జోరు కొనసాగాలి | Asia cup :India fight with Bangladesh | Sakshi
Sakshi News home page

జోరు కొనసాగాలి

Published Fri, Sep 21 2018 1:01 AM | Last Updated on Fri, Sep 21 2018 1:01 AM

Asia cup :India fight with Bangladesh - Sakshi

ఆసియా కప్‌ ‘సూపర్‌’ అంకానికి చేరింది. టోర్నీ ఫేవరెట్‌ భారత్‌ను2012, 2016 ఫైనలిస్ట్‌ బంగ్లాదేశ్‌ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. శ్రీలంకను ఓడించిన ఉత్సాహాన్ని అఫ్గానిస్తాన్‌నీరుగార్చిన నేపథ్యంలో మేటి జట్టయిన భారత్‌ను ఢీకొట్టాలంటే బంగ్లాదేశ్‌ సర్వశక్తులు ఒడ్డాల్సిందే!

దుబాయ్‌: వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా ఇప్పుడు ‘సూపర్‌–4’ ఫైట్‌ను తాజాగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అనామక హాంకాంగ్‌పై చాలాకష్టంగా గెలిచిన భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై అలవోక విజయాన్ని సాధించింది. మరోవైపు బంగ్లాదేశ్‌ తమకన్నా మెరుగైన శ్రీలంకను చిత్తు చేసింది. ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో ఉన్న ఈ జట్టు గతంలో భారత్‌కు కీలక మ్యాచ్‌ల్లో గట్టి షాక్‌లనే ఇచ్చింది. ఈ నేపథ్యంలో రోహిత్‌ సేన అనవసర అగచాట్లు పడకుండా ఉండాలంటే మ్యాచ్‌ ప్రారంభం నుంచే జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే హాంకాంగ్‌తో తొలిపోరులో చెమటలు కక్కిన భారత బృందం ఎలాగోలా గెలిచి ఊపిరిపీల్చుకుంది. ఇక్కడ అలాంటి అవకాశం బంగ్లాకు ఇస్తే టీమిండియాకు షాక్‌ తప్పదు. దీంతో రోహిత్‌ అలసత్వానికి తావివ్వకుండా కడదాకా స్థాయికి తగ్గ ఆటతీరును కొనసాగించాల్సిందే. 

బ్యాటింగే బలంగా... 
భారత జట్టు మరోసారి సమష్టితత్వంతో చెలరేగేందుకు సిద్ధమైంది. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాపార్డర్‌ చెలరేగగా, మిడిలార్డర్‌ తడబడింది. లేదంటే 300 పరుగుల స్కోరును అలవోకగా అధిగమించేది. ఇక పాక్‌తో జరిగిన తక్కువ స్కోర్ల మ్యాచ్‌లో మిడిలార్డర్‌కు అవకాశం దక్కలేదు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌ ధావన్‌ నిలకడగా ఆడగా, పాకిస్తాన్‌తో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, దినేశ్‌ కార్తీక్, రాయుడు టచ్‌లోకి వచ్చారు. ధోని, జాదవ్‌లు ఇంకా తమ బ్యాటింగ్‌ సత్తాను చూపాల్సివుంది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా స్థానంలో మనీశ్‌ పాండే లేదంటే జడేజా ఆడే అవకాశముంది. బౌలింగ్‌ విభాగంలో పేసర్లు భువనేశ్వర్, బుమ్రాలిద్దరూ పాక్‌ పనిపట్టారు. జాదవ్‌ కూడా మెరిశాడు. స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌లు కూడా హాంకాంగ్‌తో జరిగిన పోరులో ఆలస్యంగానైనా సత్తాచాటారు. కానీ పాకిస్తాన్‌తో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. అయితే బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో వీళ్లిద్దరి స్పిన్‌ కీలకమయ్యే అవకాశముంది. భారత్‌ ఫామ్‌ దృష్ట్యా ఇప్పుడున్న పరిస్థితుల్లో రోహిత్‌ సేన దుర్బేధ్యంగా కనిపిస్తోంది.  

పోటీనివ్వగలదా...
వన్డేల్లో బంగ్లాదేశ్‌ రాటుదేలింది. ఇటీవల స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఉరిమే ఉత్సాహంతో మొర్తజా సేన ఈ టోర్నీలో  ఆకట్టుకుంది. అయితే బ్యాటింగ్‌ కంటే బౌలింగే బంగ్లా ఆయుధమైంది. లంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ముష్ఫికర్‌ రహీమ్, మొహమ్మద్‌ మిథున్‌ మినహా ఇంకెవరూ పట్టుమని 15 పరుగులైనా చేయలేకపోయారు. అలాంటి పరిస్థితిలో పోరాడే లక్ష్యాన్ని నిలబెట్టిన ఘనత కచ్చితంగా బౌలర్లదే. బంతిని అందుకున్న ఆరుగురు బౌలర్లు వికెట్లు తీశారు. గురువారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించారు. షకీబుల్, అబు హైదర్, రూబెల్‌ హుస్సేన్‌ అఫ్గానిస్తాన్‌ టాప్, మిడిలార్డర్‌ను దెబ్బతీశారు. అయితే రషీద్‌ ఖాన్, గుల్బదిన్‌ నైబ్‌ల అజేయ భాగస్వామ్యం వల్ల అఫ్గానిస్తాన్‌ చెప్పుకోదగ్గ స్కోరు చేయగలిగింది. ఆ రెండు జట్ల కంటే భారత్‌ బలమైన ప్రత్యర్థి. అడపాదడపా వికెట్లతో, లేదంటే ఒకటి రెండు అర్ధసెంచరీలతో రోహిత్‌సేనను ఓడించడం కష్టం. ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరూ రాణిస్తేనే టీమిండియాపై ప్రభావం చూపగలుగుతుంది.  

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధావన్, రాయుడు, దినేశ్‌ కార్తీక్, ధోని, కేదార్‌ జాదవ్, మనీశ్‌ పాండే/ జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. 
బంగ్లాదేశ్‌: మొర్తజా (కెప్టెన్‌), లిటన్‌ దాస్, మోమినుల్‌ హక్, షకీబ్, మిథున్, మçహ్ముదుల్లా, మొసద్దిక్‌ హొస్సేన్, హసన్‌ మిరాజ్, రుబెల్‌ హొస్సేన్, నజ్ముల్, అబు హైదర్‌.

►సా. గం.5 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌  నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం 

►నేడు జరిగే మరో సూపర్‌ 4 మ్యాచ్‌లోపాకిస్తాన్‌తో అఫ్గానిస్తాన్‌ తలపడుతుంది 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement