
అర్ధ సెంచరీ, 2 వికెట్లు, డైరెక్ట్ త్రోతో రనౌట్...తన బర్త్‌డేను రషీద్ ఖాన్ అద్భుతంగా మలచుకున్నాడు. స్టార్ బౌలర్‌గా ఇప్పటికే గుర్తింపు ఉన్న ఇతను మెరుపు హాఫ్ సెంచరీతో బ్యాట్స్‌మన్‌గా తనలోని మరో కోణాన్ని ప్రదర్శించాడు. టీనేజర్‌గా అనేక సంచలనాలు సాధించిన రషీద్... ఆ దశను దాటి సరిగ్గా 20వ పడిలోకి ప్రవేశించిన రోజు తన జట్టుకు బంగ్లాదేశ్‌పై అద్భుత విజయాన్ని అందించాడు. శ్రీలంకను చిత్తు చేసి ఘనంగా కనిపించిన బంగ్లా... అఫ్గాన్ పట్టుదలకు తలవంచింది.
అబుదాబి: ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్ అదరగొట్టింది. గురువారం జరిగిన పోరులో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ (57 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) బంగ్లాదేశ్‌ను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. దీంతో అఫ్గాన్ 136 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 255 పరుగులు చేసింది. హష్మతుల్లా షాహిది (58; 3 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, గుల్బదిన్ నైబ్ (42 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు. జట్టు స్కోరు 160/7 వద్ద క్రీజులోకి వచ్చిన రషీద్, నైబ్‌తో కలిసి బ్యాట్ ఝళిపించాడు. ఇద్దరు అభేద్యమైన ఎనిమిదో వికెట్‌కు 9.1 ఓవర్లలో 95 పరుగులు జోడించారు. బంగ్లా ముందు కష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 42.1 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద మొదలైన బంగ్లా వికెట్ల పతనం క్రమం తప్పకుండా సాగింది. టాపార్డర్‌లో షకీబుల్ హసన్ (32), మిడిలార్డర్‌లో మహ్మూదుల్లా (27; 2 ఫోర్లు), మొసద్దిక్ హొస్సేన్ (20 నాటౌట్, 2 ఫోర్లు) కాసేపు బ్యాటింగ్ చేశామనిపించారు. రషీద్‌తో పాటు గుల్బదిన్ నైబ్ 2 వికెట్లు తీయగా, అఫ్తాబ్ ఆలం, ముజీబుర్ రహమాన్, మొహమ్మద్ నబీ, రహ్మత్ షా తలా ఒక వికెట్ తీశారు. ఈ గ్రూపులో లంక ముందే నిష్క్రమించగా, టాపర్‌గా అఫ్గాన్, రెండో జట్టుగా బంగ్లాదేశ్ ‘సూపర్–4’కు చేరాయి.
►అఫ్గానిస్తాన్ తరఫున అత్యధిక వికెట్లు (112) తీసిన బౌలర్‌గా మొహమ్మద్ నబీ (111)ని అధిగమించి రషీద్‌ఖాన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment