సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో గురువారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ సెలక్షన్ కమిటీలోని ముగ్గురు సభ్యులలో చైర్మన్ రమేశ్ కుమార్, శ్రీనివాస చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేశారు. రంజీ ట్రోఫీ, అండర్–23 జట్ల ఎంపికలో హెచ్‌సీఏ కార్యదర్శి శేష్ నారాయణ్ అతిగా జోక్యం చేసుకోవడం, ఈ విషయంలో ఆయనతో తలెత్తిన విభేదాలే రాజీనామాకు కారణమని సమాచారం.
మరోవైపు అండర్–23 జట్టు కోసం కొత్తగా క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ పదవిని సృష్టించి, అన్ని విషయాల్లో ఆయనకు జవాబుదారీగా ఉండాలంటూ హెచ్‌సీఏ నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా జట్టు కోచ్ అనిరుధ్ సింగ్ కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు. హైదరాబాద్ రంజీ జట్టు ప్రస్తుతం ఢిల్లీలో రైల్వేస్‌తో తలపడుతుండగా... నేటినుంచి హైదరాబాద్, ఒడిషా మధ్య అండర్–23 మ్యాచ్ జరగనుంది.