దుబాయ్: హాంకాంగ్ స్పిన్నర్ ఇహ్సన్ ఖాన్ ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. అయితే 322 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన అనుభవం వున్న సీనియర్ ఆటగాడిని డకౌట్ చేసి వార్తల్లో నిలిచాడు ఇహ్సన్. ఆ అవుటైంది టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని. ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా తొలి మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్‌పై కష్టపడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ భారత సారథి రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనిలను ఇహ్సన్ ఔట్ చేయడంతో టీమిండియా భారీ స్కోర్ సాధించలేకపోయింది. అయితే మ్యాచ్ అనంతరం హాంకాంగ్ ఆటగాళ్లు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి సందడి చేశారు. అయితే ఇషాన్ మాత్రం మోడ్రన్ క్రికెట్‌లో తన అభిమాన ఆటగాడు ధోనితో ముచ్చటించాడు. అయితే స్పిన్ బౌలింగ్ ఆడటంలో దిట్ట అయిన ధోని, రోహిత్‌లను బోల్తా కొట్టించిన ఇహ్సన్ ఓ స్కూల్ టీచర్.
ధోని అమోఘం..
‘ధోని అపరమేధావి, క్రీడా విలువలు పాటించే నికార్సయిన ఆటగాడు. తనక బౌల్ చేశాక నాకు బంతి బ్యాట్‌కు తగిలిన శబ్దం రాలేదు. కానీ కీపర్ అప్పీల్ చేస్తే నేను కూడా అరిచా. అంపైర్ కూడా ఆలోచనలో ఉండగానే.. ధోని పెవిలియన్ బాట పట్టాడు. ధోని వెనుదిరిగాక నీకు ఎలాంటి శబ్దమైనా వినిపించిందా అని అంపైర్ అడిగాడు. కానీ, ధోని నాకేం తెలియదని అంపైర్ నిర్ణయం కోసం ఎదురు చూసుంటే నాటౌట్‌గా ప్రకటించేవాడే. నిజాయితీగా ఆడే ధోని అంపైర్ తన నిర్ణయం ప్రకటించక ముందే వెనుదిరిగాడు. ఇది అసలైన క్రీడా స్పూర్తి అంటే. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ధోని నాకు ఎన్నో సలహాలు, సూచనలు చేశాడు. అవి తనకెంతో ఉపయోగడతాయి. స్కూల్ పిల్లల ముందు నేను గర్వంగా నిలుచుంటా. ఆసియా కప్‌లో జరిగిన ఎన్నో విషయాలు నా స్టూడెంట్స్‌తో షేర్ చేసుకుంటా’ అంటూ ఇహ్సన్ తెలిపాడు.
హాంకాంగ్‌కు సహకరించండి..
భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు తమ దేశంలో క్రికెట్ అభివృద్దికి సహకరించాలని ఇహ్సన్ కోరాడు. తమ దేశంలో ఒకేఒక అంతర్జాతీయ మైదానం, మరో రెండు చిన్న మైదానాలు ఉన్నాయని తెలిపాడు. కానీ అక్కడ ప్రాక్టీస్ చేయడానికి వీలుగా లేవని వివరించాడు. తమకు సహకారమిస్తే క్రికెట్‌లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక ఆరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన 23వ ఆటగాడిగా ఈ స్పిన్నర్ రికార్డు సృష్టించాడు. ఇహ్సన్ స్వస్థలం పాకిస్తాన్‌లోని పెషావర్. అండర్-15,19 క్రికెట్‌లో పాక్ తరుపున ప్రాతినిథ్యం వహించాడు. కానీ 2012లో హాంకాంగ్‌కు వలస వెళ్లడంతో అక్కడే స్థిరపడ్డాడు. దేశం మారిన క్రికెట్‌ను వదలకుండా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడే అవకాశం టోర్నీ నిర్వాహకులు తనకు ఇస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతానని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment