పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో యు ముంబా జట్టు తమ ఖాతాలో తొమ్మిదో విజయం జమ చేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన యు ముంబా మంగళవారం జరిగిన పోరులో 43–29 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్‌ను బోల్తా కొట్టించింది. యు ముంబా తరఫున అజిత్ చవాన్ 12 పాయింట్లతో సత్తా చాటగా... సునీల్ కుమార్, మన్‌జీత్, సోమ్‌బీర్ తలా 5 పాయింట్లు సాధించారు.
పుణేరి పల్టన్ తరఫున పంకజ్ మోహిత్ 9 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో యు ముంబా 20 రెయిడ్ పాయింట్లు సాధించగా... పల్టన్ 14 పాయింట్లకే పరిమితమై పరాజయం వైపు నిలిచింది. తాజా సీజన్‌లో 15 మ్యాచ్‌లాడి 9 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 51 పాయింట్లు ఖాతాలో వేసుకున్న యు ముంబా మూడో స్థానానికి ఎగబాకింది.
మరోవైపు 16 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 6 పరాజయాలు, 3 ‘టై’లతో 47 పాయింట్లు సాధించిన పుణేరి పల్టన్ ఆరో స్థానంలో ఉంది. బెంగళూరు బుల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన పోరు 34–34 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. బెంగళూరు బుల్స్ తరఫున నితిన్ 7 పాయింట్లు సాధించగా... ప్రదీప్ నర్వాల్, సుశీల్ చెరో 6 పాయింట్లు సాధించారు.
గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ 7 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం జరగనున్న మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), హరియాణా స్టీలర్స్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment