
న్యూఢిల్లీ: ఎంఎస్ ధోని అద్భుత బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకోవడం వెనక మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్యాగం ఉందని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. గంగూలీ నేతృత్వంలోనే 2004లో ధోని అరంగేట్రం చేశాడు. తను బ్యాటింగ్ చేసే స్థానాన్ని ధోనికి ఇవ్వకపోతే ప్రస్తుతం అతను గొప్ప బ్యాట్స్‌మన్‌గా పేరుతెచ్చుకోకపోయేవాడని వీరూ అభిప్రాయపడ్డాడు. అలాగే తాను ఓపెనర్‌గా రావడానికి కూడా తనే కారణమని చెప్పుకొచ్చాడు. ‘ఆ సమయంలో మేం బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాలనే ఆలోచనలో ఉన్నాం.
దీంట్లో భాగంగా మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం దొరికితే గంగూలీ వన్‌డౌన్‌లో వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఒకవేళ అదీ జరగకపోతే పించ్ హిట్టర్ రూపంలో ఇర్ఫాన్ లేదా ధోనిని పంపాలని భావించాం. అదే విధంగా ధోనికి తన మూడో నంబర్ స్థానాన్ని ఇవ్వాలని దాదా నిర్ణయించారు. ఇలా ముందుగా తన ఓపెనింగ్ స్థానాన్ని నాకు, ఆ తర్వాత వన్‌డౌన్‌ను ధోనికి ఇచ్చిన కెప్టెన్లు చాలా అరుదని చెప్పవచ్చు. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు తను ఎప్పుడూ ముందుంటారు. ధోనికి తను ఆరోజు అలాంటి అవకాశం ఇచ్చాడు కాబట్టే ఈరోజు అగ్రస్థానానికి చేరాడు’ అని వీరూ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment