
మహిళల విభాగంలో హారిక ‘టాప్’
హైదరాబాద్: అబుదాబి ఓపెన్ చెస్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. యూఏఈలోని అబుదాబిలో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో హారిక మొత్తం 5.5 పాయింట్లు స్కోరు చేసింది. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో హారిక 43 ఎత్తుల్లో డేవిడ్ ఎగెల్‌స్టన్ (ఇంగ్లండ్)పై విజయం సాధించింది. ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో మాత్రం హారిక 29వ స్థానంలో నిలిచింది.
ఈ టోర్నీలో హారిక నాలుగు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో రెండు గేముల్లో ఓడిపోయింది. ఓపెన్ విభాగంలో అమీన్ బాసిమ్ (ఈజిప్ట్) 7.5 పాయింట్లతో విజేతగా నిలువగా... నైజెల్ షార్ట్ (ఇంగ్లండ్–7 పాయింట్లు) రెండో స్థానంలో, ఆర్యన్ చోప్రా (భారత్–6.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు.