రోహిత్‌ సిక్స్‌ కొడితే.. ఆమెను తాకింది!! | Hit by a six, fan gets signed hat from Rohit Sharma | Sakshi
Sakshi News home page

రోహిత్‌ సిక్స్‌ కొడితే.. ఆమెను తాకింది!!

Published Wed, Jul 3 2019 8:46 AM | Last Updated on Wed, Jul 3 2019 8:46 AM

Hit by a six, fan gets signed hat from Rohit Sharma - Sakshi

టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తన ఆటతీరుతోనే కాదు.. పెద్ద మనస్సుతోనూ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ చెలరేగి సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.  ఈ మ్యాచ్‌లో 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో రోహిత్‌ 104 పరుగులు చేశాడు. రోహిత్‌ బాదిన ఈ సిక్సర్లు ఈ మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచాయి. అయితే, దురదృష్టవశాత్తూ రోహిత్‌ బాదిన ఓ సిక్సర్‌.. గ్యాలరీలో మ్యాచ్‌ వీక్షిస్తున్న ఓ మహిళా అభిమానిని తాకింది. ఈ విషయాన్ని గుర్తించిన రోహిత్‌ మ్యాచ్‌ అనంతరం ఆమెను పరామర్శించారు. తన జ్ఞాపకంగా ఆ అభిమానికి సంతకం చేసిన టోపీని కానుకగా ఇచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. 

ఇక, శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర తర్వాత ఒకే ప్రపంచ కప్‌లో నాలుగు సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ వరల్డ్‌కప్‌లో నాలుగు సెంచరీలు చేసిన హిట్‌మ్యాన్‌ గత ప్రపంచకప్‌లో బంగ్లాపై ఒక సెంచరీ చేశాడు. దీంతో కలిపి రోహిత్‌ చేసిన మొత్తం శతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఈ విషయంలో 6 సెంచరీలు సాధించిన సచిన్‌ టెండూల్కర్‌ తర్వాతి స్థానంలో రోహిత్‌ ఉన్నాడు. 

ఇక శతకాల విషయానికొస్తే.. ఇప్పటివరకు రోహిత్‌ 26 వన్డే సెంచరీలు సాధించాడు. ఓవరాల్‌ జాబితాలో సచిన్‌ (49), కోహ్లి (41), పాంటింగ్‌ (30), జయసూర్య (28), ఆమ్లా (27) తర్వాత అతను ఆరో స్థానంలో ఉన్నాడు.  

వన్డే సిక్సర్ల విషయంలోనూ రోహిత్‌ దూకుడు కొనసాగుతోంది. ఇప్పటివరకు 230 సిక్స్‌లను రోహిత్‌ బాదాడు. ఈ విషయంలో ధోని (228)ని అధిగమించాడు. అఫ్రిది (351), గేల్‌ (326), జయసూర్య (270) అతని కంటే ముందున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement