మిథాలీ రాజ్
కేప్‌టౌన్: భారత మహిళల క్రికెట్ జట్టులో మిథాలీ రాజ్‌ది చెరగని ముద్ర. వన్డేల్లో సారథిగా కొనసాగుతున్న ఈ వెటరన్ క్రికెటర్ ... ఇప్పుడు టి20 ప్రపంచకప్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సఫారీ పర్యటనలో పొట్టి ఫార్మాట్‌లో సత్తా చాటుకుంది. మ్యాచ్‌లు గెలిపించే ఇన్నింగ్స్‌లతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచింది. ఇదే ఆత్మవిశ్వాసంతో టి20ల్లోనూ ముందడుగు వేస్తానని చెప్పింది. స్మృతి మంధన, వేద, జెమీమాలు కూడా నిలకడగా రాణిస్తుండటంతో తనపై బ్యాటింగ్ భారం తగ్గిందని తెలిపింది. త్వరలో జరిగే సిరీస్‌లు, జట్టు సన్నాహాలపై ఈ హైదరాబాదీ స్టార్ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే...
ప్రపంచకప్ కోసమే...
నిజాయితీగా చెప్పాలంటే... నాకు టి20లంటే అమితాసక్తి లేదు. అయితే టి20 ప్రపంచకప్ లక్ష్యంగా సన్నాహాలకు పదును పెట్టడం వల్లే ఈ ప్రదర్శన సాధ్యమైంది. ఇప్పుడు నేను కూడా టి20 ప్లేయర్‌ననే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఓపెనర్‌గా నేను ధాటిగా ఆడేందుకు మంచి అవకాశం దొరికింది. మొదటి ఆరు ఓవర్లు (పవర్ ప్లే) చాలా కీలకం. జట్టుకు శుభారంభమిచ్చే అవకాశం ఇక్కడే మొదలవుతుంది. పొట్టి ఫార్మాట్‌లో విదేశీగడ్డపై నేను ఓపెనర్‌గా విజయవంతమయ్యాను. ఇదే ఉత్సాహాన్ని తదుపరి సిరీస్‌లలో కొనసాగిస్తా.
పెను భారం లేదిపుడు...
ఇంతకుముందున్నట్లు... ప్రధానంగా బ్యాటింగ్ భారమంతా నా మీదే లేదు. హర్మన్‌ప్రీత్ (టి20 కెప్టెన్), వేద కృష్ణమూర్తి, టీనేజ్ సంచలనం జెమీమా రోడ్రిగ్స్‌లు నిలకడగా రాణిస్తున్నారు. దీంతో నేను స్వేచ్ఛగా నా ఆటతీరు కొనసాగించే వీలు చిక్కింది. ఆచితూచి ఆడటం కన్నా... ప్రయోగాత్మక షాట్లు ఆడేందుకు ఇదో కారణం. ఔట్ అవుతాననే బెంగేలేకుండా ఆడగలుగుతున్నా. జట్టులో ఇద్దరుముగ్గురు మ్యాచ్ విన్నర్లు ఉండటం నిజంగా అదృష్టం. ఇదే పటిష్టమైన జట్టుకు నిదర్శనం.
లోయర్ ఆర్డర్ మెరుగవ్వాలి...
టి20 ప్రపంచకప్ గెలవాలంటే జట్టులో ఐదారుగురు ఆడితే సరిపోదు. అందరు సమష్టిగా రాణించాలి. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా తమ వంతు పరుగులు సాధించిపెట్టాలి. టాప్, మిడిలార్డర్ విఫలమైనపుడు వీళ్లు చేసే స్కోర్లే కీలకమవుతాయి. వెస్టిండీస్‌లో అక్టోబర్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో స్పిన్నర్లు కూడా కీలకపాత్ర పోషిస్తారు.
మా ఆటపైనా కన్నేశారు...
క్రికెట్ వీక్షకుల్లో మార్పొచ్చింది. భారత అభిమానులు మా మ్యాచ్‌లపై కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. మహిళల జట్టు ఎంత స్కోరు చేసింది? ఎలా ఆడుతుంది? అని టీవీల్లో చూసేవారి సంఖ్య పెరుగుతోంది. వన్డే సిరీస్‌ను బ్రాడ్‌కాస్ట్ చేయలేకపోయినప్పటికీ టి20 మ్యాచ్‌లను ప్రసారం చేయడం మంచి పరిణామం. చూస్తు ఉండండి... టి20 ప్రపంచ కప్‌లో కూడా మేం అందరిని ఆశ్చర్యపరిచే ఆటతో అలరిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment