
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జాతీయ జట్టులో ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు లభిస్తున్నా సరైన ప్రదర్శన చేయలేకపోతున్న వారిని తొలగించడానికి ఇక వెనుకాడబోమని చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ హెచ్చరించాడు. భారత క్రికెట్ సత్తాను పరీక్షించేందుకు ఆటగాళ్లకు పదే పదే అవకాశాలు ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఒకవేళ ఆ అవకాశాల్ని ఒడిసి పట్టుకోవడంలో ఎవరైతే విఫలమవుతారో వారిపై వేటు తప్పదనే సంకేతాలు పంపాడు. తగినన్ని అవకాశాలు ఇచ్చినా ఆటగాళ్లు ఉపయోగించుకోకుంటే దేశవాళీలో మెరుగ్గా రాణిస్తున్న కుర్రాళ్లపై తాము దృష్టిపెట్టాల్సివుంటుందని ఎంఎస్‌కే తేల్చి చెప్పాడు.
ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టులో రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు తనకు సంతోషాన్ని కల్గించిందన్నాడు. ‘ నిజం చెప్పాలంటే అతడి బ్యాటింగ్ నైపుణ్యంపై నాకెప్పుడూ ఎలాంటి అనుమానమూ లేదు. అతడి వికెట్ కీపింగే మెరుగుపడాలి’ అని అన్నాడు. ఆసియాకప్‌లో కోహ్లికి విశ్రాంతి ఇచ్చినట్లే.. వెస్టిండీస్‌తో సిరీస్‌లో కూడా కొందరు ఆటగాళ్లకు విశ్రాంతి కల్పిస్తామని ప్రసాద్ చెప్పాడు. భారత్-ఏ తరఫున, దేశవాళీ మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారిస్తున్న మయాంక్ అగర్వాల్‌కు త్వరలోనే అవకాశం వస్తుందని ఎమ్మెస్కే ప్రసాద్ పేర‍్కొన్నాడు. ఆసియాకప్‌లో భారత జట్టు.. తన ఆరంభపు మ్యాచ్‌ను మంగళవారం హాంకాంగ్‌తో ఆడనుంది.