న్యూఢిల్లీ : తనకోచీర్ లీడర్ దొరికిందంటున్నాడు టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. శుక్రవారం పసికూన ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఈ యువ ఆల్‌రౌండర్ 10 బంతుల్లో 32 పరుగులతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ బరోడా ఆటగాడిన విధ్వంసమైన బ్యాటింగ్‌కు టీమిండియా రెండొందల మార్కును దాటగలిగింది.
అంతకుముందు కెవిన్ ఓబ్రైన్ ఒకే ఓవర్లో కేఎల్ రాహుల్(70), రోహిత్ శర్మ(0)లను ఔట్ చేసి భారత్‌కు షాక్ ఇచ్చాడు. ఒకానొక దశలో టీమిండియా 200 పరుగుల మార్క్ దాటుతుందా లేదా అనిపించింది. కానీ ఆఖర్లో పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి ఓవర్లో రెండు సిక్స్‌లు, ఫోర్ బాదడంతో భారత్ అలవోకగా 200 మార్క్‌ను దాటేసింది.
పాండ్యా జోరుగా బ్యాటింగ్ చేస్తుండటాన్ని టీవీలో చూసిన భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కూతురు జీవా సంతోషంతో ఎగిరి గంతేసింది. సునాయాసంగా బౌండరీలు బాదుతున్న పాండ్యాను ఉత్సాహపరుస్తూ.. కమాన్.. హార్దిక్, కమాన్..హార్దిక్ అంటూ సందడి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను హార్దికే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ఓ..! నాకొక చీర్ లీడర్ దొరికిందోచ్’ అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో నెగ్గిన భారత్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment