లోధా సిఫారసులు అమలు చేయరా? | HCA not following Lodha panel recommendations | Sakshi
Sakshi News home page

లోధా సిఫారసులు అమలు చేయరా?

Published Sun, Aug 20 2017 1:52 AM | Last Updated on Sun, Sep 17 2017 5:42 PM

లోధా సిఫారసులు అమలు చేయరా?

లోధా సిఫారసులు అమలు చేయరా?

హెచ్‌సీఏ తీరుపై అజహరుద్దీన్‌ విమర్శలు
సాక్షి, హైదరాబాద్‌: లోధా కమిటీ సిఫారసులను హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అమలు చేయడం లేదని భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ మండిపడ్డారు. హెచ్‌సీఏలో నిత్యకృత్యమైన ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై ఆయన విమర్శలు గుప్పించారు.  మొయినుద్దౌలా గోల్డ్‌కప్‌ క్రికెట్‌ టోర్నీ కోసం ఎంపిక చేసిన హైదరాబాద్‌ జట్లలో ప్రతిభ గల కుర్రాళ్లను పక్కన బెట్టడం దారుణమన్నారు.

శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజహరుద్దీన్‌ మాట్లాడుతూ ‘ఇది చాలా విచారకరం. హెచ్‌సీఏ ‘ఎ’ డివిజన్‌ రెండు రోజుల లీగ్‌లలో మూడేసి సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌ను, ఐదేసి వికెట్లు తీసిన బౌలర్లను హైదరాబాద్‌ ఇరు జట్లకు ఎంపిక చేయలేదు. లోధా ప్యానెల్‌ సిఫారసుల ప్రకారం సెలక్టర్లుగా నియామకమైనవారికి కనీసం 25 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి. కానీ దీన్ని హెచ్‌సీఏ పాటించట్లేదు. పీకల్లోతు అవినీతి అరోపణల్లో కూరుకుపోయిన హెచ్‌సీఏను ప్రక్షాళన చేయాల్సిందే.

సర్వోన్నత న్యాయస్థానం నియమించిన ‘లోధా’ సిఫారసులను అమలు చేయాలి’ అని అజహరుద్దీన్‌ డిమాండ్‌ చేశారు. ఈ జనవరిలో జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆయన విఫలయత్నం చేశారు. అయితే ఈ భారత మాజీ కెప్టెన్‌ వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ ఆఫీసర్‌ తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు అజహర్‌ విమర్శలపై హెచ్‌సీఏ అధ్యక్షుడు జి.వివేకానంద్‌ను సంప్రదించగా... ‘లోధా సిఫారసుల అమలు విషయాన్ని బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) చూసుకుంటుంది. ఇది ఇప్పుడు కోర్టు పరిధిలోని అంశం. దీనిపై ఇంకా ఎక్కువ ఏమీ మాట్లాడలేను. ఆయన (అజహర్‌)కు ఏమైనా అభ్యంతరాలుంటే సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చు’ అని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement