
అదొక అద్భుతమైన నిర్ణయం: రవిశాస్త్రి
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా క్రీడా మంత్రిత్వ శాఖ బాధ్యతల్ని రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ కు అప్పజెప్పడాన్ని భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్వాగతించారు. రాజ్యవర్థన్ కు ఆ పదవి ఇవ్వడం ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన నిర్ణయంగా అభివర్ణించారు. ఈ మేరకు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. 'ఒక టాప్ స్పోర్ట్స్ పర్సన్కు క్రీడల శాఖ దక్కడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది మోదీ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమే కాదు.. గర్వించదగ్గ సమయం కూడా' అని రవిశాస్త్రి తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు.
కేంద్ర క్రీడల శాఖ మంత్రి బాధ్యతలు దక్కించుకున్న తొలి క్రీడాకారుడిగా రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఘనతకెక్కారు. ఒక క్రీడాకారుడు ఈ శాఖను దక్కించుకోవడం ఇదే ప్రథమం. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో డబుల్ ట్రాప్ షూటింగ్‌లో వెండి పతకం సాధించారు. దశాబ్ధంపైగా షూటర్‌గా కొనసాగిన ఆయన పలు పతకాలు గెల్చుకున్నారు. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లోనూ మెడల్స్ సాధించారు. 2005లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పదశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. క్రీడాకారుడైన రాజ్యవర్థన్‌కు సంబంధిత మంత్రిత్వ శాఖ అప్పగించడంతో దేశంలో క్రీడారంగానికి మంచి జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.