Asia Cup 2018
-
ఫైనల్లో యువ భారత్
ఢాకా: కుర్రాళ్ల బౌలింగ్ ప్రదర్శనతో అనూహ్యంగా భారత జట్టు ఆసియాకప్ అండర్–19 టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. తక్కువ స్కోర్ల ఈ మ్యాచ్‌లో మోహిత్ జాంగ్రా (3/25), సిద్ధార్థ్ దేశాయ్ (3/35), హర్‡్ష త్యాగి (2/29) అద్భుతంగా రాణించడంతో సెమీస్‌లో భారత్ 2 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. మొదట భారత్ 49.3 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (37), అనుజ్ (35), సమీర్ (36), ఆయుశ్ బదోని (28) ఫర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో షరిఫుల్ ఇస్లామ్ 3, మృత్యుంజయ్ చౌదరి, రిషద్, తౌహిద్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా 46.2 ఓవర్లలో 170 పరుగుల వద్ద ఆలౌటైంది. 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినా... షమీమ్ (59), అక్బర్ అలీ (45)ల పోరాటంతో కాసేపు గెలుపుదారిలో నడిచింది. అయితే స్పిన్నర్ త్యాగి 139 స్కోరు వద్ద అక్బర్‌ను, 147 పరుగుల వద్ద మృత్యుంజయ్ (2)ను ఔట్ చేసి మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పేశాడు. షమీమ్‌ను అజయ్ ఔట్ చేయడంతో బంగ్లాకు ఓటమి ఖాయమైంది. చివరి ఐదు వికెట్లను బంగ్లాదేశ్ 31 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. -
‘అందుకే విశ్రాంతి తీసుకున్నా’
రాజ్‌కోట్: ప్రత్యర్థి బౌలర్లకు దొరకని సమాధానంగా మారాడు. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతమున్న ఏ ఇతర బ్యాట్స్‌మన్ రాణించని చోట ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నాడు. ఈ ఘనతలన్నీ పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లికి చెందుతాయి. ఇంగ్లండ్‌లో అసాధారణ రీతిలో చెలరేగి ఆడిన కోహ్లికి ఆసియా కప్ ముందు విమర్శల సెగ తగిలింది. యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌కు తాను ఆడనని, విశ్రాంతి అవసరమని తెలపడంతో క్రీడా పండితులు విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ విషయంపై ప్రధాన కోచ్ రవిశాస్త్రి వివరణ ఇవ్వగా, తాజాగా విరాట్ కోహ్లి స్పందించాడు. (కోహ్లిని ఎద్దుతో పోల్చిన రవిశాస్త్రి) ‘ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోయాను. అందుకే తప్పనిసరిగా విశ్రాంతి కావాలని సెలక్టర్లను అడిగా. వారు నా పరిస్థితి అర్థం చేసుకొని ఆసియాకప్‌కు విశ్రాంతినిచ్చారు. అంతేకాని ఆసియ కప్ మీద చిన్నచూపు కాదు. విశ్రాంతి అనంతరం కొత్త శక్తి, ఉత్సాహం, పునరుత్తేజం లభిస్తుంది ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే ఆటగాడు అలసిపోతాడని అందరూ అనుకుంటారు. కానీ ఆ భావన తప్పు. ఆడిన మ్యాచ్‌ల్లో పరుగులు సాధించకపోతే ఆ ఆటగాడికి ఎలాంటి వర్క్‌లోడ్ ఉండదు. మ్యాచ్‌లు ఎక్కువ ఆడినంత మాత్రాన వర్క్‌లోడ్ అనిపించదు. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో వర్క్‌లోడ్ ఎక్కువగా ఉంటే తొందరగా అలసిపోతాం. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో వర్క్‌లోడ్ ఎక్కువగా అనిపించింది’.అంటూ విరాట్ కోహ్లి విశ్రాంతి గురించి వివరణ ఇచ్చాడు. ఇక కోహ్లి గైర్హాజర్‌తో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఏడో సారి ఆసియాకప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: కోహ్లి ఒంటిపై ఉన్న టాటూలు ఏంటో తెలుసా? కోహ్లికి రెస్ట్.. రోహిత్‌కు పగ్గాలు -
‘సచిన్ క్రికెట్ దేవుడే.. కానీ ధోని మాత్రం..’
ఆసియా కప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచులో మిస్టర్ కూల్ ధోనిని ఔట్ చేయడం ద్వారా తన చిరకాల కోరిక నెరవేరిందని హాంగ్‌కాంగ్ బౌలర్ ఇహ్సాన్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశాడు. త్వరలోనే తన కెరీర్ గురించి ఓ పుస్తకం రాయబోతున్నానని, అందులో ఎక్కువ భాగం ధోని గురించే ఉంటుందని చెప్పుకొచ్చాడు ఈ ఆఫ్ స్పిన్నర్. బుధవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఇహ్సాన్... ‘ సచిన్ క్రికెట్ దేవుడు అయితే ఎంఎస్ ధోని క్రికెట్ కింగ్. వీరిద్దరిని ఒక్కసారైనా అవుట్ చేస్తే చాలు నా కెరీర్ పరిపూర్ణమైనట్లే అని భావించాను. అయితే సచిన్‌ను అవుట్ చేసే అవకాశం నాకు లభించలేదు. ఆసియా కప్ పుణ్యమాని ధోనిని పెవిలియన్‌కు పంపే అదృష్టం నాకు దక్కింది. అది నాకెంతో గర్వకారణం. ఈ విషయాలన్నీ నా పుస్తకంలో రాసుకుంటాను. నా మనువలకు కూడా ఇదంతా తెలియాలి కదా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా హాంగ్‌కాంగ్ తరపున ఇప్పటి వరకు 15 వన్డేలు ఆడిన ఈ ఆఫ్ స్పిన్నర్ 29 వికెట్లు తీశాడు. ఆసియా కప్‌లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచులో ధోనిని డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించి వార్తల్లో నిలిచాడు. అయితే స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే ధోనిని అవుట్ చేసిన ఇహ్సన్ ఖాన్ ఓ స్కూలు టీచర్ అన్న విషయం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ధోనితో ఇహ్సన్ ఖాన్ -
కోహ్లిపై బంగ్లా ఫ్యాన్స్ ప్రతీకారం
ఢాకా: బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ప్రతీకార చర్యకు పాల్పడ్డారు. భారత్‌తో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్‌ను థర్డ్ అంపైర్ స్టంపౌట్‌గా ప్రకటించడం వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా బంగ్లా ఫ్యాన్స్ ఏకీపారేశారు. తమ సెంచరీ హీరో లిటన్ దాస్ నాటౌట్ అయినా ఔటివ్వడం వల్లే టైటిల్ చేజారిందని బంగ్లాదేశ్ అభిమానులు ప్రతీకార చర్యకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా కొందరు ఫ్యాన్స్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అఫిషియల్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. అందులో లిటన్ దాస్ అవుటైన ఫొటోలను పోస్ట్ చేశారు. దాన్ని ఎలా ఔటిస్తారో వివరణ ఇవ్వాలంటూ ఐసీసీని నిలదీస్తూ ఓ నోట్‌ను కూడా ఆ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. క్షమాపణలు చెప్పి, ఆ థర్డ్ అంపైర్‌పై చర్యలు తీసుకోవాలని, లేకపోతే వెబ్‌సైట్‌ను మళ్లీ హ్యాక్ చేస్తామని హెచ్చరించారు. ఇది భారతీయులను అవమానించడం కోసం కాదని, తమ జట్టుకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన మాత్రమేనని హ్యాకర్లు తెలిపారు. క్రికెట్లో ప్రతి దేశాన్ని సమానంగా చూడాలని కోరారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేసిన లిటన్ దాస్(121) కుల్దీప్ వేసిన గూగ్లీని ఆడేందుకు ముందుకు వెళ్లాడు. బంతి మిస్ కావడంతో అంతే వేగంగా క్రీజు లైన్‌పై కాలు పెట్టాడు. కానీ అప్పటికే ఎంఎస్ ధోని చాలా వేగంగా వికెట్లను గిరటేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను సంప్రదించాడు. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్ లిటన్ దాస్‌ను ఔట్‌గా ప్రకటించాడు. అదే సమయంలో థర్డ్ అంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్ణయం బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా ఇవ్వకపోవడాన్ని బంగ్లా ఫ్యాన్స్ ప్రశ్నిస్తురు. అసలు బెన్ఫిట్ ఆఫ్ డౌట్ నిబంధనను థర్డ్ అంపైర్ మరచిపోయినట్లు ఉన్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చివరి బంతి వరకు పోరాడి మూడు వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. మరోవైపు అంపైర్ తప్పుడు నిర్ణయం వల్లే తమ జట్టు ఓడిపోయిందని బంగ్లా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కోహ్లి వెబ్సైట్లో హ్యాకర్స్ పోస్ట్ చేసిన ఫొటో -
‘కోహ్లి.. కోహ్లియే కానీ రోహిత్ కెప్టెన్సీ సూపర్’
ఇస్లామాబాద్ : ఆసియాకప్‌లో విజయం సాధించిన టీమిండియాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లి గైర్హాజరీతో సారథ్య బాథ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ ఆకట్టుకున్నాడని కొనియాడాడు. ఖలీజ్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లి.. విరాట్ కోహ్లే. అతని విషయంలో చాలెంజ్ చేయలేరు. కానీ అతను లేకుండా భారత జట్టు ఆసియాకప్‌లో అదరగొట్టింది. విరాట్ మూడో నెంబర్ బ్యాట్స్‌మన్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కానీ ఆసియాకప్‌లో రోహిత్ అద్బుతంగా తన బాధ్యతలు నిర్వర్తించాడు. మైదానంలో అతను చాలా ప్రశాంతంగా కనిపించాడు. అతని కెప్టెన్సీ రోజు రోజుకు మెరుగైంది. ఐపీఎల్లో కూడా అతని కెప్టెన్సీ చూశాను. ఆటగాళ్ల సొంత నిర్ణయాలను అనుమతిస్తాడు. వారికనుగుణంగా ఆడే స్వేచ్ఛను ఇస్తాడు. రోహిత్ ఓ అద్బుత కెప్టెన్.’ అని యూనిస్ కొనియాడాడు. (చదవండి: కెప్టెన్‌గా కోహ్లి పనికిరాడా?) ఆసియాకప్ విజయంలో భారత ఓపెనర్ల కీలకపాత్ర పోషించారన్నాడు. ‘భారత్ నైపుణ్యమున్న ఆటగాళ్లతో కూడిన జట్టు. ఈ జట్టులో వరల్డ్ క్లాస్ ఓపెనర్స్ ఉన్నారు. రోహిత్, ధావన్‌లు ప్రతిసారి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పితే ప్రత్యర్థులకు కష్టంగా ఉంటుంది. భారత్ విజయాల పట్ల నేనేం ఆశ్చర్యానికి గురికాలేదు. ఎందుకంటే భారత్ ఓ పెద్ద దేశం. ఆదేశంలో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. దేశంలో ప్రతి ప్రాంతానికి క్రికెట్ విస్తరించింది. భారత పేస్ బౌలర్లు సంపన్న కుటుంబాల నుంచి రాలేదు. వారంతా పేద కుటుంబాల నుంచి వచ్చారు. వారికి ఐపీఎల్ మంచి అవకాశాలను ఇచ్చింది. భారత్‌లో క్రికెట్ వేదికలు చాలా మార్పును తీసుకొచ్చాయి. ప్రత్యేకంగా ఐపీఎల్ ఎంతో మంది యువఆటగాళ్లను పరిచయం చేసింది.’ అని తెలిపాడు. ఇక యూనిస్ అంతర్జాతీయ క్రికెట్లో 789 వికెట్లు పడగొట్టాడు. (చదవండి: కోహ్లిని ఎద్దుతో పోల్చిన రవిశాస్త్రి) -
సెమీస్‌లో యువ భారత్
సవర్ (బంగ్లాదేశ్): అండర్–19 ఆసియా కప్‌లో యువ భారత్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్తాన్‌తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్ 51 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ అఫ్గానిస్తాన్ నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 45.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (93 బంతుల్లో 92; 13 ఫోర్లు, 1 సిక్స్), ఆయుశ్ బదోని (66 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. 14 పరుగులకే 3 వికెట్లు్ల కోల్పోయిన యువ భారత్‌ను యశస్వి ఆదుకున్నాడు. సిమ్రన్ సింగ్(17)తో నాలుగో వికెట్‌కు 62 పరుగులు, ఆయుశ్ బదోనితో ఐదో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా, కైస్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 45.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రియాజ్ హుస్సేన్ (92 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్), రహ్మానుల్లా గుర్బాజ్ (30 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్సర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. సిద్ధార్థ్ దేశాయ్ (4/37), హర్‡్ష త్యాగి (3/40), సమీర్ చౌదరి (2/18) ఆకట్టుకున్నారు. యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్; శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో శ్రీలంకతో అఫ్గానిస్తాన్ తలపడతాయి. -
క్రికెట్ వద్దు.. 21 ఏళ్లకే ఆటకు గుడ్‌బై
క్రికెటర్ కావడం అతని కల కాదు. అయినా, దేశం తరపున ఆడడానికి చదువుకు రెండేళ్లు స్వస్తి పలికి మరీ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మామూలుగా అయితే వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఎవరైనా క్రికెటర్‌గా కొనసాగడానికే మొగ్గుచూపుతారు. కానీ, హాంగ్‌కాంగ్‌కు చెందిన 21 ఏళ్ల కుర్రాడు క్రిస్టోఫర్ కార్టర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన చిన్ననాటి కల విమాన పైలట్ కావడం కోసం క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. బ్యాట్స్‌మన్, వికెట్‌కీపర్‌గా సేవలందిస్తున్న కార్టర్ 2015 నవంబర్‌లో హంగ్‌కాంగ్ క్రికెట్ జట్టుకి ఎంపికయ్యాడు. మూడేళ్ల తన కెరీర్లో 11 వన్డేలు, 10 టీ20ల్లో ఆడాడు. వన్డేల్లో 114 (బెస్ట్ 43) పరుగులు, టీ20ల్లో 55 (బెస్ట్ 17) పరుగులు చేశాడు. ఇదిలాఉండగా.. క్రిస్టోఫర్ ఇటీవల జరిగిన ఆసియాకప్ టోర్నీలో కూడా పాల్గొన్నాడు. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో హాంగ్‌కాంగ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. హాంగ్‌కాంగ్‌లో జన్మించిన కార్టర్ పెర్త్ (ఆస్ట్రేలియా)లో పెరిగాడు. అడిలైడ్‌లో 55 వారాల పైలట్ ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు. మరో ఏడాదిలో క్రిస్టోఫర్ తన డ్రీమ్‌లో ‘తేలియాడ బోతున్నాడు’. -
కోహ్లిని ఎద్దుతో పోల్చిన రవిశాస్త్రి
న్యూఢిల్లీ: ఇటీవల యూఏఈ వేదిక జరిగిన ఆసియాకప్‌లో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే కోహ్లి రెస్ట్ ఇవ్వడంపై ప్రధాన కోచ్ రవిశాస్త్రి క్లారిటీ ఇచ్చాడు. అసలు కోహ్లి ఎందుకు విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చిందో అనే దానిపై వివరణ ఇచ్చిన రవిశాస్త్రి.. ‘ కోహ్లి చాలా అలసిపోయాడు. శారీరకంగా చూస్తే కోహ్లి పరిస్థితి ఒక ఎద్దులా మారిపోయింది. దాంతో కోహ్లి విశ్రాంతి అనివార్యమైంది. ఒకవేళ ఆసియాకప్‌లో అతను ఆడితే అది తీవ్రమైన ప్రభావం చూపేది. గత కొంతకాలంగా విరామంగా లేకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లి మరింత తాజాగా ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాలనే ఉద్దేశంతోనే అతనికి విశ్రాంతినిచ్చాం. ఇక్కడ కోహ్లికి ఒక్కడికే కాదు.. మిగతా ఆటగాళ్ల విషయం కూడా అదే పద్ధతిని అవలంభిస్తున్నాం. పేసర్లు బూమ్రా, భువనేశ్వర్ కుమార్‌లకు సైతం విశ్రాంతి అవసరమని భావించే వారిని విండీస్‌తో టెస్టు సిరీస్ నుంచి పక్కకు పెట్టాం. విరామం లేకుంగా క్రికెట్ ఆడేవారు మరింతగా రాటుదేలాలంటే విశ్రాంతి అనేది అనివార్యం’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. -
ఆసియాకప్ విజయంపై కేసీఆర్ హర్షం
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు ఆసియాకప్ సాధించడం పట్ల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత జట్టు విజేతగా నిలవడం అరుదైన విజయమని అభివర్ణించారు. భారత జట్టు ఇదే స్ఫూర్తితో రానున్న మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
యువ భారత్ శుభారంభం
ఢాకా: ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించిన భారత్... రికార్డు స్థాయిలో ఏడోసారి కప్‌ను ముద్దాడిన మరుసటి రోజే యువ భారత జట్టు అండర్–19 ఆసియా కప్‌లో శుభారంభం చేసింది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో గ్రూప్ ‘ఎ’లో భాగంగా శనివారం నేపాల్ అండర్–19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత అండర్–19 జట్టు 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యువ భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (113 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... వికెట్ కీపర్ సిమ్రన్ సింగ్ (82; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో భీమ్ షార్కి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో నేపాల్ తడబడింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి చివరకు 36.5 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో హర్‡్ష త్యాగి, సిద్ధార్థ్ దేశాయ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా మన్‌దీప్‌కు 2 వికెట్లు దక్కాయి. యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. టోర్నీలో భాగంగా నేడు యూఏఈతో భారత్ తలపడనుంది. -
సమాధానం లభించలేదు
ఓపెనర్‌గా, మూడో స్థానంలో అంబటి రాయుడు రెండు అర్ధ సెంచరీలు చేశాడు. కానీ ఆ రెండు స్థానాల్లో మున్ముందు అతనికి అవకాశమే లేదు. మూడు వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన దినేశ్ కార్తీక్ ఐదు ఇన్నింగ్స్‌లలో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ లేదు. సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నా, కేదార్ జాదవ్ బ్యాటింగ్ సత్తా బయట పడనే లేదు. అతిథి పాత్రలో రాహుల్ ఒకే మ్యాచ్‌కు పరిమితం కాగా, మనీశ్ పాండే వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా వృథా చేసుకున్నాడు. ఆసియా కప్‌లో అజేయ ప్రదర్శనతో చాంపియన్‌గా నిలవడంతో సమష్టి పాత్ర కనిపిస్తున్నా... టోర్నీకి ముందు తీవ్రంగా చర్చ జరిగిన మిడిలార్డర్ సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు. ముఖ్యంగా నాలుగు, ఆరు స్థానాల్లో ఎవరు ఆడతారనే దానిపై స్పష్టత రాలేదు. సాక్షి క్రీడా విభాగం:‘జట్టులో కొందరు ఆటగాళ్లు నాలుగు, ఆరు స్థానాల్లో తమ చోటును ఖాయం చేసుకున్నారని చెప్పడం చాలా తొందరపాటు అవుతుంది. రాబోయే మరికొన్ని టోర్నమెంట్లలో వారి ప్రదర్శన తర్వాతే ఆయా ఆటగాళ్లు ఏమాత్రం పనికొస్తారని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయిస్తుంది’ అని ఆసియా కప్ ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్య తాజా పరిస్థితిని సూచిస్తోంది. టోర్నీ ఆరంభానికి ముందు నాలుగు, ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయని, దాని కోసం పోటీ పడుతున్న బ్యాట్స్‌మెన్‌పై అనూహ్యంగా వేటు వేయకుండా వీలైనన్ని అవకాశాలు కల్పిస్తానని చెప్పిన తాత్కాలిక కెప్టెన్ తన మాట నిలబెట్టుకున్నాడు. అయితే తుది ఫలితం మాత్రం అతను అనుకున్న విధంగా రాలేదని అర్థమవుతోంది. కీలక మ్యాచ్‌లలో భారత టాప్–3 (కోహ్లి వచ్చాక) విఫలమైతే పరిస్థితి ఏమిటనే దానికి మాత్రం పరిష్కారం ఆసియా కప్‌లోనూ లభించలేదు. బంగ్లాదేశ్‌తో ఫైనల్లో 223 పరుగులను అందుకునేందుకు మన జట్టు తడబడ్డ తీరు ప్రపంచకప్ దిశగా సన్నద్ధమవుతున్న సమయంలో హెచ్చరికలాంటిదే. గెలిపించేదెవరు? రోహిత్, ధావన్, కోహ్లి సమష్టిగా విఫలమైతే భారత జట్టు పరిస్థితి ఏమిటనేదానికి అతి పెద్ద ఉదాహరణ గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. ఆ మ్యాచ్‌లో ఈ ముగ్గురు 0, 21, 5 పరుగులు చేశారు. జట్టు చిత్తుగా ఓడి పాక్‌కు ట్రోఫీ అప్పగించింది. అది అరుదైన సందర్భమే కావచ్చు కానీ నాటి నుంచి కూడా మన మిడిలార్డర్ తడబాటు జట్టుకు సమస్యగానే మారింది. నాలుగు నుంచి ఏడు స్థానాల వరకు ఫలానా ఆటగాడు బలంగా నిలబడిన గెలిపించగలడు అని ఎవరినీ నమ్మలేని స్థితి. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన న్యూజిలాండ్ సిరీస్ నుంచి గణాంకాలు చూస్తే మన మిడిలార్డర్ (ఆటగాళ్లు మారినా) పరుగుల స్కోరింగ్ రేటు 4.82 మాత్రమే. ప్రపంచ కప్ ఆడబోతున్న మొత్తం పది జట్లలో మనకంటే అధ్వాన్నంగా (4.66) అఫ్గానిస్తాన్ మాత్రమే ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది! ఆసియా కప్ వరకు చూస్తే మన అంబటి రాయుడు అందరికంటే కాస్త మెరుగ్గా కనిపించాడు. హాంకాంగ్, అఫ్గానిస్తాన్‌లపై అతను అర్ధ సెంచరీలు చేశాడు. ఫైనల్లో మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దినేశ్ కార్తీక్ వరుసగా చేసిన స్కోర్లు 33, 31 నాటౌట్, 1 నాటౌట్, 44, 37 అతనిపై నమ్మకం పెంచలేకపోతున్నాయి. నిదాహస్ ట్రోఫీ ఫైనల్లో సిక్సర్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌కు మళ్లీ ఊపిరి పోసిన కార్తీక్ ఆ తర్వాత ఒక్క కీలక ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. ఇంగ్లండ్‌లో వైఫల్యంతో టెస్టుల్లో తన స్థానాన్ని పంత్‌కు చేజార్చుకున్న అతని వన్డే కెరీర్ కూడా ఇప్పుడు ఇబ్బందికరంగానే కనిపిస్తోంది. ఏదోలా ఫైనల్‌ను జాదవ్ ముగించగలిగినా, అతని ఫిట్నెస్ కొత్త సమస్యను ముందుకు తెచ్చింది. ఐపీఎల్లో గాయపడిన తర్వాత సుదీర్ఘ సమయం ఎన్సీఏలో గడిపి ఫిట్‌గా తిరిగొచ్చిన అతను మళ్లీ కండరాల నొప్పితో ఇబ్బంది పడటం ఫిజియో పనితీరుపై కూడా సందేహాలు రేకెత్తిస్తోంది. ఫైనల్ ముగిసిన తర్వాత తాను ప్రధానంగా బ్యాట్స్‌మన్‌ను అని స్వయంగా చెప్పుకున్న జాదవ్ ప్రస్తుతం ప్రత్యేక శైలి బౌలర్‌గానే జట్టులో ఉన్నట్లు కనిపిస్తోంది తప్ప బ్యాట్స్‌మన్‌లా కాదు. ధోని పరిస్థితి ఏమిటి? ఆసియా కప్‌కు ముందే ఐదో స్థానం గురించి రోహిత్ స్పష్టత ఇచ్చేశాడు. అది ధోని కోసమేనని అర్థమైపోయింది. కానీ ఈ టోర్నీలో ధోని ఆట చూస్తే అతని వీరాభిమానులు కూడా ‘సమయం వచ్చేసింది’ అని భావిస్తున్నట్లుగా అనిపించింది. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 77 పరుగులే చేశాడు. ప్రతీ పరుగు కోసం ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో ఫైనల్లో మరోసారి కనిపించింది. కేవలం 62.09 స్ట్రైక్ రేట్ ఉండటం, 124 బంతులు ఆడితే మొత్తంగా 6 ఫోర్లు తప్ప ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం ధోని స్థాయి మాత్రం కాదు. కచ్చితంగా ప్రపంచ కప్ వరకు ఉంటాడని అందరూ భావిస్తున్న తరుణంలో 327 వన్డేల అనుభవజ్ఞుడు మిడిలార్డర్లో ఇలా ఆడితే కష్టమే. ఇక అన్ని ఫార్మాట్లకు తగిన విధంగా అద్భుతమైన ఆట ఉన్నా కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్లో మాత్రం ఆడించలేమని ఈ టోర్నీ ద్వారా మేనేజ్మెంట్ తేల్చేసినట్లుంది. అందుకే ఒక్కసారి కూడా మిడిల్లో ఆడించే ప్రయత్నం చేయలేదు. ఇతర ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా అతను 60 పరుగులు చేసినా అవి అతనికి ఎలాగూ టాప్–3లో అవకాశం కల్పించలేవు. మనీశ్ పాండే వ్యథ మరో రకం. దేశవాళీ అద్భుత ప్రదర్శనతో జట్టులోకి రావడం, ఆపై సుదీర్ఘ కాలం బెంచ్‌పై ఉండటం, ఏదో పుష్కరానికి ఒకసారి మ్యాచ్ దక్కితే పరిస్థితులను అర్థం చేసుకునేలోపే లేదంటే ఒత్తిడిలో ఔట్ కావడం రొటీన్‌గా మారింది. నిజానికి పై అందరికంటే అసలైన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా పాండేకే ఎక్కువ గుర్తింపు ఉంది. తన కెరీర్ 18 ఇన్నింగ్స్‌లలో అతను 4, 5, 6 స్థానాల్లోనే ఆడాడు. కానీ అతనికి వరుసగా అవకాశాలు మాత్రం దక్కడం లేదు. కొత్తగా ప్రయత్నిస్తారా... నిజాయితీగా చెప్పాలంటే ఆసియా కప్‌ను మన బౌలర్లు గెలిపించారు. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు దాదాపు ప్రతీ మ్యాచ్‌లో ప్రత్యర్థికి భారీ స్కోరుకు అవకాశం లేకుండా చేశారు. అందు వల్లే బ్యాట్స్‌మెన్ పని కొంత సులువుగా మారింది. ప్రతీ సారి టాప్–3నే మ్యాచ్‌లు గెలిపించడం సాధ్యం కాదు కాబట్టి వీలైనంత తొందరగా మిడిలార్డర్ సమస్యకు పరిష్కారం వెతుక్కోవాల్సిందే. ఇప్పటి వరకు ప్రస్తావించిన పేర్లే కాకుండా మరోసారి అజింక్య రహానే కూడా పోటీలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. దూకుడు తక్కువ కాబట్టి వన్డేలకు పనికి రాడంటూ ప్రస్తుతానికి అతడిని సెలక్టర్లు పక్కన పెట్టేశారు. కానీ ఇంగ్లండ్ పిచ్‌లపై మిడిలార్డర్లో ఇన్నింగ్స్‌ను నడిపించాలంటే సాంకేతికంగా బలమైన బ్యాట్స్‌మన్ అవసరం. అది రహానేలో ఉంది. నిజంగా సెలక్టర్లు ఆ దిశగా ఆలోచిస్తే వచ్చే సిరీస్‌నుంచే అతడిని ఎంపిక చేసి వరుసగా ఆడించాలి. వీరందరినీ కాదని దేశవాళీలో మెరుగ్గా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్‌లాంటి వారిని కూడా ప్రయత్నిస్తారా అనేది రాబోయే వెస్టిండీస్ సిరీస్‌లో కొంత వరకు తేలుతుంది. దినేశ్ కార్తీక్ స్థానంలో రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా ఆడగల సత్తా రిషభ్ పంత్‌లో కూడా ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. మొత్తంగా ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచినా మిడిలార్డర్ సమస్య మాత్రం అలాగే ఉండిపోయిందనేది వాస్తవం. నేనూ ధోనిలాంటివాడినే: రోహిత్ శర్మ దుబాయ్: తొలిసారి వన్డే కెప్టెన్‌గా వ్యవహరించిన టోర్నీలోనే రోహిత్ శర్మ భారత జట్టుకు టైటిల్ అందించాడు. ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన అనంతరం అతను మాట్లాడుతూ మైదానంలో ప్రశాంతంగా వ్యవహరించే విషయంలో తాను ధోనినే అనుకరిస్తున్నట్లు చెప్పాడు. ‘కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎప్పుడూ ఒత్తిడికి గురి కాకుండా కొంత సమయం తీసుకోవడం ఇన్నేళ్లుగా నేను ధోనిలో చూశాను. నాలో కూడా అవే లక్షణాలు ఉన్నాయి. నేను కూడా ముందుగా ఆలోచించి ఆ తర్వాతే స్పందిస్తాను. వన్డేల్లో అలాంటి అవకాశం కూడా ఉంటుంది. అతని నాయకత్వంలో చాలా కాలం ఆడాను.నాకు ఎప్పుడు సలహాలు, సహకారం కావాలన్నా అందించేందుకు అతను ఎప్పుడూ ముందుంటాడు’ అని రోహిత్ వెల్లడించాడు. మరోవైపు భవిష్యత్తులో ఎప్పుడూ మళ్లీ కెప్టెన్సీ అవకాశం దక్కినా ఆ బాధ్యతను నిర్వర్తించేందుకు తాను సిద్ధమని రోహిత్ స్పష్టం చేశాడు. ‘కచ్చితంగా. ఇప్పుడే మేం విజయం సాధించాం. ఇకపై కూడా ఎప్పుడు కెప్టెన్సీ అవకాశం లభించినా నేను రెడీ’ అని అతను వెల్లడించాడు.కొన్నాళ్ల క్రితమే రోహిత్ నాయకత్వంలో భారత్ టి20 టోర్నీ నిదాహస్ ట్రోఫీ కూడా గెలుచుకుంది. -
పూర్తిస్థాయి కెప్టెన్సీకి సిద్ధం : రోహిత్
దుబాయ్: టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌గా ఆసియాకప్ టైటిల్ అందించిన రోహిత్ శర్మ పూర్తిస్థాయి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠకర ఫైనల్లో భారత్ మూడు వికెట్లతో నెగ్గి ఏడోసారి టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. ఈ విజయానంతరం హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు రోహిత్ శర్మ కెప్టెన్సీని కొనియాడుతున్నారు. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. తన కెప్టెన్సీ అచ్చు ధోనిలానే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ‘ధోనికి కెప్టెన్‌గా ఏ లక్షణాలు అయితే ఉన్నాయో.. అవన్నీ నాలో కూడా ఉన్నాయి. మైదానంలో ఎలా మెలగాలో ధోనీ నుంచే నేర్చుకున్నా. ఒత్తిడి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పింది ఆయనే. ధోనితో కలిసి ఆడిన ప్రతిసారి ఆయన మైదానంలో ఎలా మెలుగుతున్నారో బాగా గమనించేవాడిని. ఇప్పటికీ అదే పని చేస్తున్నా. నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన చూపే చాకచక్యం నాకు ఎంతో బాగా నచ్చుతుంది. అతని కెప్టెన్సీలో మేం ఎన్నో మ్యాచ్‌లు ఆడాం. మేం ఎప్పుడు ధోనిబాయ్ నుంచి ఎదో ఒకటి నేర్చుకుంటాం. ఎందుకంటే అతనో గొప్ప కెప్టెన్. ఏమైన సందేహాలు, ప్రశ్నలు ఉంటే వాటికి అతనెప్పుడు సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉంటాడు.’ అని తెలిపాడు. ఇక రోహిత్ కెప్టెన్సీ రికార్డు అద్బుతంగా ఉంది. అతని సారథ్యంలో భారత్ నిదహాస్ ట్రోఫీ, ఆసియాకప్ గెలిచింది. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మూడు సార్లు గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడానికి సిద్దమేనా అని అడిగిన ప్రశ్నకు రోహిత్ నవ్వుతూ సమాధానం చెప్పాడు. ‘మాకు కేవలం గెలుపే కావాలి. కెప్టెన్సీ అవకాశం వస్తే ఖచ్చితంగా స్వీకరిస్తాను.’ అని తెలిపాడు. ఇక నెం 4, నెం6 స్థానాల్లో ఎవరు కుదురుకోలేదని రోహిత్ అంగీకరించాడు. ‘ప్రపంచకప్ టోర్నీ సమీపిస్తుండటంతో నాలుగు, ఆరు స్థానాల ఎంపిక కోసం ఇంకొన్ని మ్యాచ్‌లు అవసరం. ప్రస్తుతం అయితే ఇది సరైన సమయం కాదు. ప్రపంచకప్ వరకు మాకు స్పష్టత వస్తోంది. జరగబోయే టోర్నీలు మాకు అనుకూలమైనవే. ఏ ఆటగాళ్లను ఆడించాలి అనేది మేనేజ్ మెంట్ చూసుకుంటుంది’ అని తెలిపాడు. యువజట్టుగా ఈ టైటిల్‌ను గెలవడం సంతోషాన్నించిందని చెప్పుకొచ్చాడు. భారత స్పిన్నర్లు స్థిరంగా రాణించారని కొనియాడాడు. -
బుమ్రా ఎందుకిలా చేశాడు?
దుబాయ్: తనను పరిహాసం చేసిన పోలీసులకు ఆటతోనే బదులిచ్చాడు టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. తాజాగా ముగిసిన ఆసియాకప్‌లో సత్తా చాటి విమర్శకుల నోళ్లు మూయించాడు. పోస్టర్లపై తనను అవమానించిన వారికి తగిన విధంగా జవాబిచ్చాడు. @traffic_jpr well done Jaipur traffic police this shows how much respect you get after giving your best for the country. pic.twitter.com/y0PU6v9uEc — Jasprit bumrah (@Jaspritbumrah93) June 23, 2017 అసలేం జరిగింది? గతేడాది పాకిస్తాన్‌తో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో బుమ్రా నోబాల్ వేయడంతో పాక్ బ్యాట్స్‌మన్ ఫఖర్ జమాన్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బుమ్రా నోబాల్‌తో బతికిపోయిన అతడు సెంచరీ(114)తో చెలరేగాడు. తుదిపోరులో 180 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి టీమిండియా టైటిల్ చేజార్చుకుంది. సీన్ కట్ చేస్తే బుమ్రా నోబాల్ ఫొటోను జైపూర్ ట్రాఫిక్ పోలీసులు చాలా క్రియేటివ్‌గా వాడుకున్నారు. ‘లైను దాటకండి. లైను దాటితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంద’ని ఈ ఫొటోలో హోర్డింగ్‌లు పెట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. దేశం కోసం ఆడుతున్న క్రికెటర్లకు ఎంత గౌరవం ఇస్తారో దీన్ని బట్టి అర్థమైందని అప్పట్లోనే ట్విటర్లో బుమ్రా ఆవేదన వెలిబుచ్చాడు. ఇప్పుడేమైంది? బంగ్లాదేశ్‌ను ఓడించి ఆసియా కప్‌ను టీమిండియా కైవశం చేసుకుంది. ట్రోఫి పట్టుకుని దిగిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసిన తనను అవమానించిన వారికి బుమ్రా బదులిచ్చాడు. ‘కొంత మంది తమ సృజనను సైన్ బోర్డుల మీద చూపించడానికి ఇష్టపడతారు. అలాంటి వారికి ఇదే నా సమాధానం’ అంటూ ట్వీట్ చేశాడు. తాజాగా జరిగిన ఆసియా కప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 16 సగటుతో 8 వికెట్లు పడగొట్టి భారత్ విజయంతో తనవంతు పాత్ర పోషించాడు. Some people love to use their creativity on the sign boards. Hope this one fits there as well!! 😁💪#Champions#AsiaCup2018 #lionalwaysroars🦁 pic.twitter.com/VWiJidwmaA — Jasprit bumrah (@Jaspritbumrah93) September 28, 2018 -
క్రికెట్‌పై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఆసియాకప్ టైటిల్‌ను ఏడోసారి గెలుపొందిన టీమిండియాకు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీటర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. ఈ విజయంతో మేం గర్వపడేలా చేశారు’ అని ట్వీట్ చేశారు. ఇక శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ చివరి బంతికి విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. (చదవండి: ‘ఆసియా’ మనదే) Congratulations to Team India on the spectacular win over Bangladesh for the #AsiaCup2018. You make us proud. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 29, 2018 -
టీమిండియా తొలి వికెట్ తీసిన తర్వాత..
దుబాయ్: ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసినప్పుడు లేదా మ్యాచ్‌లో విజయం సాధించిన సమయంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆనందం పట్టలేక నాగిని డ్యాన్స్ చేస్తుంటారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరీస్‌లో శ్రీలంకపై విజయానంతరం ఆ జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థుల్ని వెక్కిరించేలా నాగిని డ్యాన్స్ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ సిరీస్ ఫైనల్లో భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోయాక కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోని లంక, భారత్ అభిమానులు కలిసి నాగిని నృత్యం చేస్తూ బంగ్లా ఆటగాళ్లను కవ్వించే ప్రయత్నం చేశారు. అప్పట్నుంచి వాళ్లు సంయమనం పాటిస్తున్నారు. అయితే, తాజాగా మరోసారి బంగ్లాదేశ్ ఆటగాళ్లు నాగిని డ్యాన్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. శుక్రవారం ఆసియాకప్ ఫైనల్లో భారత ఓపెనర్ ధావన్ క్యాచ్‌ను సౌమ్య సర్కార్ అందుకున్న అనంతరం బౌలర్ నజ్ముల్ ఇస్లామ్ నాగిని డ్యాన్స్ చేశాడు. భారత్ తొలి వికెట్‌ను తొందరగా తీశామన్న ఆనందంలో నజ్ముల్లా నాగిని డ్యాన్స్ చేశాడు. అదే సమయంలో స్టేడియంలో బంగ్లా అభిమానులు సైతం నాగిని డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇది భారత్‌కు ఏడో ఆసియా కప్ టైటిల్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (117 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 121) సెంచరీ సాధించగా సౌమ్య సర్కార్ (33), మెహదీ హసన్ (32) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్కు మూడు, కేదార్ జాదవ్‌కు రెండు వికెట్లు దక్కగా బుమ్రా, చాహల్‌లకు తలో వికెట్ లభించింది. ఆ తర్వాత భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది. చివరిబంతి వరకూ పోరాడిన భారత్ ఎట్టకేలకు గెలిచి ఊపిరి పీల్చుకుంది. -
ధావన్ ఔట్.. బంగ్లా ఆటగాళ్ల నాగిని డ్యాన్స్
-
హవ్వా.. అది అవుటా?
దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన ఫైనల్లో టీమిండియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది భారత్‌కు ఏడో ఆసియా కప్ టైటిల్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేసిన బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్(121)ను మూడో అంపైర్ స్టంపౌట్‌గా ప్రకటించిన తీరు వివాదాస్పదమైంది. ఇన్నింగ్స్ 41వ ఓవర్లో కుల్దీప్ వేసిన గూగ్లీని ఆడేందుకు ముందుకు వెళ్లిన లిటన్ దాస్ బంతి మిస్ కావడంతో అంతే వేగంగా క్రీజు లైన్‌పై కాలు పెట్టాడు. అప్పటికే ఎంఎస్ ధోని చాలా వేగంగా వికెట్లను గిరటేశాడు. దీంతో నిర్ణయం మూడో అంపైర్‌కు వెళ్లడంతో చాలాసేపు రీప్లేలో చూసినా స్పష్టత కనిపించలేదు. పలు కోణాల్లో పరిశీలించిన తర్వాత లిటన్ దాస్‌ను ఔట్‌గా ప్రకటించారు. ప్రధానంగా లిటన్ కాలి వేళ్లు లైన్ వెనకభాగంలో ఉన్నట్టు కనిపించకపోవడంతో థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో అతన్ని ఔట్‌గా ప్రకటించడంతో టీమిండియా కాస్త ఊపిరిపీల్చుకుంది. అదే సమయంలో థర్డ్ అంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్ణయం బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా ఇవ్వకపోవడంపై బంగ్లా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు బెన్ఫిట్ ఆఫ్ డౌట్ నిబంధనను థర్డ్ అంపైర్ మరచిపోయినట్లు ఉన్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ లాగా మారిందని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, ఐసీసీ అంటే బీసీసీఐలాగా మారిందని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. కాలు స్పష్టంగా లైన్‌పై ఉన్నా కూడా ఔట్‌గా ప్రకటించడం దారుణమని మరొక నెటిజన్ తన ఆవేదనను వెళ్లగక్కాడు. ఇలా లిటన్ దాస్ ఔట్‌పై ట్విటర్లో విమర్శల వెల్లువెత్తుతున్నాయి. -
జడేజా ఔటైతే భారత్ నెగ్గేది కాదు..
న్యూఢిల్లీ : ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులో కొనసాగించాలని టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠకర ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో నెగ్గి ఏడోసారి టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. భారత విజయంలో జడేజా కీలక పాత్ర పోషించాడని అజారుద్దీన్ ప్రశంసల జల్లు కురిపించాడు. కీలక సమయంలో జడేజా(23;33 బంతుల్లో) భువనేశ్వర్(21;31 బంతుల్లో) తో కలిసి ఏడో వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. ఈ టోర్నీలో అటు బంతి, ఇటు బ్యాట్‌తో మెరిసిన జడేజాను జట్టులో కొనసాగించాలని అజారుద్దీన్ ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు. ‘రవీంద్ర జడేజాను జట్టు నుంచి తీసేయవద్దు. ఆసియాకప్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌తో అద్భుతంగా రాణించాడు. ఫైనల్ మ్యాచ్‌లో జడేజా త్వరగా పెవిలియన్ చేరుంటే.. భారత్ మ్యాచే నెగ్గేది కాదు. అతను భారత జట్టు 11 మంది సభ్యుల్లో ఎప్పుడు ఒకడే.’ అని తెలిపాడు. సూపర్-4లో బంగ్లాదేశ్పైనే జడేజా నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటిన విషయం తెలిసిందే. (మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు: రోహిత్) ఇక చివర్లో ఆడలేని పరిస్థితుల్లో ఉన్న జాదవ్ బ్యాటింగ్ చేయడాన్ని కూడా అజారుద్దీన్ కొనియాడాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీని ప్రశంసించాడు. అతను చాలా కూల్‌గా, ఏమాత్రం భయంలేకుండా కనిపించాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లా కెప్టెన్ మొర్తజా చెప్పినట్టే ఆ జట్టు చివరి బంతి వరకు పోరాడింది. చివరి ఓవర్లో 6 పరుగుల అవసరం కాగా.. గాయంతోనే జాదవ్, కుల్దీప్ సాయంతో మ్యాచ్‌ను గెలిపించాడు. చదవండి: ‘ఆసియా’ మనదే -
ఎంఎస్ ధోని మరో రికార్డు
దుబాయ్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరో రికార్డు సాధించాడు. ఇప్పటికే టీమిండియా తరఫున అత్యుత్తమ కెప్టెన్‌గా, గొప్ప ఫినిషర్‌గా ఖ్యాతి సాధించిన ఎంఎస్ ధోని.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మందిని పెవిలియన్‌కు పంపిన తొలి ఆసియా వికెట్ కీపర్‌గా రికార్డు సాధించాడు. శుక్రవారం భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఆసియాకప్ ఫైనల్లో ధోని ఈ రికార్డు సాధించాడు. టాస్ గెలిచిన రోహిత్ సేన తొలుత బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌ను ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్ 43వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ వేసిన ఐదో బంతికి బంగ్లా కెప్టెన్ మొర్తజా స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. కుల్దీప్ వేసిన బంతిని మొర్తజా ఎదుర్కొనేందుకు ప్రయత్నించగా అది కాస్తా ధోని చేతికి చిక్కింది. వెంటనే ధోనీ బంతిని వికెట్లకు కొట్టడంతో మోర్తజా స్టంప్ అవుట్ అయ్యాడు. దాంతో 800 మంది డిస్మిసల్స్లో ధోని భాగస్వామ్యమ్యాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో అత్యధిక ఔట్లలో పాలు పంచుకున్నతొలి ఆసియా వికెట్ కీపర్‌గా ధోని అరుదైన ఘనత సాధించాడు. ఇక్కడ ఓవరాల్‌గా మార్క్ బౌచర్ (998-దక్షిణాఫ్రికా), గిల్‌క్రిస్ట్ (905-ఆస్ట్రేలియా) తొలి రెండు స్థానాల్లో ఉండగా, ధోని మూడో స్థానంలో ఉన్నాడు. ధోని చేసిన ఔట్లలో 616 క్యాచ్‌లు ఉండగా, 184 స్టంపింగ్స్ ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో స్టంపింగ్స్‌లో ధోని ప్రథమ స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు: రోహిత్
దుబాయ్: ఆసియాకప్‌లో మరోసారి విజేతగా నిలవడం పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. తుది పోరులో మిడిల్ ఆర్డర్‌దే కీలక పాత్రగా రోహిత్ పేర్కొన్నాడు. తమ జట్టు ఒత్తిడిలో పడ్డ సమయంలో మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు ఆకట్టుకుని విజయం ఖాయం చేశారన్నాడు. ఓవరాల్‌గా చూస్తే తమ ఫినిషింగ్ లైన్ అద్భుతంగా ఉందన్నాడు. మ్యాచ్ తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. ‘ ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ప్రధానంగా చూస్తే తొలి 10 ఓవర్లలో బంగ్లా ఆటగాళ్లు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. అయితే బంతి కాస్త పాత బడిన తర్వాత స్పిన్నర్లు రాణించే అవకాశం ఉందని ముందే ఊహించాం. మేము ఏదైతే అనుకున్నామో.. అదే జరిగింది. క్రమేపీ బంగ్లాను భారీ స్కోరు చేయకుండా పైచేయి సాధించాం.ఇక్కడ జట్టుగా సమష్టి కృషి లేకపోతే టైటిల్‌ను గెలవడం అంత ఈజీ కాదు. ఈ టైటిల్ సాధించడంలో క్రెడిట్ అంతా మొత్తం జట్టుదే. ఈ తరహా జట్టు ఉన్నప్పుడు కెప్టెన్ పాత్ర అనేది సులభతరంగానే ఉంటుంది. మిగతా 10 ఆటగాళ్ల వల్లే నేను మంచి కెప్టెన్‌గా కనబడుతున్నా. టోర్నీ ఆద్యంతం మా వాళ్లు అసాధారణంగా రాణించారు. అదే సమయంలో మాకు మద్దతు కూడా విశేషంగా లభించింది. భారత్‌కు మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని రోహిత్ పేర్కొన్నాడు. ‘ఆసియా’ మనదే -
మళ్లీ టైటిల్ సాధించిన భారత్
-
ఆసియాకప్‌లో భారత్ ఘనవిజయం
-
‘ఆసియా’ మనదే
ఆసియా కప్ అద్భుతంగా ముగిసింది. అత్యంత ఉత్కంఠభరితంగా ఆఖరి బంతి వరకు సాగిన తుది పోరులో భారత్‌దే పైచేయి అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తీవ్రంగా శమ్రించాల్సి వచ్చింది. చివరి వరకు పట్టుదలగా ఆడి పోరాడిన బంగ్లాదేశ్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. రోహిత్ శర్మ నేతృత్వంలో టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ సగర్వంగా ఏడోసారి ఆసియా కప్‌ను అందుకోగా... మొర్తజా బృందం వరుసగా మూడోసారి రన్నరప్‌గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది. దుబాయ్: భారత జట్టు విజయానికి 14 ఓవర్లలో 63 పరుగులు కావాలి. ధోనితో పాటు కేదార్ జాదవ్ క్రీజ్‌లో ఉన్నాడు. అంతా భారత్‌కు అనుకూలంగానే సాగుతోంది. అయితే ఈ స్థితిలో డ్రామా మొదలైంది. ధోని ఔట్ కాగా, జాదవ్ కండరాలు పట్టేయడంతో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. బంగ్లాదేశ్ విజయంపై ఆశలు పెంచుకుంది. అయితే జడేజా, భువనేశ్వర్ 45 పరుగుల భాగస్వామ్యం వాటిని తుంచేసింది. ఆఖరి బంతికి లెగ్‌బై ద్వారా సింగిల్ రావడంతో భారత్ విజయం ఖాయమైంది. శుక్రవారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (117 బంతుల్లో 121; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో తొలి సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, జాదవ్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (55 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శతక భాగస్వామ్యం... కెరీర్లో 17 వన్డేలు ఆడితే సగటు 14.06 కాగా అత్యధిక స్కోరు 41 మాత్రమే ఉన్న బ్యాట్స్‌మన్ ఒకరు... 16 వన్డేల్లో ఏనాడూ ఆరో స్థానం కంటే ముందుగా బ్యాటింగ్‌కు దిగని ఆటగాడు మరొకరు... వీరిద్దరిని ఆసియా కప్ ఫైనల్లో ఓపెనర్లుగా పంపి బంగ్లాదేశ్ సాహసం చేసింది. అయితే ఇది అద్భుత ఫలితాన్నిచ్చింది. లిటన్ దాస్, మెహదీ హసన్ (59 బంతుల్లో 32; 3 ఫోర్లు) కలిసి భారీ భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించారు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌లో దాస్ వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. ఆ తర్వాత చహల్ ఓవర్లో కూడా రెండు భారీ సిక్సర్లు కొట్టిన దాస్ 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 52 పరుగుల వద్ద మిడ్ వికెట్లో చహల్ క్యాచ్ వదిలేయడంతో దాస్ బతికిపోయాడు. ఇదే జోరులో ఓపెనింగ్ భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. గత 27 వన్డేల్లో బంగ్లాదేశ్ ఓపెనర్లు తొలిసారి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. 20 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 116 పరుగులకు చేరింది. స్పిన్నర్ల జోరు... బంగ్లా ఇన్నింగ్స్ 21వ ఓవర్ నుంచి మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. తన తొలి ఓవర్లోనే మెహదీ హసన్‌ను ఔట్ చేసి కేదార్ జాదవ్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కైస్ (2)ను చహల్ ఎల్బీగా పెవిలియన్ పంపించాడు. బంగ్లా ఎన్నో ఆశలు పెట్టుకున్న ముష్ఫికర్ (5) పేలవ షాట్‌కు వెనుదిరగ్గా, తర్వాతి ఓవర్లోనే జడేజా అద్భుత ఫీల్డింగ్ నైపుణ్యానికి మిథున్ (2) రనౌటయ్యాడు. మహ్ముదుల్లా (4) కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. 31 పరుగుల వ్యవధిలో బంగ్లా 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సౌమ్య సర్కార్ (45 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్) కొద్దిసేపు దాస్‌కు అండగా నిలిచాడు. అయితే కుల్దీప్ వరుస ఓవర్లలో దాస్, మొర్తజా (7)లను ధోని స్టంపౌట్ చేయడంతో బంగ్లాదేశ్ భారీ స్కోరుపై ఆశలు కోల్పోయింది. దాస్ స్టంపింగ్ సందేహాస్పదంగా కనిపించినా చివరకు థర్డ్ అంపైర్ ఔట్‌గానే ప్రకటించారు. ఇన్నింగ్స్‌లో తొలి 100 పరుగులు చేసేందుకు 17.5 ఓవర్లు మాత్రమే తీసుకున్న బంగ్లాకు తర్వాతి 100 పరుగులు చేసేందుకు 26.5 ఓవర్లు పట్టడం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యాన్ని చూపిస్తోంది. సమన్వయ లోపంతో ముగ్గురు ఆటగాళ్లు రనౌట్ కావడం విశేషం. గెలిపించిన జడేజా, భువనేశ్వర్... సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే పది పరుగులు రాబట్టి భారత్ శుభారంభం చేసింది. కానీ టోర్నీలో తొలిసారి 50 పరుగుల లోపే మొదటి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. దూకుడుగా ఆడే క్రమంలో శిఖర్ ధావన్ (15) వెనుదిరగ్గా, అంబటి రాయుడు (2) విఫలమయ్యాడు. మరోవైపు రోహిత్ మాత్రం దూకుడు కొనసాగిస్తూ భారీ షాట్లు ఆడాడు. అయితే అర్ధ సెంచరీకి చేరువైన సమయంలో మరోసారి పుల్ షాట్‌కు ప్రయత్నించి డీప్ స్క్వేర్‌లెగ్‌లో క్యాచ్ ఇవ్వడంతో అతని ఆట ముగిసింది. ఈ దశలో దినేశ్ కార్తీక్ (37; 1 ఫోర్, 1 సిక్స్), ధోని కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఆరంభంలో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. తాను ఎదుర్కొన్న 23వ బంతికి ధోని తొలి ఫోర్ కొట్టాడు. ధోనితో నాలుగో వికెట్‌కు 14 ఓవర్లలో 54 పరుగులు జోడించిన అనంతరం కార్తీక్ వెనుదిరిగాడు. కొద్ది సేపటికే ముస్తఫిజుర్ చక్కటి బంతికి ధోని కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత జాదవ్ కూడా గాయంతో తప్పుకోవడంతో ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే జడేజా, భువనేశ్వర్ తీవ్రమైన ఒత్తిడిని తట్టుకొని భారత్‌ను విజయానికి చేరువ చేశారు. ►అంతర్జాతీయ క్రికెట్లో బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ►ఆసియా కప్ ఫైనల్లో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్ మన్‌గా లిటన్ దాస్ గుర్తింపు పొందాడు. గతంలో జయసూర్య (శ్రీలంక–125; భారత్‌పై కరాచీలో 2008)... ఫవాద్ ఆలమ్ (పాక్–114 నాటౌట్; శ్రీలంకపై మిర్పూర్లో 2014)... తిరిమన్నె (శ్రీలంక–101; పాక్‌పై మిర్పూర్లో 2014)... ఆటపట్టు (శ్రీలంక–100; పాక్‌పై ఢాకాలో 2000) ఈ ఘనత సాధించారు. ►ఇంగ్లండ్ తర్వాత (194; విండీస్‌పై 1979 వరల్డ్ కప్ ఫైనల్) ఓ టోర్నీ ఫైనల్లో తొలి వికెట్‌కు 100 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి తక్కువ స్కోరుకే ఆలౌటైన రెండో జట్టుగా బంగ్లాదేశ్ (222) నిలిచింది. ►అంతర్జాతీయ క్రికెట్లో 800 ఔట్లలో పాలుపంచుకున్న మూడో వికెట్ కీపర్‌గా, ఆసియా నుంచి తొలి కీపర్‌గా ధోని నిలిచాడు. బౌచర్ (దక్షిణాఫ్రికా–998), గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా–905) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
ఆసియాకప్ ఫైనల్: భారత్ లక్ష్యం 223
దుబాయ్ : భారత్‌తో జరుగుతున్న ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ 223 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ లిటన్ దాస్ 121(117 బంతులు, 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), మెహ్దీ హసన్(32), సౌమ్య సర్కార్లు(33) మినహా మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, జాదవ్ రెండు వికెట్లు తీయగా, చహల్, బుమ్రాలు ఒక వికెట్ తీశారు. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో ముగ్గురు రనౌట్లు కావడం విశేషం. లిటన్ దాస్ ఒక్కడే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఊహించని రీతిలో ఓపెనర్స్ శుభారంభం అందించారు. వచ్చిరావడంతోనే దాటిగా ఆడిన లిటన్ దాస్.. 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఓపెనర్ మెహ్దీ హసన్(32) సాయంతో తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించాడు. 27వన్డేలనంతరం బంగ్లా ఓపెనర్స్ సెంచరీ భాగస్వామ్యం నెలకోల్పడం విశేషం. కానీ ఈ ఆరంభాన్ని బంగ్లా మిగతా బ్యాట్స్‌మెన్ అందిపుచ్చుకోలేకపోయారు. భారత బౌలర్ల సహనానికే పరీక్ష మారిన లిటన్ దాస్- మెహ్దీ హసన్ జోడిని పార్ట్‌టైం బౌలర్ జాదవ్ విడదీసాడు. మెహ్దీ హసన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇమ్రుల్ కైస్(2), ముష్ఫికర్ రహీమ్ (5), మహ్మద్ మిథున్ (2)ల వికెట్లను బంగ్లాదేశ్ వరుసగా కోల్పోయింది. ఈ క్రమంలో లిటన్ దాస్ 87బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్స్‌లతో కెరీర్లోనే తొలి సెంచరీ సాధించాడు. ఆ వెంటనే మహ్మదుల్లా(4)ను కుల్దీప్ పెవిలియన్ చేర్చాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన సౌమ్య సర్కార్ బాధ్యాతాయుతంగా ఆడాడు. కానీ లిటన్ దాస్, కెప్టెన్ మొర్తాజాలను కుల్దీప్ బోల్తా కొట్టించాడు. ధోని సాయంతో ఇద్దరిని స్టంపౌట్ చేసి పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన నజ్ముల్ ఇస్లాం(7)ను సబ్‌స్ట్యూట్ ఫీల్డర్ మనీష్ పాండే రనౌట్ చేశాడు. చివర్లో సౌమ్య సర్కార్ (33) కూడా రనౌట్ కాగా.. మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన రుబెల్ హొస్సెన్(0)ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. 48.3 ఓవర్లలో 222 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. -
ఆసియాకప్: లిటన్ దాస్ సెంచరీ
దుబాయ్ : భారత్‌తో జరుగుతున్న ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ శతకం సాధించాడు. 87బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్స్‌లతో కెరీర్లోనే తొలి శతకం నమోదు చేశాడు. వచ్చిరావడంతోనే దాటిగా ఆడిన లిటన్ దాస్.. 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఓపెనర్ మెహ్దీ హసన్(32) సాయంతో తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించాడు. 27 వన్డేలనంతరం బంగ్లా ఓపెనర్స్ సెంచరీ భాగస్వామ్యం నెలకోల్పడం విశేషం. అనంతరం మెహ్దీ హసన్‌ను పార్ట్‌టైం బౌలర్ జాదవ్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇమ్రుల్ కైస్(2), ముష్ఫికర్ రహీమ్ (5), మహ్మద్ మిథున్ (2)ల వికెట్లను బంగ్లాదేశ్ వరుసగా కోల్పోయింది.