దాయాదుల 'సూపర్‌' పోరు | Asian games 2018:india pakistan match today | Sakshi
Sakshi News home page

దాయాదుల 'సూపర్‌' పోరు

Published Sun, Sep 23 2018 1:21 AM | Last Updated on Sun, Sep 23 2018 1:51 PM

Asian games 2018:india pakistan match today - Sakshi

హాంకాంగ్‌తో మ్యాచ్‌ మేలుకొలిపిందో లేక పట్టుదలే పట్టాలెక్కించిందో గానీ భారత్‌ ఇప్పుడు ఆసియా కప్‌లో అజేయశక్తి. ఒక్కరి మీదే ఆధారపడటంలేదు. అరకొర ప్రదర్శనతోనే గట్టెక్కడంలేదు. అంతా కలిసి కదం తొక్కుతున్నారు. ప్రత్యర్థి జట్టును రఫ్ఫాడిస్తున్నారు. టీమిండియా అసాధారణ ఫామ్‌ ప్రత్యర్థి శిబిరాన్ని గుక్కతిప్పుకోకుండా చేస్తుంది. తాజాగా సూపర్‌–4లో దాయాది పాకిస్తాన్‌ను మళ్లీ దంచేందుకు టీమిండియా సిద్ధమైంది.   

దుబాయ్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగి అదరగొడుతున్న భారత్‌ ఆసియా కప్‌లో మరోసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ‘ఢీ’ కొట్టేందుకు సిద్ధమైంది. సూపర్‌–4లో భాగంగా ఆదివారం దాయాదుల సమరం జరుగనుంది. ఈ టోర్నీలో తిరుగులేని జట్టేదైనా ఉందంటే అది రోహిత్‌ సేనే. ఇప్పటిదాకా ఈ జట్టుకు సాటి వచ్చే ప్రత్యర్థే లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతీ మ్యాచ్‌లోనూ సమష్టి ఫలితాలే. ప్రతీ ఒక్కరిలోనూ విజయకాంక్షే. ఇవన్నీ టీమిండియాను పటిష్టస్థితిలో నిలిపాయి. ఇప్పుడు భారత్‌కు ఎదురుపడటమంటే ఓటమితో దిగాలు పడటమనే విషయం ప్రత్యర్థి టీమ్‌ మేనేజ్‌మెంట్‌లకు అర్థమైపోయింది. కాబట్టే ఏ వ్యూహంతో బరిలోకి దిగాలో వాళ్లకు అంతుబట్టడం లేదు. ఇక్కడ భారత్‌ ఆడిన మ్యాచ్‌లు, గెలిచిన తేడాను చూస్తే... కచ్చితంగా ఎవరైనా హడలిపోవాల్సిందే. ఈ జోరు చూస్తుంటే రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లి లేని జట్టే ఇలా వుంటే ఇక అతడు కూడా ఓ చెయ్యేస్తే... మిగతా జట్ల పరిస్థితి ఏంటా అని సగటు క్రీడాభిమాని భావించవచ్చు. రోహిత్‌ బృందానికి ఆరంభంలో ఒక్క హాంకాంగ్‌ మినహా ఏ జట్టూ కనీసం ఎదురునిలువ లేకపోయింది. తాజాగా ఇప్పుడు పాకిస్తాన్‌ ఏం చేస్తుందో చూడాలి.  

కసిదీరా కలివిడిగా... 
రోహిత్‌ సేన ఉరిమే ఉత్సాహంతో ఉంది. ఎవరెదురైనా ఓడించేందుకు సిద్ధంగా ఉంది. అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. హాంకాంగ్‌తో కష్టపడ్డ భారత్‌ అటుపై ఇక ఏ జట్టుతోనూ చెమట చిందించకుండానే గెలిచింది. రసవత్తరం అవుతుందనుకున్న ఇండో–పాక్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌ కూడా టీమిండియా జోరు ముందు తేలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌... ఇలా ఏ విభాగాన్ని చూసినా, ఏ ఆటగాడి సత్తాను పరిశీలించినా భారత్‌ ఇప్పుడు అసాధారణ జట్టు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఈ జట్టును ఓడించడం చాలా కష్టం. టాపార్డర్‌లో ధావన్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో సెంచరీ బాదిన శిఖర్‌ గత రెండు మ్యాచ్‌ల్లోనూ 46, 40 పరుగులు చేశాడు.  ఓపె నింగ్‌లో అతనితోపాటు కెప్టెన్‌ రోహిత్‌ కూడా టచ్‌లోకి వచ్చాడు. పాక్, బంగ్లాదేశ్‌లపై అర్ధసెంచరీలతో సత్తాచాటుకున్నాడు. మిడిలార్డర్‌లో రాయుడు, దినేశ్‌ కార్తీక్‌లు బాగా ఆడుతున్నారు.  

ప్రమోషన్‌తో ధోని కూడా... 
గత మ్యాచ్‌లో ప్రమోషన్‌లో నాలుగో స్థానంలో  బ్యాటింగ్‌కు దిగిన ధోని కూడా ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చాడు. కెప్టెన్‌ రోహిత్‌తో కలిసి మూడో వికెట్‌కు విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ధనాధన్‌ మెరుపులు లేకపోయినా దడదడలాడిస్తున్న నాయకుడికి అండగా నిలిచాడు. ప్రత్యర్థి జట్ల తక్కువ స్కోర్లతో లోయర్‌ మిడిలార్డర్‌లో కేదార్‌ జాదవ్‌లాంటి బ్యాట్స్‌మెన్‌కు చెప్పుకోదగ్గ అవకాశం రాలేదు. కానీ హాంకాంగ్‌తో మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే తొలి మ్యాచ్‌ మినహా ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌ల్లో తమ ప్రతాపం చూపారు. పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, అవకాశం దక్కించుకున్న ఖలీల్‌ అహ్మద్, స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్, చహల్‌... అందరూ కలిసి ప్రత్యర్థి ఇన్నిం గ్స్‌ను నిలువునా కూల్చేస్తున్నారు. హార్దిక్‌ పాండ్యా గాయంతో ఏడాది తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజా వస్తూనే స్పిన్‌ బౌలింగ్‌తో పరిమిత ఓవర్లకు పనికొస్తానని తన ప్రదర్శనతో చాటాడు.  

ఆత్మరక్షణలో పాక్‌... 
ఈ టోర్నీలో మూడు మేటి జట్లలో శ్రీలంక లీగ్‌లోనే నిష్క్రమించింది. ఇక మిగిలిన జట్లలో భారత్‌కు పోటీ ఇస్తుందనుకున్న పాకిస్తాన్‌ లీగ్‌ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. టీమిండియా జోరుకు తలవంచింది. అయితే లీగ్‌లో ఇతర జట్లపై గెలిచి ముందంజ వేసిన ఈ జట్టు తమ తొలి సూపర్‌–4లో అఫ్గానిస్తాన్‌ను కష్టమ్మీద ఓడించింది. ఇప్పుడు పటిష్టమైన భారత్‌నూ ఓడిస్తే ఫైనల్‌ బెర్త్‌పై ధీమాతో ఉండొచ్చని భావిస్తోంది. నిలకడలేని బ్యాటింగ్‌ లైనప్‌తో భారత్‌ను ఢీకొనడం అంత సులభమేమీ కాదు. గత మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ చివరి ఓవర్‌లో అధిగమించింది. టాపార్డర్‌లో బాబర్‌ ఆజమ్‌ ఒక్కడే ప్రతీ మ్యాచ్‌లోనూ స్థిరంగా ఆడుతున్నాడు. హాంకాంగ్, భారత్, అఫ్గానిస్తాన్‌పై అతను వరుసగా 33, 47, 66 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో అనుభవజ్ఞుడైన షోయబ్‌ మాలిక్‌ కూడా మెరుగ్గా ఆడుతున్నాడు. కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ బ్యాటింగ్‌కు దిగిన రెండుసార్లూ (6, 8 పరుగులు) విఫలమయ్యాడు. బౌలింగ్‌లో ఒక్కో మ్యాచ్‌లో ఒకరిద్దరు హిట్టయ్యారు. ఉస్మాన్‌ ఖాన్, హసన్‌ అలీ, షాహీన్‌ ఆఫ్రిది, మొహమ్మద్‌ నవాజ్‌ పాకిస్తాన్‌ బౌలింగ్‌ను నడిపిస్తున్నారు. భారత బౌలింగ్‌తో పోలిస్తే పాక్‌ పేస్‌ దళం అంత పటిష్టంగా ఏమీ లేదు. ఇలాంటి నిలకడలేని బ్యాటింగ్, బౌలింగ్‌తో భారత్‌ను ఓడించాలంటే పాకిస్తాన్‌ శక్తికి మించి పోరాడాల్సి ఉంటుంది.  


పిచ్, వాతావరణం 
ఈ మ్యాచ్‌ కోసం కొత్త పిచ్‌ను ఉపయోగించనున్నారు. పిచ్‌ పేసర్లకు అనుకూలిస్తుందని క్యూరేటర్‌ చెబుతున్నారు. అయితే తీవ్రమైన ఎండ వేడిమి దృష్ట్యా స్పిన్నర్లే ఎక్కువ ఓవర్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్‌కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. 

జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధావన్, రాయుడు, ధోని, కార్తీక్, కేదార్‌ జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. 
పాకిస్తాన్‌: సర్ఫరాజ్‌ అహ్మద్‌ (కెప్టెన్‌), ఫఖర్‌ జమాన్, ఇమాముల్‌ హక్, బాబర్‌ ఆజమ్, హారిస్‌ సొహైల్, షోయబ్‌ మాలిక్, ఆసిఫ్‌ అలీ, నవాజ్, హసన్‌ అలీ, ఉస్మాన్, షాహీన్‌ ఆఫ్రిది.  

►అబుదాబిలో నేడు జరిగే మరో ‘సూపర్‌–4’ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో అఫ్గానిస్తాన్‌ ఆడనుంది. సాయంత్రం  5 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ఈ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. 
►సాయంత్రం  5 గంటల నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement