క్రికెట్ అభిమానుల్లో ఎక్కువ మంది ఆశించిన లేదా ఊహించిన ఫైనల్ కాదిది. అయితే ఫైనల్ చేరేందుకు బంగ్లాదేశ్‌కు అన్ని విధాలా అర్హత ఉంది. భారత్ గనక ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే ఇక్కడ కూడా ఆశ్చర్యకర ఫలితం రావచ్చు. అఫ్గానిస్తాన్ చేతిలో ఓటమి తర్వాత మళ్లీ కోలుకొని పట్టుదలతో బంగ్లాదేశ్ ఆడిన తీరు ప్రశంసనీయం. సమష్టితత్వంతో పాటు సానుకూల దృక్పథంతో వారు పాకిస్తాన్‌తో ఆడారు. ఫలితంగా సెమీఫైనల్‌లాంటి మ్యాచ్‌లో చాంపియన్స్ ట్రోఫీ విజేతలకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. మష్రఫ్ మొర్తజా తన ఫీల్డింగ్ ఏర్పాట్లు, బౌలింగ్ మార్పులతో సమర్థంగా జట్టును నడిపించాడు. సహచరులు కూడా దానికి తగిన రీతిలో స్పందించారు. ముష్ఫికర్ అద్భుతంగా ఆడుతుండగా మిథున్ కూడా ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో వీరిద్దరి భాగస్వామ్యం చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించరాదనే తత్వం కనిపించింది. దురదృష్టవశాత్తూ ముష్ఫికర్ సెంచరీ కోల్పోయాడు. ఆఫ్ స్పిన్నర్ మెహదీ హసన్‌తో బౌలింగ్ ప్రారంభించి మష్రఫ్ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. వేగంగా ప్రత్యర్థినుంచి మ్యాచ్‌ను లాక్కునే సత్తా ఉన్న ఫఖర్‌ను ఔట్ చేసి మెహదీ తన కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఆసి యా కప్‌లో ఫఖర్ ఫామ్ పేలవంగా ఉండటం వల్ల పాక్‌కు సరైన ఆరంభాలు లభించలేదు. సరిగ్గా ఇదే విషయంలో భారత్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది.
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధావన్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభిస్తూ తొలి పది ఓవర్లలోనే ప్రత్యర్థిని మానసికంగా దెబ్బ తీస్తున్నారు. ఒకరితో మరొకరు పోటీ పడుతూ వీరిద్దరు కొడుతున్న షాట్లు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ప్రత్యర్థి బౌలర్లను ఒక వైపు జాగ్రత్తగా ఎదుర్కొంటూనే మరో వైపు మెరుపు షాట్లతో చెలరేగుతున్న తీరును చూసి తీరాల్సిందే. ఇక్కడి స్పిన్ పిచ్‌లను భారత స్పిన్నర్లు సమర్థంగా ఉపయోగించుకొని ప్రత్యర్థి మిడిలార్డర్‌లో భారీ భాగస్వామ్యాలు నెలకొల్పకుండా కట్టి పడేశారు. జస్‌ప్రీత్ బుమ్రా కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఫ్రంట్ ఫుట్ నోబాల్ వేయకుండా ఉండే విధంగా అతను తన రనప్‌ను మార్చుకున్న తీరు చూస్తే తప్పులు సరి దిద్దుకునేందుకు అతను ఎంత శ్రమిస్తాడో అర్థమవుతుంది. నోబాల్ వేయకుండా ఉండే విషయంలో జడేజా, చహల్ కూడా బుమ్రాను చూసి నేర్చుకోవాలి. చురుకైన ఫీల్డింగ్ కూడా భారత జట్టు ఫైనల్ చేరడానికి ఒక కారణం. ఇప్పుడు కావాల్సిందల్లా ఇదే జోరును మరొక రోజు కొనసాగించి ఆసియా కప్‌ను మన ఖాతాలో వేసుకోవడమే.
Comments
Please login to add a commentAdd a comment