
దుబాయ్: ఆసియా కప్ మొదలవడానికి కొద్ది రోజుల ముందే భారత-పాకిస్తాన్ జట్ల గురించి చర్చ మొదలైంది. ఈ ఆసియాకప్‌లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరాటం తప్పదని అంతా భావించారు. కానీ ఈ పోరాటంలో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను రెండుసార్లు చిత్తుగా ఓడించింది. ఇలా టీమిండియా చేతిలో పాక్ ఓడిపోవడం ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. జట్టు పేలవ ప్రదర్శనపై మండిపడుతున్నారు.ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తన తప్పుడు నిర్ణయాలతో జట్టు ఓటమికి కారణమయ్యాడని దుమ్మెత్తిపోస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలనే కెప్టెన్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఆసియా కప్‌లో ఎలాంటి ఫలితం వచ్చినప్పటికీ.. సర్ఫరాజ్ ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైంది. అతనికి ఎలాంటి ప్రతిభ లేదు. ఫామ్ కూడా లేదు. అసలు అతనికి బుర్రే లేదు. అతను క్రికెట్‌కు సరిపోడు' అని ఒక అభిమాని విమర్శించగా, ‘సర్ఫరాజ్ ఓవర్‌రేటెడ్ ప్లేయర్. పాక్ జట్టుకు గతంలో ఎంపిక కూడా కాలేదు’ అని మరొకరు విమర్శించారు. ‘అత్యంత సోమరి కెప్టెన్లలో సర్ఫరాజ్ ఒకరు. అతని కెప్టెన్సీని ఇక మేం అంగీకరించం’ మరొక అభిమాని మండిపడగా, ‘భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది అత్యంత అవమానకర ఓటమి. ఫైనల్స్‌లో సర్ఫరాజ్‌ను చూడాలనుకోవడం లేదు’ అని మరో పాక్ అభిమాని అసహనం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment