
లీ చోంగ్ వీ హ్యాట్రిక్
* హాంకాంగ్ ఓపెన్‌లోనూ విజేత
* కెరీర్‌లో 60వ టైటిల్ కైవసం
కౌలూన్ (హాంకాంగ్): డోపింగ్ నిషేధం గడువు పూర్తయ్యాక బరిలోకి దిగిన మలేసియా బ్యాడ్మింటన్ స్టార్ లీ చోంగ్ వీ తన జోరును కొనసాగిస్తున్నాడు. తాజాగా హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను ఈ మాజీ నంబర్‌వన్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ లీ చోంగ్ వీ 21-16, 21-15తో తియాన్ హువీ (చైనా)పై విజయం సాధించాడు.
ఈ గెలుపుతో లీ చోంగ్ వీ ‘హ్యాట్రిక్’ సూపర్ సిరీస్ టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు అతను ఫ్రెంచ్ ఓపెన్, చైనా ఓపెన్‌లలో కూడా విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా లీ చోంగ్ వీకిది కెరీర్‌లో 60వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్ సందర్భంగా డోపింగ్‌లో పట్టుబడిన లీ చోంగ్ వీపై ఎనిమిది నెలలపాటు నిషేధాన్ని విధించారు.
నిషేధం గడువు ముగియడంతో ఈ ఏడాది మే నుంచి అతను మళ్లీ రాకెట్ పట్టాడు. ఈ క్రమంలో గత ఏడు నెలల కాలంలో లీ చోంగ్ వీ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్, కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీలతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి ఫామ్‌లోకి వచ్చాడు.
సూపర్ మారిన్...
మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) విజేతగా నిలి చింది. ఫైనల్లో మారిన్ 21-17, 18-21, 22-20తో నొజోమి ఒకుహారా (జపాన్)పై గెలిచింది. ఈ ఏడాది మారిన్‌కిది ఆరో టైటిల్ కావడం విశేషం. ఆమె ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, మలేసియా ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్స్‌ను దక్కించు కుంది.
హాంకాంగ్ ఓపెన్‌లో బ్యాడ్మింటన్‌లో సూపర్ సిరీస్ టోర్నీలు ముగిశాయి. డిసెంబరు 9 నుంచి 13 వరకు దుబాయ్‌లో జరిగే సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్ టోర్నీలో సీజన్ ముగుస్తుంది. హాంకాంగ్ ఓపెన్‌లో భారత్ తరపున శ్రీకాంత్, సింధు, అజయ్ జయరామ్, ప్రణయ్, జ్వాల-అశ్విని పొన్నప్ప బరిలోకి దిగినా... అందరూ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించిన సంగతి తెలిసిందే.