దుబాయ్ : ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న దేశాలతో మిగతా క్రికెట్ దేశాలు సంబంధాలను తెంచుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు బీసీసీఐ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన త్రైమాసిక బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించిన గవర్నింగ్ బాడీ సభ్యులు బీసీసీఐ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. ఈ సమావేశానికి ముందు ఐసీసీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ బీసీసీఐ ప్రతిపాదనను అమలు చేయడం చాలా కష్టమని మీడియాకు తెలిపారు. క్రికెట్‌నే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని, రాజకీయ సంక్షోభాలకు ఐసీసీలో తావులేదని తెలిపారు.
ఇక ఉగ్రదాడి నేపథ్యంలో త్వరలో జరిగే వరల్డ్‌కప్‌లో పాల్గొనే ఆటగాళ్లు, అధికారుల భ్రదత, క్షేమం గురించి బీసీసీఐ ఆందోళన చెందుతుందని, భారత్‌లో జరిగిన ఉగ్రదాడిని ఐసీసీలోని చాలా సభ్యదేశాలు (బ్రిటన్ సహా) ఖండించాయని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో సంబంధాలు తెంచుకోవాలని క్రికెట్ ప్రపంచాన్ని కోరుతున్నామని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశమనే ప్రస్తావించారు తప్పా ఎక్కడా పాకిస్తానని పేర్కొనలేదు. ఈ లేఖను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఖండించింది. ఈ లేఖ నేపథ్యంలో 2020 టీ20 ప్రపంచకప్, 2023 ప్రపంచకప్‌లకు ఆతిథ్యమివ్వనున్న భారత్ తమ ఆటగాళ్లకు వీసాలు ఇస్తుందా? లేదా? అని ఐసీసీని ప్రశ్నించింది. దీనికి ఎప్పటిలానే టోర్నీలో పాల్గొనే జట్లన్నిటికి వీసాలు లభిస్తాయని మనోహర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment