నిజాకత్, అన్షుమన్ ,ధావన్ సెంచరీ అభివాదం
హాంకాంగే కదా అని ఆదమరిస్తే... ఏం జరుగుతుందో భారత్‌కు తెలిసొచ్చింది. అందుకేనేమో ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు’. కూన జట్టేగా అని తేలిగ్గా తీసుకున్న రోహిత్ సేనను 34 ఓవర్లపాటు పరుగుల వేటాడించి... ఆఖరిదాకా ఆటాడించింది హాంకాంగ్! ఇక తలవంపు, పరాభవం ఖాయమనుకున్న దశలో బౌలర్లు కళ్లు తెరిచారు. లేదంటే ఇంకో ఏడేనిమిది ఓవర్ల పాటు ఓపెనర్లు నిలిచుంటే హాంకాంగ్ చేతిలో కంగుతినడం ఖాయమయ్యేది. మొత్తానికి ఏదోలా గెలిచి హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఫలితం లేకుండానే భారత్ సూపర్–4కు అర్హత సాధించింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన హాంకాంగ్ ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది.
దుబాయ్: భారత్ చేసిన స్కోరు 285/7. ఏ లెక్కన చూసిన హాంకాంగ్‌కు ఇది కొండంత లక్ష్యం. కానీ హాంకాంగ్ ఓపెనర్లు నిజాకత్, అన్షుమన్‌లిద్దరు భారత బౌలింగ్‌ను తుత్తునీయలు చేసేశారు. మ్యాచ్‌ను దాదాపు లాగేసుకున్నంత పనిచేశారు. చివరకు ఖలీల్ అహ్మద్ పేస్, కుల్దీప్, చహల్‌ల మణికట్టు మాయాజాలం భారత్ పరువును నిలబెట్టాయి. భారత ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 26 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. మంగళవారం టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (120 బంతుల్లో 127; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో 14వ సెంచరీతో చెలరేగగా, అంబటి రాయుడు (70 బంతుల్లో 60; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన హాంకాంగ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 259 పరుగులు చేసి ఓడింది. నిజాకత్ ఖాన్ (115 బంతుల్లో 92; 12 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ అన్షుమన్ రత్ (97 బంతుల్లో 73; 4 ఫోర్లు, 1 సిక్స్) మొత్తం భారత శిబిరాన్నే వణికించారు. ఆలస్యంగానైనా మేల్కొన్న భారత బౌలింగ్ దళంలో కొత్త కుర్రాడు ఖలీల్ అహ్మద్, చహల్ మూడేసి వికెట్లు తీయగా, కుల్దీప్‌కు 2 వికెట్లు దక్కాయి.
శతక భాగస్వామ్యం...
ఇంగ్లండ్‌తో టెస్టుల్లో ఘోరంగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న శిఖర్ ధావన్ మరోసారి తనకు అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్‌కు వచ్చేసరికి చెలరేగిపోయాడు. మరోవైపు కొన్ని చక్కటి షాట్లతో శుభారంభం చేసిన రోహిత్ శర్మ (22 బంతుల్లో 23; 4 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయితే మూడో స్థానంలో అవకాశం అందుకున్న రాయుడు దానిని చక్కగా ఉపయోగించుకున్నాడు. అయితే వీరిద్దరి శతక భాగస్వామ్యాన్ని నవాజ్ విడదీశాడు. ఆ తర్వాత చకచకా పరుగులు సాధించిన ధావన్ 105 బంతుల్లో సెంచరీ సాధించాడు.
వెంటవెంటనే...
ధావన్‌కు మరో ఎండ్‌లో దినేశ్ కార్తీక్ (38 బంతుల్లో 33; 3 ఫోర్లు) నుంచి సహకారం లభించింది. ధాటిగా ఆడిన వీరిద్దరు మూడో వికెట్‌కు 68 బంతుల్లోనే 79 పరుగులు జోడించారు. అయితే ఒక్కసారి ధావన్ వెనుదిరిగాక భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కించిత్ షా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి పాయింట్‌లో క్యాచ్ ఇవ్వడంతో ధావన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత ధోని (0), కార్తీక్, భువనేశ్వర్ (9), శార్దుల్ (0)లను హాంకాంగ్ వెనక్కి పంపింది. 42 పరుగుల వ్యవధిలో భారత్ తమ చివరి 5 వికెట్లు చేజార్చుకుంది. మరో ఎండ్‌లో కేదార్ జాదవ్ (27 బంతుల్లో 28 నాటౌట్; 1 సిక్స్) పట్టుదలగా నిలబడటంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. చివరి 10 ఓవర్లలో భారత్ 48 పరుగులే చేసింది.
వేగంగా మొదలైంది...
భారత్ విధించిన లక్ష్యం ఆషామాషీ లక్ష్యం కాదు. క్రికెట్ కూన హాంకాంగ్‌కు ఇది కష్టసాధ్యమైంది. కానీ ఆ జట్టు ఓపెనర్లు నిజాకత్ ఖాన్, అన్షుమన్ సులువుగా ఆడేశారు. బౌండరీతో మొదలైన ఇన్నింగ్స్‌ను వేగంగా పరుగు పెట్టించారు. భారత బౌలర్లు, ఫీల్డర్లు గుక్కతిప్పుకోకుండా ధాటిగా కదం తొక్కారు. చూస్తుంటే ఇదో అనామక మ్యాచ్‌గా, ఆడేది హాంకాంగ్‌లా అస్సలు అనిపించలేదు. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఫోర్‌తో శ్రీకారం చుట్టిన నిజాకత్... ఓవర్ ఓవర్‌కు ధాటిని, ఎదురుదాడిని అంతకంతకు పెంచాడు. ఇదే వీరవిహారంతో అతను 45 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్ల జోరుకు అడ్డు అదుపు లేకుండా పోవడంతో భారత్ కంటే ముందుగా 18వ ఓవర్లో (17.4)నే జట్టు స్కోరు వంద దాటింది. టీమిండియా 20వ ఓవర్లో (19.4) వికెట్ కోల్పోయి 100 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ టైమ్ బౌలర్లతో పాటు, పార్ట్‌టైమ్ బౌలర్లను ప్రయోగించినా ఓపెనింగ్ జోడీని విడదీయలేకపోయాడు. మరో ఓపెనర్ అన్షుమన్ కూడా 75 బంతుల్లో (3 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. ఓవర్లు గడుస్తున్న కొద్తీ ప్రత్యర్థి జట్టు స్కోరు పెరుగుతుందే తప్ప వికెట్లయితే రాలడం లేదు. ఇది రోహిత్ శిబిరాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. హంకాంగ్ జట్టేమో అలవోకగా 30.3 ఓవర్లలో 150 పరుగుల్ని చేసింది.
ఊపిరి పోసిన కుల్దీప్...
సగటున ఓవర్‌కు 5 పరుగుల చొప్పున అజేయంగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు ఎట్టకేలకు కుల్దీప్ తెరదించాడు. జట్టు స్కోరు 174 పరుగుల వద్ద కెప్టెన్ అన్షుమన్... రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో సెంచరీకి చేరువైన నిజాకత్ ఆట కూడా ముగిసింది. పరుగు వ్యవధిలో ఖలీల్ అహ్మద్ వేసిన తర్వాతి ఓవర్లోనే అతను వికెట్ల ముందు దొరికిపోయాడు. 175 పరుగుల వద్ద క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్లిద్దరు నిష్క్రమించడంతో భారత శిబిరంలో పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది. కాసేపటికి ఖలీల్ బౌలింగ్‌లో కార్టర్ (3) నిష్క్రమించగా, సిక్సర్లతో జోరుమీదున్న బాబర్ హయత్ (18; 1 ఫోర్, 2 సిక్సర్లు)ను చహల్ పెవిలియన్ బాటపట్టించాడు. ఈ రెండు క్యాచ్‌ల్ని కీపర్ ధోని అందుకున్నాడు. తర్వాత చేయాల్సిన పరుగులు, అందుబాటులో ఉన్న బంతుల మధ్య అంతరం పెరగడంతో ఒత్తిడిలో హాంకాంగ్ చిత్తయింది.
ఖలీల్ అహ్మద్@222
హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌తో 21 ఏళ్ల లెఫ్టార్మ్ పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున వన్డే బరిలోకి దిగిన 222వ ఆటగాడిగా ఖలీల్ నిలిచాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఎక్కువగా ఆడకపోయినా (2 మ్యాచ్‌లే) అత్యంత ప్రతిభావంతుడిగా దేశవాళీ క్రికెట్‌లో గుర్తింపు లభించడంతో ఖలీల్‌కు తొందరగానే అవకాశం లభించింది. భారత అండర్–19 జట్టు సభ్యుడిగా పరిచయమైన ఖలీల్... ‘ఎ’ జట్టు కోచ్ ద్రవిడ్ మార్గనిర్దేశనంలో ఎదిగాడు. ఒకప్పుడు ఖర్బూజా పండ్లకు దేశంలోనే ప్రఖ్యాతి చెందిన రాజస్తాన్ రాష్ట్రంలోనే టోంక్ అతని స్వస్థలం. భారత్ ‘ఎ’ తరఫున గత 9 మ్యాచ్‌ల్లో అతను కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టని మ్యాచ్ లేకపోవడం విశేషం! నిలకడగా 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఖలీల్ భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను ఆదర్శంగా భావిస్తాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్‌లో రెండు సీజన్లలో జహీర్ దగ్గరే బౌలింగ్ మెరుగుపర్చుకున్న ఖలీల్... గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడుతూ భువనేశ్వర్ సూచనలతో మరింత రాటుదేలినట్లుగా చెబుతాడు.
Comments
Please login to add a commentAdd a comment