
గ్రేట్ డే.. మిస్టర్ హెలికాప్టర్!
భారత క్రికెట్ కెప్టెన్గా ఎన్నో ఘనతలు సాధించి అరుదైన క్రికెటర్గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోని బర్త్ డే సందర్భంగా అతనికి ట్విట్టర్ లో అభినందల వర్షం కురుస్తోంది. ఈ రోజు (జూలై7) ధోని 36వ ఒడిలోకి అడుగెడుతున్నసమయంలో అతనికి సహచర ఆటగాళ్లు తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 'ధోని మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి. మిస్టర్ హెలికాప్టర్కు ఇవే నా శుభాకాంక్షలు. ఇది ధోనికి గ్రేట్ డే'అంటూ యువరాజ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు ధోనితో కలిసున్న ఫోటోను జత చేశాడు.
క్రికెట్ దిగ్గజం ధోనికి హ్యాపీ బర్త్ డే' అని మాజీ క్రికెటర్ మొహ్మద్ కైఫ్ అభినందించగా, ఇది ధోనికి గ్రేట్ అని వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. ఈ ఏడాది ధోనికి చిరస్మరణీయంగా మిగిలి పోవాలని ఆకాంక్షించాడు. 'ధోనికి వెరీ హ్యాపీ బర్త్ డే..నీ కోసం కేక్ రెడీ అవుతోంది'అంటూ హార్దిక్ పాండ్యా విషెస్ తెలిపాడు. ఇదిలా ఉంచితే, భారత్ క్రికెట్ లోకి ధోని ప్రవేశించి దాదాపు 13 ఏళ్లు కావొస్తొంది. అతను క్రికెట్ లో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. 2007లో భారత్ జట్టుకు ట్వంటీ 20 వరల్డ్ కప్ ను అందించిన ధోని.. ఆపై ఏనాడు వెనుతిరిగి చూడలేదు. తనదైన ముద్రతో చెలరేగిపోతూ భారత్ క్రికెట్ ప్రతిష్టను పెంచాడు. ఆ క్రమంలోనే వన్డే వరల్డ్ కప్లను, చాంపియన్స్ ట్రోఫీలను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఐసీసీ నిర్వహించే మూడు మెగా టోర్నీల టైటిల్స్ ను అందుకున్న ఏకైక భారత కెప్టెన్ గా ధోని నిలిచాడు.
ఇక వికెట్ కీపర్ బ్యాట్స్మన్ గా కూడా ఎన్నో రికార్డులు ధోని సొంతం. వెస్టిండీస్ తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా పలు రికార్డుల్ని ధోని సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగుల్ని నమోదు చేసిన రెండో వికెట్ కీపర్ గా ధోని గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే ఆసీస్ దిగ్గజం గిల్ క్రిస్ట్ ను అధిగమించాడు. మరొకవైపు వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఇక భారత్ నుంచి వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాల్గో స్థానానికి చేరుకున్నాడు.