పాక్‌తో భారత్‌ ఆడకుంటే నష్టమేనా? | IF India Boycott Pakistan Match In World Cup 2019 What Happen | Sakshi
Sakshi News home page

పాక్‌తో భారత్‌ ఆడకుంటే ఏమవుతుంది?

Published Thu, Feb 21 2019 1:03 PM | Last Updated on Thu, May 30 2019 4:52 PM

IF India Boycott Pakistan Match In World Cup 2019 What Happen - Sakshi

హైదరాబాద్‌: పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌.. దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్‌ను ఉపసంహరించుకున్న భారత ప్రభుత్వం.. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీని 200% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత సినీ ఇండస్ట్రీ కూడా పాక్‌ కళాకారులపై నిషేధం విధించింది. ఆ దేశ క్రికెట్‌ బోర్డ్‌ పీసీబీకి భారత ఛానెల్‌ డీస్పోర్ట్స్‌ గట్టిషాక్‌ ఇచ్చింది. సరిగ్గా దాడి జరిగిన (ఫిబ్రవరి 14) రోజే ప్రారంభమైన పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రత్యక్షప్రసారాన్ని నిషేధించింది. అంతేకాకుండా భారత్‌లోని అన్ని క్రికెట్‌ మైదానాలలో పాక్‌ క్రికెటర్ల ఫోటోలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగే మ్యాచ్‌ ఆడవద్దనే డిమాండ్‌ వ్యక్తం అవుతోంది. రెండు పాయింట్లు పోయినా పర్లేదు కానీ.. ఉగ్రవాద ప్రేరేపిత దేశంతో ఆడే ముచ్చటే లేదని అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు. అయితే ప్రపంచకప్‌లో పాక్‌తో కోహ్లి సేన ఆడకుంటే లాభమా? నష్టమా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.  (పాక్‌పై నిషేధం వద్దంటున్న డయానా)

గెలిస్తే ఏం కాదు లేకుంటే..?
ప్రపంచప్‌ షెడ్యూల్‌ ప్రకారం ప్రతీ జట్టు తొమ్మిది మ్యాచ్‌లు ఆడాలి. అలా చివరికి పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు సెమీస్‌కు చేరుతాయి. ఒకవేళ పాక్‌తో టీమిండియా ఆడకూడదని నిశ్చయించుకుంటే ప్రత్యర్థి జట్టుకు రెండు పాయింట్లు వెళ్లిపోతాయి. ఈ క్రమంలో మిగిలిన ఎనిమిది మ్యాచ్‌ల్లో టీమిండియా అనుకోని ఓటములు చవిచూసినా.. మిగతా జట్లు సంచలన విజయాలు నమోదు చేసినా కోహ్లి సేనకు సెమీస్‌ బెర్త్‌ కష్టంగా మారుతోంది. అన్ని మ్యాచ్‌లు గెలిచి తొలి నాలుగు స్థానాల్లో ఉంటే పర్వాలేదు.. కానీ అనూహ్య ఓటములు ఎదురైతే మాత్రం రద్దైన మ్యాచ్‌ ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. ‘లీగ్‌ దశలో ఆడం సరే.. అదే ఏ సెమీస్‌లోనో, ఫైనల్లోనో ఆడాల్సి వస్తే మ్యాచ్‌ వదిలేసుకుంటామా?’ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. (‘వరల్డ్‌కప్‌లో పాక్‌తో ఆడకున్నా ఇబ్బందేం రాదు’)

గతంలో ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయా?
1996, 2003 ప్రపంచకప్‌లలో ఇలాంటి సందర్భాలే ఎదురయ్యాయి. 1996 ప్రపంచకప్‌ శ్రీలంక, భారత్‌, పాక్‌ దేశాలు ఆతిథ్యమిచ్చాయి. అయితే శ్రీలంకలో అప్పుడు భద్రత కారణాలతో వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా జట్లు కొలంబోలో జరగాల్సిన తమ మ్యాచ్‌లను రద్దు చేసుకున్నాయి. దీంతో ఆతిథ్య శ్రీలంక లాభపడింది. గ్రూప్‌లో ఆగ్రస్థానం సంపాదించి ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అదే 2003లో సీన్‌ రివర్సయింది. ఈ ప్రపంచకప్‌ దక్షిణాఫ్రికా, కెన్నా, జింబాబ్వే దేశాలు ఆతిథ్యమిచ్చాయి. ఈ మ్యాచ్‌లు నిర్వహించే సమయంలో జింబాబ్వేలో రాజకీయం సంక్షోభం తలెత్తింది. ప్రజల ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిపోయింది. ఈ క్రమంలో జింబాబ్వేలో జరిగే మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ రద్దు చేసుకుంది. ఈ ఎఫెక్ట్‌ ఇంగ్లండ్‌పై చాలానే పడింది.. గ్రూప్‌ దశలోనే ఇంటికి పయనమైంది. (మనం 82 మందిని చంపాలి!)

నిర్ణయం కేంద్రం చేతిలోనే
ప్రపంచకప్‌లో పాక్‌తో టీమిండియా ఆడాలా? వద్దా? అనే పూర్తి నిర్ణయం బీసీసీఐ కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. దీనిపై ఇప్పటివరకైతే ఐసీసీతో చర్చించాలని కూడా బోర్డు అనుకోవటం లేదని ఓ అధికారి తెలిపారు. అయితే ప్రపంచకప్‌లో పాక్‌ను నిషేధించేలా ఐసీసీపై ఒత్తిడి తీసుకొద్దమని క్రికెట్‌ పెద్దన్న బీసీసీఐ భావిస్తోంది. భారత్‌ను కాదని ప్రపంచకప్‌లో ఐసీసీకి ముందుకెళ్లదని బీసీసీఐ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ప్రపంచకప్‌, పాక్‌ మ్యాచ్‌ గురించి ఈ నెల 27న జరగనున్న బీసీసీఐ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. (ఉగ్రదాడి: ధర్మశాలలో పాక్‌ క్రికెటర్ల ఫోటోలు తొలగింపు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement