
పేరు గొప్ప... ఊరు దిబ్బ!
అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేముందు భారత క్రీడాకారులు అక్కడ శిక్షణ తీసుకోవడం పరిపాటి. కనీసం రెండు, మూడు వారాలైనా ఆ కేంద్రంలో అగ్రశ్రేణి క్రీడాకారుల సన్నాహాలు ఉంటాయి. భారత్‌లోనే మేటి క్రీడా శిక్షణ సంస్థగా పేరొందిన ఆ కేంద్రంలో సౌకర్యాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని భావిస్తుంటారు. కానీ అక్కడి దృశ్యాలను పరిశీలిస్తే... భారత్‌లో అధికారిక జాతీయ క్రీడా శిక్షణ సంస్థ పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా ఉన్నాయా అని ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ క్రీడా శిక్షణ సంస్థ మరేదో కాదు... 1961లో స్థాపిం చిన పాటియాలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఐఎస్).
న్యూఢిల్లీ: మరో వారం రోజుల్లో స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ మొదలుకానున్నాయి. ఈ క్రీడల్లో పాల్గొనే భారత జట్లకు పాటియాలాలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ శిబిరాలు నిర్వహించారే తప్ప... ఆటగాళ్లకు కనీస సౌకర్యాలు ఉన్నాయా లేవా అని పట్టించుకునే నాథుడు కనిపించలేదు. ముఖ్యంగా భారత అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారుడు, ‘డబుల్ ఒలింపియన్’ ఆచంట శరత్ కమల్ ఇక్కడ ఉన్న సౌకర్యాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 2010లో ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్ క్రీడల్లో శరత్ కమల్ భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు అందించాడు. పాటియాలాలోని ఎన్‌ఐఎస్‌లో వసతి అంటే ‘పీడకల’తో సమానం అని శరత్ కమల్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ‘ఆటపరంగా ఎన్‌ఐఎస్‌లో సౌకర్యాలు ఫర్వాలేదు. కానీ వసతి సౌకర్యాలు దారుణంగా ఉన్నాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు ఈ తరహా ఏర్పాట్లు చేయడం అమోదయోగ్యం కాదు’ అని ఏథెన్స్, బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన శరత్ కమల్ అన్నాడు. ‘ఇక్కడి గదులు శిథిలావస్థలో ఉన్నాయి.
బాత్‌రూమ్‌లు రోతపుట్టించే విధంగా ఉన్నాయి. ఎయిర్ కండిషనర్లు సరిగ్గా పనిచేయడంలేదు. మేము అద్భుత సౌకర్యాలు కల్పించాలని అడగడంలేదు. సాధారణ సౌకర్యాలు కావాలని కోరుతున్నాం. నాకు కేటాయించిన గదిలో నిద్రపోయే పరిస్థితి లేకపోవడంతో నేను మన విదేశీ కోచ్‌కు ఏర్పాటు చేసిన అపార్ట్‌మెంట్ గదికి వెళ్లి పడుకున్నాను’ అని ఈ క్రీడల్లో పాల్గొనేందుకు బుధవారం బయలుదేరిన శరత్ కమల్ తెలిపాడు.