హడలిపోతున్న ఆటగాళ్లు
న్యూయార్క్ : బాబాయ్ ఇవేం ఎండలు.. అంటున్నారు యూఎస్ గ్రాండ్ స్లామ్లో ఆడుతున్న ఆటగాళ్లు. ఎందుకంటే ఇప్పటికే ఈ మెగా టోర్నీలో ఎండదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయిన ఆటగాళ్ల సంఖ్య 14కు చేరుకుంది. అమెరికాకు చెందిన జాక్ సాక్ 33 డిగ్రీల ఎండ వేడిమిని తట్టుకోలేక టెన్నిస్ కోర్టులోనే నిస్సహాయంగా కూలబడిపోగా, అతడిని డ్రెస్సింగ్ రూముకు మోసుకెళ్లాల్సి వచ్చిందంటేనే విదేశీ ఆటగాళ్ల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
బెల్జియంకు చెందిన రుబెన్ బెమెల్మన్స్తో మ్యాచ్లో 6-4, 6-4, 3-6, 1-2తో ఉన్న దశలో 28వ సీడ్ ఆటగాడైన 22 ఏళ్ల సాక్ రిటైర్ అవ్వాల్సి వచ్చింది. సెట్ విరామాల్లో ఐస్ ముక్కలతో అతడికి సాంత్వన చేస్తూ, చల్లని టవల్స్తో ఉపశమనం కల్గించేందుకు చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. కారణం భరించలేనంత వేడి, ఉక్కపోత. 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత రోజూ అక్కడ నమోదవుతోంది. జాక్ రిటైరైన కొన్ని గంటల్లోనే ఉజ్బెకిస్తాన్కు చెందిన డెన్నిస్ ఇస్తోమిన్ 6-4, 6-4, 1-0 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన డొమినిక్ తేయిమ్తో ఉన్న సందర్భంలో కోర్టులోనే కుప్పకూలిపోయాడు.దీంతో ఆటగాళ్ల సంఖ్య 12కు చేరింది. ఇద్దరు మహిళా క్రీడాకారిణులు తొలిరౌండ్లోనే రిటైర్ అయిన విషయం విదితమే. దీంతో రికార్డు స్థాయిలో మొత్తం 14 మంది యూఎస్ ఓపెన్లో ఎండ వేడిమికి తట్టుకోలేక మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నారు.
ఇదిలాఉండగా ఎండ నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని ఫ్రెంచ్ ఓపెన్ విజేత వావ్రింకా అన్నాడు. తాను ఎప్పుడు అలా రిటైర్ అవ్వలేదని తెలిపాడు. వావ్రింకా సాధారంగానే ఆరున్నర అడుగుల ఎత్తుతో పాటు శారీరకంగానూ ఫిట్గా ఉండటంతో అతనికి సమస్యే లేదు. ఇతర ఆటగాళ్లు మాత్రం బలమైన ప్రత్యర్థి కంటే కూడా ఎండ వేడిమిని తట్టుకోలేక బెంబెలెత్తుతుండటం గమనార్హం. అయితే, మ్యాచ్ మధ్యలోనే వైదొలగాల్సిరావడం తనను ఎంతో నిరుత్సాహానికి గురిచేసిందని వడదెబ్బ నుంచి తేరుకున్న అనంతరం జాక్ సాక్ పేర్కొన్నాడు.