![Sarfraz Ahmed Says India Vs Pakistan World Cup Match Should be Played as Per Schedule - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/22/Sarfaraz-Ahmed.jpg.webp?itok=DVSk4E9R)
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరగాల్సిందేనని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. క్రీడలను ఎప్పుడూ రాజకీయాలతో ముడిపెట్టవద్దని, ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలకు చెందిన కోట్ల మంది అభిమానులు ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్‌ను రద్దు చేయమనడం తీవ్ర నిరాశను కల్గించిందని వ్యాఖ్యానించాడు. తానేప్పుడు పాకిస్తాన్ రాజకీయాలతో మిళితమై క్రీడలను చూడలేదని, క్రీడలను ఎప్పుడూ క్రీడల్లానే చూడాలని పేర్కొన్నాడు.
ఇక పుల్వామా ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు వీరమరణం పొందగా.. ఇంతటీ దారుణానికి ఒడిగట్టిన పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని యావత్ భారత్ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే పాక్‌తో మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేదని అభిమానులు, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఇక క్రికెట్ దిగ్గజాలు సచిన్, గవాస్కర్‌లు మాత్రం పాక్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకుంటే అది వారికి మేలు చేస్తుందని, పాక్‌తో మ్యాచ్ ఆడి గెలవాలని సూచిస్తున్నారు. బీసీసీఐ మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment