3 నుంచి 12వ తేదీ వరకు ఈ సీజన్‌లోని మూడో షాట్‌గన్ వరల్డ్‌కప్ టోర్నీ జరుగుతుంది.
జాతీయ సెలెక్షన్ పాలసీ ప్రకారం భారత ర్యాంకింగ్స్‌లో 4 నుంచి 6 స్థానాల మధ్య ఉన్న షూటర్లను మూడో వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేశారు. 34 ఏళ్ల కైనన్ 2016 రియో ఒలింపిక్స్‌లో ట్రాప్ ఈవెంట్‌లో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. గత 15 ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కైనన్ తన కెరీర్‌లో వరల్డ్ కప్ టోర్నీలలో ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి 3 పతకాలు... ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి 4 పతకాలు సాధించాడు.
అర్జెంటీనా, పెరూలలో రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ ఈవెంట్స్‌తో కూడిన రెండు వరల్డ్‌కప్‌లు జరుగుతాయి. అనంతరం సైప్రస్‌లో కేవలం షాట్‌గన్ ఈవెంట్‌లో మాత్రమే వరల్డ్‌కప్ జరుగుతుంది.
భారత షూటింగ్ జట్టు: పురుషుల ట్రాప్ వ్యక్తిగత విభాగం: కైనన్ చెనాయ్, శార్దుల్ విహాన్, భౌనీశ్ మెండిరట్టా
పురుషుల స్కీట్ విభాగం: మేరాజ్ అహ్మద్ ఖాన్, అభయ్ సింగ్ సెఖోన్, రితురాజ్ సింగ్ బుండేలా
మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగం: సబీరా హారిస్, కీర్తి గుప్తా, రాజేశ్వరి కుమారి.
మహిళల స్కీట్ విభాగం: యశస్వి రాథోడ్, మహేశ్వరి చౌహాన్, పరినాజ్ ధలివాల్
ట్రాప్ మిక్స్‌డ్ టీమ్: కైనన్ చెనాయ్, సబీరా హారిస్, శార్దుల్ విహాన్, కీర్తి గుప్తా.
భారత మహిళల జట్టుకు తొలి ఓటమి
షార్జా: పింక్ లేడీస్ కప్ అంతర్జాతీయ మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. రష్యా జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. రష్యా తరఫున గ్లాఫిరా జుకోవా (25వ నిమిషంలో), వాలెంటీనా స్మిర్నోవా (90+2వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానంలో ఉన్న రష్యా జట్టు ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది.
తొలి మూడు నిమిషాల్లోనే రష్యా గోల్ చేసినంత పని చేసింది. కానీ రష్యా ప్లేయర్లు కొట్టిన షాట్‌లు గురి తప్పాయి. భారత్ తరఫున మనీషా 31వ నిమిషంలో కొట్టిన షాట్‌ను రష్యా గోల్‌కీపర్ కీరా పెతుకోవా నిలువరించింది. రెండో అర్ధభాగంలో భారత జట్టు పక్కా ప్రణాళికతో ఆడి రష్యా జోరుకు అడ్డకట్ట వేసింది. అయితే ఇంజ్యూరీ సమయంలో మరో గోల్‌ను సమర్పించుకుంది.
భారత జట్టుకు ఆడుతున్న తెలంగాణ అమ్మాయి గుగులోత్ సౌమ్య ఈ మ్యాచ్‌లో 68 నిమిషాలు మైదానంలో ఉంది. ఆ తర్వాత సౌమ్య స్థానంలో మౌసుమి ముర్ము సబ్‌స్టిట్యూట్‌గా వచ్చింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 69వ స్థానంలో ఉన్న భారత జట్టు ఈ టోర్నీలోని తొలి మ్యాచ్‌లో 2–0తో జోర్డాన్ జట్టుపై గెలిచింది. భారత జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను బుధవారం దక్షిణ కొరియా జట్టుతో ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment