
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా నయా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై పొగడ్తల వర్షం కురుస్తూనే ఉంది. దూకుడైన ఆటతో సిక్సర్లతో విరుచుకుపడే పాండ్యా ఫ్యాన్ క్లబ్‌లో భారత మాజీ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ కూడా చేరిపోయారు. ఇండోర్ వన్డేలో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ నయా ఆలౌరౌండర్‌పై మాజీ ఆల్‌రౌండర్ ప్రశంసల జల్లు కురిపించారు.‘ హార్దిక్ పాండ్యా తన కన్నా గొప్ప ఆటగాడు. అతను ఈ స్థాయికి రావడానికి చాల హార్డ్‌వర్క్ చేశాడు. ఎక్కువగా మాట్లాడి అతనిపై అనవసర ఒత్తిడి తీసుకురాదల్చుకోలేదు. గొప్ప ఆటగాడిగా సత్తా చాటే నైపుణ్యం పాండ్యాకు ఉంది.’ అని మంగళవారం కపిల్ మీడియాతో వ్యాఖ్యానించారు.
పాండ్యాను మరో కపిల్ దేవ్‌గా గుర్తిస్తున్న సందర్భంలో కపిల్‌దేవే నా కన్నా గొప్ప ఆటగాడని కితాబివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అరంగేట్ర మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న అరుదైన ఆటగాళ్లలో పాండ్యా ఒకడు. గతేడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్ మ్యాచ్‌తో వన్డేలో అరంగేట్రం చేసిన పాండ్యా ఆ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియాతో చెన్నైలో తొలి వన్డే విజయంలో కీలకపాత్ర పోశించి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచారు.