చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పరాభవానికి ఏడాది తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ప్రత్యర్థికి సొంత మైదానంలాంటి ఎడారి గడ్డలో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయం సాధించింది. ముందుగా చక్కటి బౌలింగ్‌తో పాకిస్తాన్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన టీమిండియా, ఆ తర్వాత అలవోక బ్యాటింగ్‌తో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఆసియా కప్‌లో దాయాదుల మధ్య జరిగిన తొలి పోరులో రోహిత్ సేనకే విజయం దక్కింది. ఇది ఇక్కడితో ముగిసిపోలేదు. వచ్చే ఆదివారం సూపర్–4 దశలో రెండు జట్లు మరోసారి పోరుకు ‘సై’ అంటున్నాయి. సంచలనాలు లేకపోతే ఫైనల్లో కూడా మళ్లీ తలపడే అవకాశం ఉండటంతో ద్వైపాక్షికం కాని మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో ప్రస్తుతానికి పాక్‌పై భారత్‌దే 1–0తో పైచేయి అయింది.
దుబాయ్: ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తడబడిన భారత్ తర్వాతి రోజే అసలు సమరంలో తమ పూర్తి సత్తాను ప్రదర్శించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో టీమిండియా సునాయాస విజయం సాధించింది. బుధవారం ఇక్కడ జరిగిన పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 43.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (62 బంతుల్లో 47; 6 ఫోర్లు), షోయబ్ మాలిక్ (67 బంతుల్లో 43; 1 ఫోర్, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ (3/13), కేదార్ జాదవ్ (3/23) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం భారత్ 29 ఓవర్లలో 2 వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, శిఖర్ ధావన్ (54 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. నేడు జరిగే గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో అఫ్గానిస్తాన్ తలపడుతుంది.
కీలక భాగస్వామ్యం...
హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిరాశాజనక ప్రదర్శన కనబర్చిన భువనేశ్వర్ ఈసారి భారత్‌కు అదిరే ఆరంభాన్ని అందించాడు. పాక్ ఓపెనర్లను వరుస ఓవర్లలో అతను పెవిలియన్ పంపించాడు. ఇమామ్ (2), ఫఖర్ జమాన్ (0) ఒత్తిడికి లోనై వికెట్లు సమర్పించుకున్నారు. బుమ్రా తన తొలి రెండు ఓవర్లను మెయిడిన్‌లుగా ముగించడం విశేషం. ఈ దశలో ఆజమ్, మాలిక్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్‌ప్లే ముగిసేసరికి పాకిస్తాన్ 25 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఫీల్డర్ల వైఫల్యాలు వీరికి కలిసొచ్చాయి. పాండ్యా బౌలింగ్‌లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మాలిక్ ఇచ్చిన క్యాచ్‌ను ధోని... 37 వద్ద భువనేశ్వర్ వదిలేశారు.
జాదవ్ జాదూ...
ఎట్టకేలకు కుల్దీప్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అతను వేసిన చక్కటి బంతికి ఆజమ్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆజమ్, మాలిక్ మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. దీని తర్వాత పాక్ పతనం మొదలైంది. జాదవ్ బంతికి భారీ షాట్ ఆడబోయిన సర్ఫరాజ్ (6)ను అద్భుత క్యాచ్‌తో మనీశ్ పాండే వెనక్కి పంపగా... లేని సింగిల్ కోసం ప్రయత్నించిన మాలిక్‌ను రాయుడు డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. ఆసిఫ్ (9), షాదాబ్ (8) వికెట్లు కూడా జాదవ్ ఖాతాలోకే వెళ్లాయి. చివర్లో అష్రఫ్ (21), ఆమిర్ (18 నాటౌట్) పోరాటంతో ఈ మాత్రమైనా స్కోరు సాధించగలిగింది. 77 పరుగుల వ్యవధిలో పాక్ చివరి 8 వికెట్లు పడ్డాయి.
నిలకడగా...
లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభం లభించింది. కుదురుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత రోహిత్, ధావన్ బ్యాట్ ఝళిపించారు. ఆమిర్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రోహిత్, ఉస్మాన్ వేసిన తర్వాతి ఓవర్లో మరో ఫోర్, సిక్స్ బాదాడు. మరోవైపు ధావన్ కూడా చకచకా పరుగులు సాధించాడు. హసన్ ఓవర్లో మరో భారీ సిక్సర్ కొట్టిన రోహిత్, అదే ఓవర్లో ఫోర్‌తో 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే షాదాబ్... రోహిత్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపటికే ధావన్ కూడా వెనుదిరిగాడు. అయితే అంబటి రాయుడు (31 నాటౌట్; 3 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడి భారత విజయాన్ని ఖాయం చేశారు.
షేక్ కోసం ప్రసారం ఆపేసి...
ఏదైనా మ్యాచ్ మధ్యలో టోర్నీతో సంబంధం ఉన్న ప్రముఖులతో మాట్లాడించడం తరచుగా జరిగేదే. కానీ బుధవారం స్టార్ అన్ని హద్దులు దాటేసింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చైర్మన్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ సందేశం వినిపించడం కోసం మ్యాచ్ ప్రసారాన్నే ఆపేసింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సందర్భంగా బుమ్రా వేసిన 8వ ఓవర్ ప్రసారం కాలేదు.
పాండ్యాకు గాయం...
18వ ఓవర్లో ఐదో బంతిని వేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా ముందుకు పడిపోయాడు. తీవ్రమైన వేడికి, కండరాలు పట్టేయడం వల్ల అతను ఇబ్బంది పడ్డాడని ముందుగా అనుకున్నారు. అతడిని స్ట్రెచర్‌పై మైదానం బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. బీసీసీఐ ఆ తర్వాత అధికారిక వివరణ ఇచ్చింది. పాండ్యా వెన్నునొప్పితో బాధ పడుతున్నట్లు వెల్లడించింది. నడవగలిగే స్థితిలో ఉన్నాడని, అతని గాయాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని చెప్పింది. భారత్ ఇన్నింగ్స్‌లో పాండ్యాకు బ్యాటింగ్ చేయాల్సిన అవసరమే రాలేదు.
మనీశ్ పాండే సూపర్ క్యాచ్...
భారత జట్టులో ఫీల్డింగ్ ప్రమాణాలపరంగా చూస్తే మనీశ్ పాండే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. బుధవారం అతను దానిని మళ్లీ నిరూపించాడు. పాండ్యా గాయం కారణంగా పెవిలియన్ చేరగా... అతని స్థానంలో మనీశ్ సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు. జాదవ్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఇచ్చిన క్యాచ్‌ను వైడ్ లాంగాన్ బౌండరీ వద్ద అతను అద్భుతంగా అందుకున్నాడు. బంతిని అందుకునేందుకు ముందుగా తన కుడి వైపు చాలా దూరం పరుగెత్తిన పాండే అదే ఊపులో క్యాచ్ పట్టేశాడు. అయితే తనను తాను నియంత్రించుకోవడం కష్టం కావడంతో బంతిని గాల్లోకి విసిరి బౌండరీ బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ లోపలికి వచ్చి అతను క్యాచ్‌ను పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో ఈ తరహా క్యాచ్‌లు చాలా కనిపించినా అంతర్జాతీయ మ్యాచ్‌లలో అరుదనే చెప్పవచ్చు.
పాక్‌పై భారత్ మరో 126 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఇన్నింగ్స్‌లో మిగిలిన బంతులపరంగా చూస్తే పాక్‌పై భారత్‌కు ఇదే అతి పెద్ద గెలుపు.
Comments
Please login to add a commentAdd a comment