
హైదరాబాద్: టీమిండియా యువ ఆటగాళ్లను క్రికెట్ దిగ్గజాలతో పోల్చకండని విజ్ఞప్తి చేశాడు హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్. భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాను కపిల్‌తో పోలుస్తూ.. విశ్లేషకులు చేసే రచ్చను ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. చరిత్రలో ఒకే కపిల్, ఒకే ధోని, ఒకే గవాస్కర్ ఉంటారని, అలాంటి దిగ్గజాలను యువ ఆటగాళ్లను పోల్చడం వల్ల యువకులపై ఒత్తిడి పెరిగిపోతుందని అభిప్రాయపడ్డాడు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.
కపిల్, తన జమానాలో వికెట్లు తీస్తూ... భారీగా పరుగుల చేస్తూ నిఖార్సైన ఆల్‌రౌండర్ పాత్రను పోషించాడని... ఈ జనరేషన్‌లో హార్ధిక్ కూడా అసలుసిసలైన ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేయగల సమర్ధుడని అంటూనే ఇద్దరిని పోల్చడం సరికాదని పేర్కొన్నాడు. కపిల్ క్రికెట్ ఆడిన రోజుల్లో ప్రస్తుతం ఉన్నంత పని భారం ఉండేది కాదని, ఆ పని భారం కారణంగానే నేటి తరంలో అసలుసిసలైన ఆల్‌రౌండర్లు తయారు కాలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో కపిల్ మేటి ఆల్‌రౌండర్‌గా కొనసాగాడని, ప్రస్తుత తరంలో ఆల్‌రౌండర్‌గా కొనసాగడం చాలా కష్టమని ఆయన వెల్లడించాడు.
భారత జట్టు మూడు ఫార్మాట్లలో నిర్విరామంగా క్రికెట్ ఆడటాన్ని ఆయన తప్పుపట్టాడు. అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదిగే శక్తి సామర్థ్యాలున్న ఓ ఆటగాడు గాయంబారిన పడటంతో అతడు బ్యాటింగ్ లేదా బౌలింగ్ మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చిందని హార్ధిక్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేరాడు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా రిషబ్ పంత్‌ను ఆడించాలని ఆయన సూచించాడు. సంజూ సామ్సన్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు కీపింగ్ చేస్తూ ఎంత బాగా ఆడినా ప్రపంచకప్‌లో మాత్రం పంత్‌నే ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశాడు.
చదవండి: ఒక్క ఓవర్ పొదుపుగా బౌల్ చేయాల్సింది.. కేకేఆర్ ఓటమికి నేనే కారణం
Comments
Please login to add a commentAdd a comment