ఎడారి దేశంలో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీల వరకు చేరుతున్నాయి. వేడితో ఆటగాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవలే ఇంగ్లండ్‌లో సుదీర్ఘ పర్యటన అనంతరం తిరిగొచ్చిన కొందరు ఈ ఎండలకు ఇంకా అలవాటు పడే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇలాంటి స్థితిలో భారత జట్టు గతంలో ఎన్నడూ లేని రీతిలో వరుసగా రెండు రోజులు అంతర్జాతీయ వన్డేలు ఆడాల్సి వస్తోంది. ఆసియా కప్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడనున్న టీమిండియా, రేపు రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో పసికూన హాంకాంగ్‌తో పోరుకు కొందరు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి పాక్‌తో మ్యాచ్‌కు సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దుబాయ్: భారత్, హాంకాంగ్ పదేళ్ల క్రితం ఇదే ఆసియా టోర్నీలో ఒకే ఒకసారి తలపడ్డాయి. నాటి మ్యాచ్‌లో భారత్ ఏకంగా 256 పరుగులతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ రెండు జట్లు ముఖాముఖికి సిద్ధమయ్యాయి. బలా బలాలను చూస్తే ప్రత్యర్థికంటే అందనంత ఎత్తులో ఉన్న భారత్‌కు విజయంలో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకపోవచ్చు. సరిగ్గా చెప్పాలంటే బుధవారం పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉన్న రోహిత్ సేనకు... హాంకాంగ్‌తో మ్యాచ్ వార్మప్‌గానే ఉపకరిస్తుంది. ఈ పోరులో టీమిండియా తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనేదే ప్రధానాంశం.
మిడిలార్డర్ ఖాయం చేసేందుకు...
వచ్చే వరల్డ్ కప్‌కు ముందు భారత్‌కు తుది జట్టు విషయంలో ఇంకా స్పష్టత రాని అంశం మిడిలార్డర్ గురించే. సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న కెప్టెన్ రోహిత్ శర్మ ‘4, 6 స్థానాల కోసం జట్టులో గట్టి పోటీ ఉంది. తమ చోటు ఖాయం చేసుకునే ప్రయత్నంలో ఉన్న అందరూ ప్రతిభావంతులే. ఆయా స్థానాల గురించి ఈ టోర్నీ తర్వాత మరింత స్పష్టత వస్తుంది’ అని చెప్పాడు. అంటే ఐదో స్థానంలో ధోని ఆడటం ఖాయమైపోయింది. ఆల్‌రౌండర్‌గా ఏడో స్థానంలో హార్దిక్ పాండ్యా ఉంటాడు. మూడో స్థానంలో ఈ టోర్నీ వరకు ఎవరైనా ఆడినా అది కోహ్లి స్థానం మాత్రమే. మిడిలార్డర్ కోసం ఇప్పుడు రాహుల్, కార్తీక్, జాదవ్, రాయుడు, మనీశ్ పాండే పోటీ పడుతున్నారు. గాయంతో జాదవ్, అనూహ్య రీతిలో రాయుడు ఇంగ్లండ్ టూర్‌కు దూరం కాగా... తాజాగా దేశవాళీ వన్డే ఫామ్‌తో పాండే కూడా నేనున్నానంటూ సిద్ధమయ్యాడు. జాదవ్ పార్ట్‌టైమ్ స్పిన్ అతనికి అదనపు బలం కానుంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్‌తో పోరులో ఎవరు జట్టులోకి వస్తారో చూడాలి. మరో వైపు పాక్‌తో మ్యాచ్‌కు ముందు బుమ్రాకు విశ్రాంతినివ్వాలని భావిస్తే కొత్త కుర్రాడు ఖలీల్ అహ్మద్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. రోహిత్ పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. భువనేశ్వర్ ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేస్తున్నాడు. స్పిన్‌లో
చహల్, కుల్దీప్‌లకు తోడుగా అక్షర్‌కు చాన్స్ దక్కవచ్చు.
మరోవైపు తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో చిత్తుగా ఓడిన హాంకాంగ్ ఇక్కడైనా కాస్త పోటీ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. భారత్‌లాంటి జట్టుపై సంచలన విజయానికి దాదాపుగా ఆస్కారం లేకపోయినా కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలు ఆ జట్టులో ఆత్మవిశ్వాసం పెంచవచ్చు. పాకిస్తాన్, హాంకాంగ్ మధ్య మ్యాచ్ జరిగిన పిచ్‌పైనే ఈ మ్యాచ్ కూడా నిర్వహిస్తున్నారు. పొడిగా ఉండే వికెట్‌పై స్పిన్నర్లు ప్రభావం చూపించగలరు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.
►సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1 లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment