కోల్‌కతా: టీమిండియా సారథి, ప్రధాన బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి గైర్హాజరితో పాకిస్తాన్‌తో తలపడే భారత జట్టుకు కలిగే నష్టమేమి లేదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఓ ప్రోమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆసియా కప్‌లో దాయాది దేశంపై టీమిండియాకు ఘనమైన రికార్డు ఉందని గుర్తు చేశారు. కానీ ఈ సారి ఆసియాకప్‌లో ఇరుజట్లకు విజయావకాశాలు సమానంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్ సిరీస్‌ల దృష్ట్యా సెలక్టర్లు విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చినప్పటికీ రోహిత్ సేన బలంగానే ఉందన్నారు. పాకిస్తాన్ జట్టు అన్ని రంగాల్లో ఇంకాస్త మెరుగుపడాలని సూచించారు.
చాంపియన్ ట్రోఫిలో పాక్‌పై టీమిండియా ఓడిపోయిందని, కానీ ఆ ప్రభావం ప్రస్తుత టోర్నీలో రోహిత్ సేనపై ఉండదని స్పష్టం చేశారు. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు అన్ని రంగాల్లో బలంగానే ఉందన్నారు. టీమిండియా ఆసియా కప్‌ను అత్యధికంగా ఆరు సార్లు గెలువగా, పాకిస్తాన్ కేవలం రెండు సార్లే గెలిచిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆసియాకప్‌లో రోహిత్ సేన తొలి మ్యాచ్ మంగళవారం హాంగ్‌కాంగ్‌తో తలపడిన మరుసటి రోజే(బుధవారం) దాయాది దేశమైన పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పసికూన హాంగ్‌కాంగ్‌పై పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment