అంబటి రాయుడు
దుబాయ్: ‘అందరివాడు మహేంద్ర సింగ్ ధోని ఉండగా టెన్షన్ ఎందుకు దండగా’ అంటున్నాడు.. హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు. యోయో టెస్ట్ అర్హత సాధించి ఆసియాకప్ టోర్నీకి ఎంపికైన ఈ హైదరాబాదీ మీడియాతో మాట్లాడాడు. ‘విరాట్ లేకపోవడం జట్టుకు పెద్ద లోటే. కానీ ట్రోఫీ గెలిపించగల నాణ్యమైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇంతకు ముందు జట్టుకు నాయకత్వం వహించిన అందరివాడు ధోని అండగా ఉంటాడు. ఈ సీజన్‌లో రాణించేందుకు అతడు నాకు ఎంతో సాయం చేశాడు’ అని రాయుడు చెప్పుకొచ్చాడు.
2019 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకోని టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కోసం చాలా రోజులుగా ప్రయోగాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మిడిలార్డర్‌లో తన స్థానం పదిలపరుచుకొనే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై రాయుడు స్పందిస్తూ.. ‘నిజం చెప్పాలంటే నేను మిడిలార్డర్ బ్యాటింగ్ గురించి అంతగా ఆలోచించడం లేదు. ప్రస్తుతం నా సత్తా చాటేందుకు దొరికిన అవకాశం ఇది. మిడిలార్డర్ గురించి ఆలోచిస్తూ నాపై అనవసర ఒత్తిడి పెంచుకోలేను. ప్రస్తుతం జట్టులో ఎవరూ ప్రపంచ కప్ గురించి ఆలోచిస్తున్నారని అనుకోవడం లేదు. ఇప్పుడు మేం ఆసియాకప్ ఆడుతున్నాం.’ అని వ్యాఖ్యానించాడు.
ఇక భారత్ మంగళవారం హాంకాంగ్‌తో తొలి మ్యాచ్ ఆడునుంది. ఆ మరుసటి రోజే దాయదీ పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. దీనిపై రాయుడు మాట్లాడుతూ.. ‘ఇది మాకో ప్రతికూలంశం అవుతుందని అనుకోవడం లేదు. కొంచెం కష్టమైనా మేం మరుసటి రోజు మ్యాచ్ ఫ్రెష్‌గా బరిలోకి దిగుతాం’ అని తెలిపాడు. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమవ్వడం చిరాకు పెట్టిందని, తిరిగి ఆసియాకప్‌కు ఎంపికవ్వడం సంతోషానిచ్చిందని రాయుడు చెప్పుకొచ్చాడు. ఈసారి తాను ఐపీఎల్ బాగా ఆడానని, కీలకమైన అంశం ఏంటంటే వయసుతో సంబంధం లేదన్నాడు. ఫిట్‌గా ఉంటే చాలని రాయుడు పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment