అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తొలిసారి ప్రపంచకప్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. టీ20 వరల్డ్‌కప్-2024 సూపర్-8 మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి ఈ మేరకు చరిత్ర సృష్టించింది.
అంతేకాదు అఫ్గన్ దెబ్బకు.. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియా టోర్నీ నుంచే నిష్క్రమించింది. దీంతో అఫ్గనిస్తాన్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లు సైతం తీవ్ర భావోద్వేగంలో మునిగిపోయారు.
నమ్మశక్యం కాని రీతిలో
ఇక చారిత్రాత్మక విజయానంతరం అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ చేరడం ఓ కలలాగా ఉందని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. నమ్మశక్యం కాని రీతిలో న్యూజిలాండ్‌ను ఓడించామని.. ఇప్పుడిలా ఇక్కడిదాకా చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశాడు.
ఈ సంతోష సమయంలో తనకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని రషీద్ ఖాన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తమ జట్టును చూస్తే తనకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు తమ పాత్రను సమర్థవంతంగా పోషించారని.. టీ20 ఫార్మాట్లో ముఖ్యంగా తమ బౌలర్లు అద్భుతంగా ఆడుతున్నారని కొనియాడాడు.
ఇలా తొలిసారి సెమీ ఫైనల్లో
అండర్-19 వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరిన ఘనత అఫ్గనిస్తాన్‌కు ఉందని.. అయితే, మెగా టోర్నీలో ఇలా తొలిసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనని పేర్కొన్నాడు.
అదే విధంగా.. తమపై నమ్మకం ఉంచిన ఏకైక వ్యక్తి బ్రియన్ లారా అంటూ ఈ సందర్భంగా రషీద్ ఖాన్ వెస్టిండీస్ దిగ్గజానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడతామని చెప్పానని.. అందుకు తగ్గట్లుగానే తమ జట్టు విజయం సాధించిందని పేర్కొన్నాడు.
మేము సెమీ ఫైనల్ చేరతామని చెప్పిన ఏకైక వ్యక్తి
‘‘మేము సెమీ ఫైనల్ చేరతామని చెప్పిన ఏకైక వ్యక్తి బ్రియన్ లారా. ఆయన మాటలు నిజమని మేము రుజువు చేశాం. వెల్‌కమ్ పార్టీ సమయంలో లారాను కలిసినపుడు.. మీ నమ్మకం నిజం చేస్తామని చెప్పాను’’ అంటూ రషీద్ ఉద్వేగానికి లోనయ్యాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2024 సెమీ ఫైనలిస్టు అంచనాల నేపథ్యంలో చాలా మంది మాజీ క్రికెటర్లు.. టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లేదంటే న్యూజిలాండ్ పేర్లు చెప్పారు. అయితే, లారా మాత్రం ఈసారి అఫ్గనిస్తాన్ కచ్చితంగా టాప్-4లో చేరుతుందని అంచనా వేశాడు. ఇప్పుడదే నిజమైంది.
కాగా గ్రూప్ దశలో గ్రూప్-సిలో ఉన్న అఫ్గనిస్తాన్ నాలుగింట మూడు విజయాలతో సూపర్-8లో అడుగుపెట్టింది. ఇక ఇందులో గ్రూప్-1లో భాగమైన రషీద్ ఖాన్ బృందం.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లను ఓడించి సెమీస్‌కు చేరుకుంది.
చదవండి: T20 World Cup 2024 IND VS AUS: సెంచరీ గురించి ఆలోచనే లేదు.. రోహిత్
Comments
Please login to add a commentAdd a comment