గౌరవ్‌కు పతకం ఖాయం | Gaurav Bidhuri Assures India Medal at World Boxing Championship | Sakshi
Sakshi News home page

గౌరవ్‌కు పతకం ఖాయం

Published Wed, Aug 30 2017 1:16 AM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM

గౌరవ్‌కు పతకం ఖాయం

గౌరవ్‌కు పతకం ఖాయం

హాంబర్గ్‌ (జర్మనీ): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత బాక్సర్‌ గౌరవ్‌ బిధురి సంచలనం సృష్టించాడు. ప్రపంచ సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో పతకం నెగ్గిన నాలుగో భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. ఈ మెగా ఈవెంట్‌కు గౌరవ్‌ నేరుగా అర్హత పొందకపోయినా ఆసియా బాక్సింగ్‌ సమాఖ్య ‘వైల్డ్‌ కార్డు’ ఇవ్వడంతో బరిలోకి దిగాడు. వాస్తవానికి ఈ వైల్డ్‌ కార్డు ఎంట్రీ భూటాన్‌కు కేటాయించినా వారు ఆసక్తి చూపకపోవడంతో గౌరవ్‌కు ఈ అవకాశం లభించింది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో గౌరవ్‌ 3–0తో బిలెల్‌ మహమ్‌దీ (ట్యూనిషియా)పై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు.

తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో ఇప్పటివరకు భారత్‌ తరఫున విజేందర్‌ సింగ్‌ (2009), వికాస్‌ కృషన్‌ (2011), శివ థాపా (2015) కాంస్య పతకాలను సాధించారు. వీరి సరసన గౌరవ్‌ కూడా చేరనున్నాడు. మరోవైపు ఒలింపిక్‌ చాంపియన్‌ హసన్‌బాయ్‌ దుస్‌మతోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)తో జరిగిన 49 కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్లో అమిత్‌ ఫంగల్‌ (భారత్‌)... కిమ్‌ ఇన్‌క్యు (దక్షిణ కొరియా)తో జరిగిన 52 కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్లో కవీందర్‌ బిష్త్‌ (భారత్‌) ఓడిపోయారు. దాంతో ఈ పోటీల్లో భారత్‌ ఖాతాలో ఒక పతకం మాత్రమే చేరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement